‘బురఖా’ను అనుమతించాలి
సాక్షి, ముంబై: ఈ విద్యా సంవత్సరంలో 10, 12వ తరగతి పరీక్షలు రాసే ముస్లిం విద్యార్థినిలను బురఖాతో పరీక్ష కేంద్రాలకు అనుమతించాలని మహారాష్ట్ర సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యా బోర్డు స్పష్టం చేసింది. అందుకు అవసరమైన సర్క్యూలర్ అన్ని పాఠశాలలకు పంపించింది. దీంతో బురఖాతో పరీక్ష కేంద్రాలకు వచ్చే ముస్లిం బాలికలకు ఊరట లభించిం ది. ఈ నెల మూడో వారం నుంచి 12వ తరగతి పరీక్షలు, మార్చి ఆఖరు వారం నుంచి 10వ తరగతి పరీక్షలు జరనున్నాయి.
గతంతో 10, 12 తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన ముస్లిం విదార్థినిలను కొన్ని కేంద్రాలలో ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకునే వారు. బురఖా తీసి, తనిఖీ చేసిన తరువాత మాత్రమే వారిని లోపలికి అనుమతించే వారు. దీంతో వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా బోర్డు ఓ సర్క్యులర్ జారీ చేసింది. బురఖా తీయమని చెప్పడం, తనఖీ చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మతాన్ని అవమానించినట్లవుతుందని బోర్డు అభిప్రాయపడింది. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద గందరగోళం నెలకొనే ప్రమాదముందని, దాన్ని నివారించేందుకు తాజా ఆదేశాలు జారీ చేసింది.