సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్ష జరగనుండగా.. మార్చి 2నుంచి సెకండియర్ విద్యార్థులకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.06 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 123 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం చిరునామా సులువుగా తెలుసుకునేందుకు వీలుగా అధికారులు ‘ఎగ్జామ్ సెంటర్ లొకేటర్’ మొబైల్ యాప్‌ని రూపొందించారు. ఈ యాప్‌లో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేస్తే పరీక్ష కేంద్రానికి దారులను చూపిస్తుంది. విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
నిఘానేత్రం నడుమ..
పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల బండిళ్లను సీసీ కెమెరాల ముందే తెరుస్తారు. ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్, నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వీటికితోడు హైపర్ కమిటీ, కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) కూడా పరీక్షల నిర్వహణ తీరును నిత్యం పర్యవేక్షిస్తాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. అలాగే ప్రతి కేంద్రంలో ప్రథమ చికిత్స పెట్టె, ఒక ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. దాదాపు అన్ని పరీక్ష కేంద్రాలను చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనుంది.
ముందే వెళ్తే మంచింది..
పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష హాళ్లలోకి విద్యార్థులను అనుమతిస్తారు. తప్పనిసరిగా హాల్‌టికెట్‌ను తీసుకెళ్లాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలనూ లోనికి అనుమతించరు. పరీక్ష సమయాన్ని మించి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పరీక్షకు ఒకరోజు ముందుగానే వెళ్లి కేంద్రాలను చూసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వెంక్యానాయక్ సూచించారు. ముందుగా చూసుకోవడం వల్ల కేంద్ర చిరునామా, రవాణా సౌకర్యాలు, చేరుకోవడానికి పట్టే సమయం తదితర అంశాలపై అవగాహన వస్తుందన్నారు. ఒత్తిడి, ఆందోళనకు గురికావొద్దని విద్యార్థులకు సూచించారు. ప్రశాంతంగా ఆలోచిస్తూ పరీక్షలు రాయాలని చెప్పారు. తొలుత సమాధానాలు తెలిసిన ప్రశ్నలను ఎదుర్కోవాలన్నారు.
ఆహారం విషయంలో జాగ్రత్త
ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది. నీరసం రాకుండా పరీక్షకు వెళ్లేముందు అల్పాహారం తీసుకోవడం ఉత్తమం. పళ్లరసం ఉంటే మేలు. సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వాలని డైటీషియన్లు సూచిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment