సీసీ కెమెరాలు చోరీకి గురైన పరీక్షా కేంద్రం ఇదే
సాక్షి, వీరఘట్టం: ఇప్పటికే అత్యంత సమస్యాత్మక పరీక్షా కేంద్రంగా గుర్తింపు పొందిన వీరఘట్టం పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. బాలికోన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు.శనివారం ఈ విషయాన్ని గుర్తించిన ఇక్కడ పరీక్షల చీఫ్ అధికారి బి.సొంబర జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ పి.ఇందిరామణి, ఏఎస్‌ఐ రమణబాబులు వచ్చి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. వాస్తవానికి శుక్రవారం జరిగిన సోషల్ పేపర్–1కు సీసీ కెమెరాలు ఉన్నాయని, శనివారం ఉదయం పరీక్ష గదులు తెలిచి ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా నాలుగు గదుల్లో సీసీ కెమెరాలు కనబడలేదని వాటిని అమర్చిన వైర్లు కట్ చేసి ఉన్నాయని చీఫ్ అధికారి బి.సొంబర తెలిపారు.
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ
జిల్లాలోని సమస్యాత్మక కేంద్రాల్లో వీరఘట్టం బాలురు, బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షాలు కేంద్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు బాలికోన్నత పాఠశాల పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలు దొంగిలించడంపై జిల్లా విద్యాశాఖ మండిపడుతోంది. ఇక నుంచి ఇక్కడ పరీక్షలను పకడబ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాం స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో భవిష్యత్‌లో ఈ కేంద్రాలను ప్రభుత్వం ఎత్తివేయవచ్చునని అభిప్రాయ పడ్డారు.
తల్లిదండ్రుల ఆందోళన
వీరఘట్టం పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే విద్యార్థుల కంటే ఆకతాయి కుర్రాళ్లే ఎక్కువ మంది పరీక్షా కేంద్రం పరిసరాల్లో తిరుగుతున్నారని, వారిలో ఎవరో చేసిన పనేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు తమ విద్యార్థులు బలైపోతున్నారని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment