veera ghattam
-
కత్తి దూసిన కక్ష..తల్లీ కొడుకులపై హత్యాయత్నం
వీరఘట్టం: పాత కక్షల నేపథ్యంలో తల్లీ కొడుకులపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుకూరు ఎస్సీ కాలనికి చెందిన తల్లీకుమారులు నిడగంటి రూపావతి, జనార్దనరావులకు అదే వీధికి చెందిన మామిడి ఈశ్వరరావుతో పాతకక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరఘట్టం వెళ్లి ఇంటికి వస్తున్న జనార్దనరావుపై ఈశ్వరరావు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ విషయాన్ని గమనించిన రూపావతి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేయడంతో చేతులకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను వీరఘట్టం పీహెచ్‌సీకి తరలించి ప్రథమచికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నడుకూరు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
చెప్పు కోసం దిగి చచ్చిపోయాడు!
వీరఘట్టం(శ్రీకాకుళం): మృత్యువు ఎవరిని ఎలా కబళిస్తోందో చెప్పలేమనేందుకు ఈ ఘటన ఉదాహరణ. ఆటోలో వెళ్తుండగా కాలుకున్న చెప్పుజారిపోవడంతో దాన్ని తీసుకోవడానికి సడన్‌గా దిగిపోవడంతో అదుపుతప్పిన వ్యక్తి రోడ్డుకు ఢీకొని చనిపోయాడు. ఈ సంఘటన వండవ జంక్షన్‌కు సమీపంలోని శివాలయం వద్ద సోమవారం చోటుచేసుకోగా.. అదే గ్రామానికి చెందిన వృద్ధుడు ఎచ్చెర్ల పెద్దఅప్పడు (61) మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం కూర కోసం చికెన్ తీసుకురమ్మని ఎచ్చెర్ల పెద్దఅప్పడుకు అతని భార్య నరసమ్మ చెప్పింది. దీంతో వండవ జంక్షన్లో ఉన్న షాపుకు వెళ్లి అరకిలో చికెన్ కొనుగోలు చేశాడు. తిరిగి ఇంటి వచ్చే క్రమంలో ఓ ఆటో ఎక్కి వెనుకాల కూర్చున్నాడు. ఆటో కదిలింది కొంత దూరం వెళ్లిన తరువాత అతని కాలుకున్న చెప్పు కిందకు పడిపోవడంతో దాన్ని తీసుకుందామనే తొందరలో కదులుతున్న ఆటోనుంచి కిందకు దూకేయడంతో రోడ్డుకు తల బలంగా గుద్దుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా పెద్దఅప్పడు మార్గమధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఎస్సై జి.భాస్కరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు పెద్దఅప్పడు భార్య నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమారులున్నారు. అంతవరకు కళ్ల ముందే తిరిగిన పెద్దఅప్పడు ఆకస్మిక మరణంతో వండవ గ్రామంలో విషాదం నెలకొంది. -
సీసీ కెమెరాల అపహరణ
సాక్షి, వీరఘట్టం: ఇప్పటికే అత్యంత సమస్యాత్మక పరీక్షా కేంద్రంగా గుర్తింపు పొందిన వీరఘట్టం పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. బాలికోన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు.శనివారం ఈ విషయాన్ని గుర్తించిన ఇక్కడ పరీక్షల చీఫ్ అధికారి బి.సొంబర జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ పి.ఇందిరామణి, ఏఎస్ఐ రమణబాబులు వచ్చి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. వాస్తవానికి శుక్రవారం జరిగిన సోషల్ పేపర్–1కు సీసీ కెమెరాలు ఉన్నాయని, శనివారం ఉదయం పరీక్ష గదులు తెలిచి ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా నాలుగు గదుల్లో సీసీ కెమెరాలు కనబడలేదని వాటిని అమర్చిన వైర్లు కట్ చేసి ఉన్నాయని చీఫ్ అధికారి బి.సొంబర తెలిపారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జిల్లాలోని సమస్యాత్మక కేంద్రాల్లో వీరఘట్టం బాలురు, బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షాలు కేంద్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు బాలికోన్నత పాఠశాల పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలు దొంగిలించడంపై జిల్లా విద్యాశాఖ మండిపడుతోంది. ఇక నుంచి ఇక్కడ పరీక్షలను పకడబ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాం స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో భవిష్యత్‌లో ఈ కేంద్రాలను ప్రభుత్వం ఎత్తివేయవచ్చునని అభిప్రాయ పడ్డారు. తల్లిదండ్రుల ఆందోళన వీరఘట్టం పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే విద్యార్థుల కంటే ఆకతాయి కుర్రాళ్లే ఎక్కువ మంది పరీక్షా కేంద్రం పరిసరాల్లో తిరుగుతున్నారని, వారిలో ఎవరో చేసిన పనేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు తమ విద్యార్థులు బలైపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. -
వెండితెరపై వీరఘట్టం యోధుడు
వీరఘట్టం : మల్లమార్తాండ.. కలియుగ భీముడు.. ఇండియన్ హెర్క్యులస్గా దేశ కీర్తి ప్రతిష్టలను విదేశాల్లో చాటిచెప్పిన కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు అడుగులు పడుతున్నాయని తెలియడంతో జిల్లాలో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాత్రలో సినీనటుడు రాణా దగ్గుబాటి కనిపించబోతున్నారనే వార్త పత్రికల్లో చూసిన వారంతా సంబరపడుతున్నారు. వీరఘట్టం యోధుడి చరిత్ర వెండితెరపై రానుందంటే అంతా గర్వించదగ్గ విషయమని రామ్మూర్తినాయుడు స్వగ్రామం వీరఘట్టం ప్రజలు ఆనందపడుతున్నారు. సినిమాల్లో హీరోలు ఒంటి చేత్తో కారును ఆపడం, రెండు తాళ్లు కట్టి కార్లను లాగడం, బండరాళ్లను ఛాతీపై పెట్టి సమ్మెటలతో కొట్టించుకోవడం వంటి ప్రదర్శనలు.. రామ్మూర్తినాయుడు నిజజీవితంలో ఎన్నో చేశారు. సర్కస్ కంపెనీ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ హెర్క్యులస్గా పేరుగడించారు. బడికి డుమ్మాకొట్టేవాడు రామ్మూర్తినాయుడు తండ్రి వెంకన్ననాయుడు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన రామ్మూర్తిని తండ్రి ఎంతో గారాబంగా చూడటంతో బాల్యంలో బడికి డుమ్మాకొట్టేవాడు. వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజచెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయం చేస్తుండేవాడు. దీంతో బాల్యంలోనే కొడుకుని వీరఘట్టం నుంచి విజయనగరంలోని పినతండ్రి నారాయణస్వామి ఇంటికి వెంకన్ననాయుడు పంపించేశారు. విజయనగరంలోనూ చదువు కంటే వ్యాయామంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతూ మల్లయుద్ధం పోటీల్లో పాల్గొని రామ్మూర్తినాయుడు విజేతగా నిలిచాడు. అనంతరం రామ్మూర్తిని నారాయణస్వామి మద్రాసు పంపించి వ్యాయామ కళాశాలలో చేర్పించారు. అనంతరం తాను చదువుకున్న కాలేజీలోనే పీడీగా చేరారు. రామ్మూర్తినాయుడు వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్య ప్రదర్శించారు. తర్వాత విజయనగరంలో ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. 20 ఏళ్ల వయస్సులోనే రామ్మూర్తి 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. ఉక్కు గొలుసులతో బంధిస్తే.. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, వాటిని తెంచేవారు. గొలుసులతో రెండు కార్లను కట్టి.. వాటిని లాగేవారు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్,చైనా, బర్మా దేశాల్లో రామ్మూర్తినాయుడు ప్రదర్శనలు ఇచ్చి దేశ కీర్తి చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్ధిరపడ్డారు.ఇటువంటి మహాబలుడి జీవిత గాథ తెరకెక్కించేందుకు ఇటీవల ఓ ప్రముఖ సినీ సంస్థ వీరఘట్టం వచ్చి రామ్మూర్తినాయుడు సంచరించిన ప్రదేశాలు, నివాస గృహాన్ని పరిశీలించింది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర తీసేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. చిన్నప్పుడు ఆయన సాహసాలు విన్నాం రామ్మూర్తినాయుడు మా చిన్న తాతయ్య. మా చిన్నతనంలో ఆయన విన్యాసాలు, సాహసాల గురించి విన్నాం. ఎన్నో దేశాల్లో ప్రదర్శనలిస్తూ ఎంతో కీర్తి సంపాదించారు. అటువంటి వారికి మనవడిని అయనందుకు గర్వంగా ఉంది. ఇటీవల ఓ సినీ సంస్థ వారు వచ్చారు. జీవిత చరిత్ర తీస్తామంటే అంతా అంగీకరించాం. ఎప్పుడు సినిమా మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నాం. – కోడి వెంకటరావునాయుడు.రామ్మూర్తినాయుడి మనవడు.,వీరఘట్టం మా కెంతో గర్వకారణం మా గ్రామానికి చెందిన ప్రసిద్ధ మల్లయోధుడు రామ్మూర్తినాయుడు జీవిత చరిత్ర సినిమాగా వస్తోందంటే మాకేంతో గర్వకారణంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పిన మహానుభావుని చరిత్రను ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వాలి. – ఇట్లా మన్మథరావు,వీరఘట్టం -
నాగావళి ఎడమ కాలువకు గండి
వీరఘట్టం: శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నర్సీపురం దగ్గర నాగావళి ఎడమ కాల్వకు గురువారం ఉదయం భారీ గండి పడింది. సైపూన్ వద్ద కాలువకు గండి పడటంతో.. నీరు పంటపోలాల్లోకి వెళ్తోంది. దీంతో సుమారు 50 వేల ఎకరాలకు అందాల్సిన సాగు నీరు వృథాగా పోతోంది. విషయం అధికారులు దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.