కోడి రామ్మూర్తి నాయుడు చిత్రపటం, వీరఘట్టంలో ఉన్న కోడి రామ్మూర్తినాయుడు విగ్రహం
వీరఘట్టం : మల్లమార్తాండ.. కలియుగ భీముడు.. ఇండియన్ హెర్క్యులస్‌గా దేశ కీర్తి ప్రతిష్టలను విదేశాల్లో చాటిచెప్పిన కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు అడుగులు పడుతున్నాయని తెలియడంతో జిల్లాలో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాత్రలో సినీనటుడు రాణా దగ్గుబాటి కనిపించబోతున్నారనే వార్త పత్రికల్లో చూసిన వారంతా సంబరపడుతున్నారు.
వీరఘట్టం యోధుడి చరిత్ర వెండితెరపై రానుందంటే అంతా గర్వించదగ్గ విషయమని రామ్మూర్తినాయుడు స్వగ్రామం వీరఘట్టం ప్రజలు ఆనందపడుతున్నారు. సినిమాల్లో హీరోలు ఒంటి చేత్తో కారును ఆపడం, రెండు తాళ్లు కట్టి కార్లను లాగడం, బండరాళ్లను ఛాతీపై పెట్టి సమ్మెటలతో కొట్టించుకోవడం వంటి ప్రదర్శనలు.. రామ్మూర్తినాయుడు నిజజీవితంలో ఎన్నో చేశారు. సర్కస్ కంపెనీ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ హెర్క్యులస్‌గా పేరుగడించారు.
బడికి డుమ్మాకొట్టేవాడు
రామ్మూర్తినాయుడు తండ్రి వెంకన్ననాయుడు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన రామ్మూర్తిని తండ్రి ఎంతో గారాబంగా చూడటంతో బాల్యంలో బడికి డుమ్మాకొట్టేవాడు. వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజచెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయం చేస్తుండేవాడు. దీంతో బాల్యంలోనే కొడుకుని వీరఘట్టం నుంచి విజయనగరంలోని పినతండ్రి నారాయణస్వామి ఇంటికి వెంకన్ననాయుడు పంపించేశారు.
విజయనగరంలోనూ చదువు కంటే వ్యాయామంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతూ మల్లయుద్ధం పోటీల్లో పాల్గొని రామ్మూర్తినాయుడు విజేతగా నిలిచాడు. అనంతరం రామ్మూర్తిని నారాయణస్వామి మద్రాసు పంపించి వ్యాయామ కళాశాలలో చేర్పించారు. అనంతరం తాను చదువుకున్న కాలేజీలోనే పీడీగా చేరారు. రామ్మూర్తినాయుడు వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్య ప్రదర్శించారు. తర్వాత విజయనగరంలో ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.
20 ఏళ్ల వయస్సులోనే
రామ్మూర్తి 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. ఉక్కు గొలుసులతో బంధిస్తే.. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, వాటిని తెంచేవారు. గొలుసులతో రెండు కార్లను కట్టి.. వాటిని లాగేవారు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్,చైనా, బర్మా దేశాల్లో రామ్మూర్తినాయుడు ప్రదర్శనలు ఇచ్చి దేశ కీర్తి చాటిచెప్పారు.
బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్ధిరపడ్డారు.ఇటువంటి మహాబలుడి జీవిత గాథ తెరకెక్కించేందుకు ఇటీవల ఓ ప్రముఖ సినీ సంస్థ వీరఘట్టం వచ్చి రామ్మూర్తినాయుడు సంచరించిన ప్రదేశాలు, నివాస గృహాన్ని పరిశీలించింది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర తీసేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది.
చిన్నప్పుడు ఆయన సాహసాలు విన్నాం
రామ్మూర్తినాయుడు మా చిన్న తాతయ్య. మా చిన్నతనంలో ఆయన విన్యాసాలు, సాహసాల గురించి విన్నాం. ఎన్నో దేశాల్లో ప్రదర్శనలిస్తూ ఎంతో కీర్తి సంపాదించారు. అటువంటి వారికి మనవడిని అయనందుకు గర్వంగా ఉంది. ఇటీవల ఓ సినీ సంస్థ వారు వచ్చారు. జీవిత చరిత్ర తీస్తామంటే అంతా అంగీకరించాం. ఎప్పుడు సినిమా మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నాం.
– కోడి వెంకటరావునాయుడు.రామ్మూర్తినాయుడి మనవడు.,వీరఘట్టం
మా కెంతో గర్వకారణం
మా గ్రామానికి చెందిన ప్రసిద్ధ మల్లయోధుడు రామ్మూర్తినాయుడు జీవిత చరిత్ర సినిమాగా వస్తోందంటే మాకేంతో గర్వకారణంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పిన మహానుభావుని చరిత్రను ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వాలి. – ఇట్లా మన్మథరావు,వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment