వీరఘట్టం(శ్రీకాకుళం): మృత్యువు ఎవరిని ఎలా కబళిస్తోందో చెప్పలేమనేందుకు ఈ ఘటన ఉదాహరణ. ఆటోలో వెళ్తుండగా కాలుకున్న చెప్పుజారిపోవడంతో దాన్ని తీసుకోవడానికి సడన్‌గా దిగిపోవడంతో అదుపుతప్పిన వ్యక్తి రోడ్డుకు ఢీకొని చనిపోయాడు. ఈ సంఘటన వండవ జంక్షన్‌కు సమీపంలోని శివాలయం వద్ద సోమవారం చోటుచేసుకోగా.. అదే గ్రామానికి చెందిన వృద్ధుడు ఎచ్చెర్ల పెద్దఅప్పడు (61) మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం కూర కోసం చికెన్ తీసుకురమ్మని ఎచ్చెర్ల పెద్దఅప్పడుకు అతని భార్య నరసమ్మ చెప్పింది. దీంతో వండవ జంక్షన్‌లో ఉన్న షాపుకు వెళ్లి అరకిలో చికెన్ కొనుగోలు చేశాడు. తిరిగి ఇంటి వచ్చే క్రమంలో ఓ ఆటో ఎక్కి వెనుకాల కూర్చున్నాడు. ఆటో కదిలింది కొంత దూరం వెళ్లిన తరువాత అతని కాలుకున్న చెప్పు కిందకు పడిపోవడంతో దాన్ని తీసుకుందామనే తొందరలో కదులుతున్న ఆటోనుంచి కిందకు దూకేయడంతో రోడ్డుకు తల బలంగా గుద్దుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా పెద్దఅప్పడు మార్గమధ్యలోనే మృతి చెందాడు.
కేసు నమోదు
ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఎస్సై జి.భాస్కరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు పెద్దఅప్పడు భార్య నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమారులున్నారు. అంతవరకు కళ్ల ముందే తిరిగిన పెద్దఅప్పడు ఆకస్మిక మరణంతో వండవ గ్రామంలో విషాదం నెలకొంది.
చెప్పు కోసం దిగి చచ్చిపోయాడు!
Published Tue, Feb 2 2021 3:38 PM | Last Updated on Tue, Feb 2 2021 6:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment