
నాలుగు నెలల చిన్నారి మృతదేహం లభ్యం
మరో పాప, తల్లి గల్లంతు గాలిస్తున్న పోలీసులు
పటమట(విజయవాడతూర్పు): ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను కాలువలోకి నెట్టి, తానూ దూకి ఆత్మహత్యకు యత్నంచింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతదేహం లభించగా.. తల్లి, మరో కుమార్తె ఆచూకీ లభించలేదు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని స్క్రూబ్రిడ్జి వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే దీనికి కారణమని తెలిసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గుంటూరు శారద కాలనీకి చెందిన తిరుపతిరావు రోజువారీ పనులకు వెళ్తుంటాడు. అతనికి సుధారాణి(25)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. వారికి జాస్వీ (16 నెలలు), బ్లెస్సీ(4 నెలలు) సంతానం.
శనివారం గుంటూరులో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. విజయవాడ కృష్ణలంకలోని కళానగర్‌లో నివసించే తిరుపతిరావు బావ కోటేశ్వరరావు ఇంటికి భార్యాభర్తలు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో ఫోను వచి్చందని తిరుపతిరావు బయటకు వెళ్లాడు. ఆ వెంటనే సుధారాణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి స్క్రూబ్రిడ్జికి చేరుకుని ఇద్దరు పిల్లలను బందరు కాలువలో పడేసి ఆమె కూడా దూకింది.
స్థానికులు దీనిని గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేయగా బ్లెస్సీ మృతదేహం దొరికింది. విషయం తెలుసుకున్న పటమట సీఐ పవన్‌కిషోర్ ఎన్‌డీఆర్‌ఎఫ్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జాస్వీ, సుధారాణిల ఆచూకీ లభించలేదు. పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment