
విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ధనలక్ష్మి, విషాద వదనాలతో ధనలక్ష్మి కొడుకు, కూతురు
యలమంచిలి రూరల్: ముద్దుల కొడుకు పుట్టిన రోజు.. వరాల బాబు తమ జీవితాల్లోకి అడుగుపెట్టిన రోజు.. తలంటాలి, కొత్త దుస్తులు తొడగాలి, మిఠాయి తినిపించాలి.. అందుకే ఆ తల్లి వేడి నీళ్లు సిద్ధం చేస్తోంది.. బకెట్ నీటిలో హీటర్ పెట్టి నీళ్లు వేడి చేస్తోంది. అంతలోనే ఆ ప్రయత్నంలోనే విద్యుతాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. పిల్లల్ని అనాథలను చేసి కన్నుమూసింది. వేడుక వేళ ఆ ఇంటిలో తాండవించిన విషాదం చూపరులను సైతం కన్నీళ్లు పెట్టించింది. ఈ దుర్ఘటన పెద్దపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
శానాపతి ధనలక్ష్మి (26) తన కుమారుడు వినయ్ పుట్టినరోజు కావడంతో బాలుడికి స్నానం చేయించేందుకు బకెట్‌లో హీటర్ పెట్టి నీటిని మరిగించే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురైంది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ధనలక్ష్మిని కాపాడే ప్రయత్నంలో ఆమె భర్త ప్రసాద్‌కు కూడా స్వల్పగాయాలయ్యాయి. ప్రసాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యలమంచిలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఒక పాప, బాబు ఉన్నారు. పాప స్థానిక ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతుండగా.. కుమారుడు వినయ్ అంగన్‌వాడీ పాఠశాలలో చేర్పించారు. హేమాంబిక గుడిలో అభిషేకం చేయించాలని, అంగన్‌వాడీ పాఠశాలలో చాక్లెట్లు పంచాలని అన్నీ సిద్ధం చేసి అంతలోనే కన్నుమూసిందని కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి.
Comments
Please login to add a commentAdd a comment