రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీ గంగురాజుపురం ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తల్లి మృతి చెందగా తనయుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గంగురాజుపురంలో నివాసముంటున్న సుబ్బరత్న అక్కడి ఓ మిల్లులో కూలీగా పనిచేస్తోంది. బుధవారం ఆమెను మిల్లు వద్ద వదిలిపెట్టేందుకు ఆమె కుమారుడు వెంకటేష్ బైకులో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో వీరికి పరిచయమున్న అమిరుద్దీన్ అనే వ్యక్తి కనిపించాడు.
దీంతో రోడ్డు పక్క బైకును నిలిపి అతనితో మాట్లాడుతుండగా వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బరత్న అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అమిరుద్దీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సుబ్బరత్న భర్త చిన్నయ్య ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని బతుకుదెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆమె మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కులేనిదిగా తయారైంది. ప్రమాదానికి కారణమైన లారీని మంగంపేట వద్ద స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైకును ఢీకొన్న లారీ తల్లి మృతి, తనయుడికి తీవ్ర గాయాలు
Published Thu, May 7 2015 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement