రాజేంద్రనగర్/పహాడీషరీఫ్: ‘అమ్మ చావుకు ఆస్పత్రి వైద్యులే కారణం, వారి నిర్లక్ష్యం కారణంగానే అమ్మ చనిపోయింది’అని సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ తల్లి మరణాన్ని తట్టుకోలేని ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి వైద్య ఖర్చులకోసం శ్రీహరి తన స్నేహితుల వద్ద రూ.10 లక్షలు అప్పు చేసి ఆస్పత్రి బిల్లులు చెల్లించాడని, మరో రూ.3 లక్షలు చెల్లించాలని చెప్పడంతో అటు తల్లిని కోల్పోయి.. ఇటు మిగిలిన బిల్లు ఎలా కట్టాలో తెలియక శ్రీహరి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు అంటున్నారు.
వివరాలిలా ఉన్నాయి.. డిగ్రీ చదువుతున్న శ్రీహరి (25) తండ్రి రిటైర్డ్ కానిస్టేబుల్ రామచంద్రయ్య, తల్లి రుక్మిణి (60)తో కలసి రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి మధుబన్ కాలనీలో నివసిస్తున్నాడు. వారం కిందట తల్లి రుక్మిణికి కరోనా సోకడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. కాగా, అంతకు కొద్ది సేపటి ముందు ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తానని చెప్పిన శ్రీహరి.. తన స్నేహితుడు సాయిని ఆస్పత్రి వద్ద ఉంచి వెళ్లాడు. అదే సమయంలో రుక్మిణి మరణవార్తను ఆస్పత్రి సిబ్బంది సాయికి చెప్పడంతో ఆ విషయాన్ని ఫోన్ చేసి శ్రీహరికి చెప్పాడు.
అప్పటినుంచి శ్రీహరి ఆచూకీ లభ్యంకాలేదు. అయితే తన తల్లిని ఆస్పత్రి డాక్టర్లే చంపారని, వారి నిర్లక్ష్యమే తల్లిని బలితీసుకుందని ఆరోపిస్తూ అతను సెల్ఫీ వీడియో రికార్డు చేసి స్నేహితులకు పోస్ట్ చేశాడు. దీంతో వారు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో వెతికినా శ్రీహరి జాడ లభించలేదు. చివరకు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉందాసాగర్ చెరువులో శనివారం మధ్యాహ్నం శ్రీహరి మృతదేహం లభించింది. ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అటు భార్య, ఇటు కుమారుడు..
గంటల వ్యవధిలో భార్య, కుమారుడు మృతిచెందడంతో రామచంద్రయ్య కుప్పకూలాడు. కుమారుడు శ్రీహరి ఏమైపోయాడో తెలియని పరిస్థితుల్లో శనివారం మధ్యాహ్నం భార్య అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో కుమారుడు కూడా మృతిచెందాడన్న వార్త విని రామచంద్రయ్య తట్టుకోలేకపోయాడు. బంధువులు అతడికి సపర్యలు చేసి ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పోలీసులు శ్రీహరి మృతదేహాన్ని అప్పగించడంతో రాత్రి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
అమ్మను చంపేశారు.. అందుకే చనిపోతున్నా...
Published Sun, May 30 2021 5:12 AM | Last Updated on Sun, May 30 2021 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment