
సాక్షి, అన్నానగర్ : చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచుకున్న కుమారుడు ప్రమాదంలో మరణించాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లి కూడా ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన తమిళనాడులోని వేడచందూర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. దిండుక్కల్ జిల్లా వేడచందూర్ సమీపంలో ఉన్న సత్తీరపట్టికి చెందిన కాత్తవరాయన్ (55), ఈశ్వరి (51) దంపతులు. వీరికి మకుఠీశ్వరన్ (24) అనే కుమారుడు ఉన్నాడు. ఇతను వేడచందూర్ సమీపం రాగమ్‌పట్టిలో ఉన్న ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. రోజూలాగే, గురువారం ఉదయం స్నేహితులు మలైస్వామి (35), మణి (25)తో కలసి ఫ్యాక్టరీకి బయల్దేరాడు.
ఈ నేపథ్యంలో వీరు ప్రయాణిస్తున్న బైకును దిండుక్కల్–వేడచందూర్ రోడ్డులో కాక్కాతోట విభాగ సమీపంలో కరూర్ నుంచి దిండుక్కల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మకుఠీశ్వరన్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన మలైస్వామి, మణిని దిండుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మకుఠీశ్వరన్ మృతి చెందాడన్న సమాచారాన్ని ఇంట్లో ఉన్న అతని తల్లి ఈశ్వరికి తెలియజేశారు. వెంటనే ఆమె కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. దీంతో ఆ ప్రాంతం శోకంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment