
సుజాత పిల్లలను అక్కున చేర్చుకుని విలపిస్తున్న నాయనమ్మ సుశీలమ్మ
కృష్ణాజిల్లా , యడ్లపాడు: జాతీయ రహదారిని దాటుతున్న బాలింతను ఆటో ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన నాదెండ్ల మండలం గణపవరంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం గ్రామంలోని శాంతి నగర్‌కు చెందిన సుజాత(34) తన కుమార్తె మూడు నెలల పల్లవికి టీకాలు వేయించేందుకు ఆస్పత్రికి బయలుదేరింది. తోడుగా ఆడపడుచు మేరీని తీసుకెళ్లింది. కాలనీ నుంచి విష్ణుస్పన్‌పైప్ కంపెనీ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారి వద్దకు రాగానే పాపను మేరీకి ఇచ్చింది. మేరీ రోడ్డు దాటి అవతలకు వెళ్లింది. సుజాత కూడా రోడ్డు దాటుతుండగా చిలకలూరిపేట వైపు నుంచే వచ్చే టాటా మేజిక్ ఆటో ఢీకొంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన ఆటోలో ఓ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలకు హాజరవుతున్నట్లు తెలిసింది. నాదెండ్ల ఎస్‌ఐ ఎస్ రామాంజనేయులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి ప్రేమకు దూరమైన బిడ్డలు
ప్రకాశం జిల్లా వలపర్ల గ్రామానికి చెందిన సుజాత మూడు నెలల వయసులోనే తల్లిదండ్రులు గుంటి చంద్రమౌళి, రామకోటేశ్వరమ్మ చనిపోయారు. దీంతో మేనమామ కాలేషావలి బాలికను చేరదీశాడు. 14 ఏళ్ల కిందట నాదెండ్ల మండలంలోని గణపవరంకు చెందిన సుబ్రమణ్యంకు ఇచ్చి వివాహం చేశాడు. వీరికి అరుణ్ యశ్వంత్, పల్లవి(3 నెలలు) బిడ్డలు పుట్టారు. పాప పుట్టినప్పటి నుంచి సుజాత పనులకు వెళ్లకుండా తన అమ్మే పుట్టిందనుకుని అల్లారుముద్దుగా చూసుకుంటుంది. పాపకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేయించేందుకు శుక్రవారం ఆసుపత్రికి బయలుదేరి మృత్యువాత పడింది. మూడేళ్ల వయసులో సుజాత తల్లిని కోల్పోగా.. ఇప్పుడు తన బిడ్డ మూడు నెలల వయసులో అమ్మ ప్రేమకు దూరమైంది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరి గుండె కన్నీటితో చెమ్మ గిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment