సక్కుబాయి భర్తకు ఆర్థికసాయం అందజేస్తున్న కూనూరు శేఖర్‌గౌడ్
ఖిలావరంగల్ : ఒకవైపు క్షీణిస్తున్న ఆరోగ్యం.. తరుముకొస్తున్న మృత్యువు.. మరోవైపు తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూడాలన్న తపన..ఆమెను కొద్ది క్షణాలను జీవంగా ఉంచింది. మనసారా తనయుడిని ఆశీర్వదించిన మరుక్షణంలోనే ఆ మాతృమూర్తి అనంతలోకాలకు పయనమైం ది. పలువురి హృదయాలను కలిచివేసిన ఈ ఘటన 20 డివిజన్ లక్ష్మీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన మంగళగిరి ఆరువయ్య, సక్కుబాయి(50)దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం సక్కుబాయి క్యాన్సర్ బారిన పడింది. సర్కారు దవాఖానలో వైద్యపరీక్షలు చేయించుకోగా ఏడాదికన్నా ఎక్కవకాలం బతకలేదని వైద్యులు తేల్చి చెప్పారు.
తనకున్న ఏకైక కుమారుడు రాజేష్ వివాహం చూసి తనువు చాలించాలని తరచూ స్థానికులకు చెప్పుకుని వాపోయేది. దీంతో స్థానిక పెద్దలు ముందుకు వచ్చి పేదింటి యువతి సమతను రాజేష్‌కు ఇచ్చి గురువారం ఉదయం ఉర్సుగుట్టపై వివాహం చేశారు. అయితే నవదంపతులు ఇంటికి చేరుకుని తల్లి సక్కుబాయి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కొద్ది సేపట్లోనే ఆ మాతృమూర్తి కన్నుమూసింది. దహన సంస్కారాలు చేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో హన్మకొండకు చెందిన వ్యాపారి పోరండ్ల కుమారస్వామి, టీఆర్‌ఎస్ నేత బోరిగం నర్సింగం, వంటల మల్లమ్మ, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కూనూరు శేఖర్‌గౌడ్ ముందుకు వచ్చారు. రూ.9వేలు ఆర్థిక సాయం అందజేసి అంత్యక్రియలు జరిపించారు.