శోకతప్త హృదయంతో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థిని అనంతలక్ష్మి
పిఠాపురం : ప్రతిరోజూ ఎదురొచ్చి సాగనంపే తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయి శోకాన్ని మిగిల్చగా.. కనీసం తల్లి ఆఖరి చూపునకు కూడా నోచుకోలేక గుండెల నిండా బరువును నింపుకొని పదో పరీక్షకు హాజరైంది ఆ విద్యార్థిని. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం శివారు ముమ్మిడివారిపోడుకు చెందిన బత్తినీడి అప్పారావు భవానీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె అనంతలక్ష్మి ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు మూలపేట హైస్కూల్‌లో రాస్తోంది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి కుమార్తెను తయారు చేసి ఎదురు వచ్చి పరీక్షకు పంపించేది తల్లి భవానీ. అయితే శనివారం భవానీ తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు.
సోమవారం ఉదయం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుదామని లేచిన కుమార్తె అనంతలక్ష్మి తల్లిని లేపింది. ఆమె ఎంతకు లేవకపోవడంతో విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పింది. వారు వచ్చి చూడగా ఆమె మృతి చెంది ఉండడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతలో పరీక్షకు సమయం దగ్గర పడడంతో తల్లి ఆఖరి చూపును కూడా వదులుకుని అనంతలక్ష్మి పుట్టెడు దుఃఖంతో పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాసింది. ఇక్కడ పరీక్ష కేంద్రంలో కుమార్తె పరీక్ష రాస్తుంటే అదే సమయంలో అక్కడ మరుభూమిలో తల్లికి అంత్యక్రియలు నిర్వహించడం స్థానికులను కలచివేసింది. అయితే ఆమె పరీక్ష రాసి ఇంటికి వెళ్లే సరికి తల్లి అంత్యక్రియలు పూర్తి కావడంతో తల్లి కోసం గుండెలవిసేలా రోదించిన ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment