వరకట్నం కేసులో తల్లీకొడుకులకు ఏడేళ్ల జైలు
Published Fri, Jan 10 2014 1:08 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: అదనపు కట్నం తేవాలని వేధిం పులకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిన తల్లీకొడుకులకు ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు బుధవారం ఉద యం తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా ఒదికాడు గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు కుప్పుస్వామి(30). ఇతను రేల్వే పనులు నిర్వహించే కాంట్రాక్టర్ వద్ద తాత్కాలిక ఉద్యోగిగా పనులుచేస్తున్నాడు. ఇతను రైల్వేలో పర్మినెంట్ ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించి తిరువ ళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా చిన్నకనంబేడు గ్రామానికి చెందిన రైతు రామలింగం కుమార్తె కోటీశ్వరిని అక్టోబర్ 2008లో పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో రామలింగం కట్నంగా రూ.5 లక్షల నగదు, 40 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చినట్టు కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో వివాహం జరిగిన కొంత కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే మరికొంత నగదును కట్నంగా ఇప్పించాలని కుప్పుస్వామి, అతని తల్లి కమలమ్మ తరచూ కోటేశ్వరిని వేధించేవారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కట్నం తేవడానికి నిరాకరించిన కోటీశ్వరీ 2009లో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై పెనాలూరు పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి కావడంతో తిరువళ్లూరు జిల్లా మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మురుగన్ బుధవారం ఉదయం తీర్పును వెలువరించారు. కోటీశ్వరీని కట్నం కోసం తరచూ వేధించిన భర్త కుప్పుస్వామి, అతని తల్లి కమలమ్మకు ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆయన ఆదేశించారు. వారిని పుళల్ జైలుకు తరలించారు.
Advertisement