ఇలా బహుశా ఏ తల్లీ చేయలేదేమో. కొచ్చికి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ తన పదేళ్ల కొడుకు నారాయణ్‌ను తీసుకుని సొంత కారులో సొంత డ్రైవింగ్‌లో దేశం చూడటానికి బయలుదేరింది. ‘ఒరు దేశీ డ్రైవ్’ అని దానికి పేరు పెట్టిందికాని దూరం మాత్రం దాదాపు 20 వేల కిలోమీటర్లు. ఆ తల్లీ ఆ కొడుకు మార్చిలో బయలుదేరి మే 6 వరకూ సాహసోపేత దారుల్లో తిరిగి మళ్లీ కొచ్చి చేరుకున్నారు. ‘దేశం అంతా ఊళ్లల్లో ఉంది. ఆ ఊళ్లను చూశాం మేము’ అంటున్న మిత్రా ఈ కరోనా తగ్గగానే దేశాన్ని చుట్టేయమని చెబుతోంది.
తోడుగా ఉన్నది ఒక మారుతి ఎస్–క్రాస్ మోడల్ కారు. 11 ఏళ్ల కొడుకు. దాదాపు 10 ఏళ్ల నుంచి కారు నడుపుతున్న ధైర్యం. అంతే. కొచ్చి (కేరళ)కు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ మార్చి 17, 2021న దేశం చూడ్డానికి బయలుదేరింది. ‘నా కొడుక్కి నా దేశం చూపించాలి. ప్రజలు ఎలా జీవిస్తారో వాడికి తెలియాలి. స్త్రీలు ఒంటరిగా ప్రయాణించవచ్చని తెలియచేయాలి. పిల్లలు పుట్టాక ఇల్లు కదలలేరు అనే దానికి విరుగుడుగా పిల్లలనే తోడు తీసుకొని తిరగొచ్చు అని స్త్రీలకు చెప్పగలగాలి. అంతే కాదు... నేనొక ప్రయాణ ప్రేమికురాలిని. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీ దెబ్బ తింది. గ్రామీణ భారతంలోనే అంతా సౌందర్యం ఉంది అని చెప్పడానికి కూడా నేను ప్రయాణించాలి అని అనుకున్నాను’ అని ఈ సాహసోపేతమైన ప్రయాణం వెనుక తన లక్ష్యాలను వివరించింది మిత్రా సతీష్.
100 రోజులు 20 వేల కిలోమీటర్లు
‘ముందుగా నా భర్తకు కృతజ్ఞతలు. ఆయన మా అబ్బాయితో కలిసి ఈ యాత్ర చేయడానికి ప్రోత్సహించారు. మా అమ్మకు కూడా’ అంటుంది మిత్రా. మార్చి 17న బయలుదేరి 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని మిత్రా ప్లాన్. అందుకు తగ్గట్టు తన యాత్రకు ‘ఒరు దేశీ డ్రైవ్’ అని పేరు పెట్టుకుంది. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సరర్‌గా నిలిచింది. ఇక ఫ్రెండ్స్, ఫేస్‌బుక్ ఫాలోయెర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. ఆమె యాత్ర మొదలెట్టింది. ‘2019లో ఒంటరిగా భూటాన్ వెళ్లాను కారులో. అప్పుడు కాని అర్థం కాలేదు నాకు యాత్ర చేయడం అంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు దారిలో తెలుసుకోవడం. కస్టమ్స్ కాస్ట్యూమ్స్ రెండు తెలియాలి జనానివి. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్ ఇవన్నీ ఒంటరిగా కారులో తిరిగాను. ఇప్పుడు నా కొడుక్కు దేశం చూపించాలనిపించింది. బయలుదేరాను’ అంది మిత్రా. అయితే ఆమె బయలుదేరిన సమయానికి కరోనా ఉధృతంగా లేదు. ఆమె యాత్ర సగంలో ఉండగా కేసులు, లాక్‌డౌన్‌లు మొదలయ్యాయి. అదీగాక డ్యూటీకి హాజరుకమ్మని ఆమెకు పిలుపు వచ్చింది. అయినప్పటికీ 51 రోజుల్లో దాదాపు 16 వేల కిలోమీటర్లు తిరిగి ఆమె విజయవంతంగా స్వస్థలానికి చేరుకుంది.
ఆత్రేయపురం పూతరేకులు
కేరళ నుంచి బయలుదేరిన మిత్ర తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం, వరంగల్ జిల్లా చేర్యాల వంటి ఊళ్ల గుండా తన ప్రయాణం సాగించింది. ‘ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆత్రేయపురం పూతరేకులు అద్భుతం. అలాగే చేర్యాల హస్తకళలు కూడా’ అని ఆమె చెప్పింది. తల్లీ కొడుకులు ప్రతిరోజూ ఉదయం 5 గంలకు ప్రయాణం మొదలెట్టి సాయంత్రానికి నిర్దేశిత ఊరికి చేరుకునేవారు. ‘మేము గ్రామాల్లో ఎవరినో ఒకరిని అడిగి వారి ఇళ్లల్లో ఉండేవాళ్లం. గ్రామీణులు ఎంతో అదరంగా మమ్మల్ని చూసేవారు’ అని ఆమె అంది.
ఆదివాసీలతో
ఈ ప్రయాణంలో తన కుమారుడికి ఆదివాసీ ల జీవనం చూపడం గురించి మిత్ర ఎంతో సంతృప్తి వ్యక్తం చేసింది. ‘కోరాపుట్ (ఒడిసా) బోండా ఆదివాసీలతో, కంగ్రపోడ్ (దక్షిణ ఒడిసా) లో గదబలతో, జగదల్‌పూర్ (చత్తీస్‌ఘర్)లో ధృవ తెగతో, అంజర్ (మధ్యప్రదేశ్)లో మడియా గిరిజనులతో మేము గడపడం వారి గూడేల్లో ఉండి వారు పెట్టింది తినడం మర్చిపోలేము’ అని మిత్ర అంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్త్రీలు ఎంతో ఆదరంతో పలకరించి ఎక్కడకు వెళ్లినా గౌరవ వస్త్రంతో స్వాగతం పలకడాన్ని ఆమె కృతజ్ఞతతో చెబుతుంది.
ప్రమాదకరం
‘మేము వైష్ణోదేవి ఆలయం చూడాలనుకున్నాం. కాని దారి మూసేశారు. దాంతో హెలికాప్టర్‌లో వెళ్లాం. నాకు మా అబ్బాయికి కూడా హెలికాప్టర్ ఎక్కడం అదే ప్రథమం. అయితే తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ ట్రిప్ కేన్సిల్ అయ్యింది. దాంతో 14 కిలోమీటర్లు మేము ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సగం దూరం గుర్రాల మీద వచ్చాం. ఆ సమయంలో మాత్రం చాలా భయం వేసింది’ అని మిత్ర అంది. ఈ మొత్తం ప్రయాణంలో కొడుకు ముందు నుంచి ఎదురు చూసింది జమ్ము, కశ్మీర్‌లను చూడటం గురించే. ‘వాడు మొదటిసారి మంచుమైదానాలను చూసి వెర్రెత్తి పోయాడు’ అని ఆమె పెద్దగా నవ్వింది.
మామూలుగా మన దేశం పూర్తిగా చూడటానికి ఒక జన్మ చాలదని అంటారు. అన్ని విశేషాలు, జీవనాలు ఉంటాయి. మనలో చాలామందికి కార్లుంటాయి. కాస్త తిరగగలిగే వీలు కూడా ఉంటుంది. కాని ‘ఆరంభించరు అతి బీరువులు, బద్దకస్తులు’ అన్నట్టు భయం కొద్దీ, బద్ధకం కొద్దీ ఎక్కడికీ కదలం. ‘తెలిసిన ఊళ్లో ఉన్నవాడు ఏమీ తెలియనట్టే ఉండిపోతాడు. తిరిగినవాడు లోకం తెలిసి బాగుపడతాడు’ అని పెద్దలు అన్నారు. మనం, మన తర్వాతి తరం లోకాన్ని చూడకపోతే ఎలా? ముఖ్యంగా స్త్రీలు ఇంత అందమైన దేశాన్ని తిరిగి చూస్తే ఇల్లు విజ్ఞానవంతం అవదూ? పిల్లలకు ఎన్ని పాఠాలు చెప్పొచ్చు. ఇంకో నాలుగైదు నెలల్లో ఈ కరోనా గిరోనా అంతా పోతుందని ఆశిద్దాం. ఆ తర్వాత ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే. ఏమంటారు?
– సాక్షి ఫ్యామిలీ
Mitra Satheesh: పద నాన్నా... దేశం చూద్దాం
Published Sat, May 22 2021 1:28 AM | Last Updated on Tue, May 25 2021 6:12 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment