
దాటవేతకు వెతుకులాట
► సదావర్తి సత్రం భూముల అమ్మకంపై తలోమాట
► రూ.వెయ్యి కోట్ల లూటీపై నేతల్లో ఆందోళన
► ఆత్మరక్షణలో అధికార పార్టీ
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అమరలింగేశ్వరునికీ శఠగోపం పెట్టిన తీరుపై అధికార పార్టీలో అంతర్మధనం మొదలైంది. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నై నగర సమీపంలోని 83.11 ఎకరాల విక్రయంలోని లోపభూయిష్ట విధానాలను, దేవాదాయ శాఖలో సంబంధిత ఫైలు కదిలిని వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాలతో సహా వెలుగులోకి తేవడంతో టీడీపీ ముఖ్య నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ ఎదురుదాడికి ప్రయత్నిస్తోంది. చివరకు ముఖ్యమంత్రి ఆ ఫైళ్లలోని సమాచారం ఎలా బయటకు పొక్కిందని దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఎవరికి వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో భాగంగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ అమరావతి మండల అధ్యక్షుడు కె.కోటేశ్వరరావు పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుమారుడు నిరంజన్ కూడా విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి సదావర్తి భూముల కొనుగోలులో తమ పెద్దల ప్రమేయం లేదని వివరణ ఇచ్చుకున్నారు. చలమలశెట్టి రామానుజయ మరో అడుగు ముందుకేసి ‘ఏం, కాపులు వ్యాపారం చేసుకోకూడదా’? అని ప్రశ్నించడం విడ్డూరం. భూముల వేలంలో అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తెస్తే వర్గం వ్యాపారం గురించి చలమలశెట్టి వింత, వితండ వాదాన్ని తీసుకు రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదావర్తి సత్రం కోసం తమ పూర్వీకులు దానంగా ఇచ్చిన భూమిని అత్యంత తక్కువ ధరకు విక్రయించడం ఏ మాత్రం సరికాదని ఆ సత్రం చైర్మన్, రాజా వంశీయుడైన రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కూ లేఖ రాయనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు.
గత సీఎంలను కోరినా....
సదావర్తి సత్రం భూములను విక్రయించాలని గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిలను కోరినట్లు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గతంలోనే ప్రకటించారు. అప్పటి సీఎంలు స్పందించ లేదని, తమ ముఖ్యమంత్రి సహకరించారని తెలిపారు. ఇందుకు అభినందిచాల్సింది పోయి తప్పు పట్టడమేమిటని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రులకు ఆ భూములపై బహుశా కన్ను పడలేదేమో అన్న వ్యాఖ్యకు ఎమ్మెల్యే కొమ్మాలపాటి నుంచి జవాబు రాలేదు. అమరలింగేశ్వరునికి మోసం చేయడానికి తన వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధపడనని మరోమాటగా కూడా కొమ్మాలపాటి చెప్పారు.
చలమలశెట్టి రామానుజయ మాట్లాడుతూ సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో ఇంత లోతు అంశాలు దాగి ఉన్నాయనేది తనకు తెలియదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని రామానుజయ ఇది వరకే స్పష్టం చేశారు. భూముల వేలం ప్రక్రియ లోపభూయిష్టమని అంతటా కోడై కూస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం.
ఎలా తప్పించుకోవాలి ?
సదావర్తి సత్రం భూములను విక్రయించాలని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ప్రతిపాదించడం, దీనిపై ముఖ్యమంత్రి పేషీ ఆఘమేఘాలపై అనుకూలత వ్యక్తం చేసి దేవాదాయ, దర్మాదాయ శాఖకు సూచనలు చేయడం, ఆ శాఖ ఉన్నతాధికారులు వేలం నిర్వహించడం అన్నీ పక్కా ప్రణాళికతో జరిగినట్లు సుస్పష్టమవుతోంది. ఈ అంశంపై ఇటీవల తిరుపతిలో జరిగిన మహానాడులో అన్ని ప్రాంతాల ముఖ్య నాయకుల మధ్య తీవ్ర చర్చ జరగడం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. రాజధాని ప్రాంతంలో ‘భూదందా’కు పెదబాబు, చినబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య అనుయాయులు కారకులుగా సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ ఇది వరకే వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో సదావర్తి సత్రం భూముల విక్రయంలోనూ అధిష్టానం ఇంతకు తెగపడుతుందా అనేది పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఆ దృష్ట్యానే మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సాక్షి’పై, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై లెక్కకుమిక్కిలి అక్కసు వెళ్లగక్కడం గమనార్హం.
ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ‘అభినందన’ పేరిట భారీ వ్యాపారాన్ని పలు ప్రాంతాల్లో విస్తరించారు. ఆ వ్యాపార రహస్యాలన్నీ తెలిసినందునే చెన్నై నగర సమీపంలోని విలువైన సదావర్తి సత్రం భూముల విక్రయంపై దృష్టి సారించి తమ అధినేత చెవిన వేశారని టీడీపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేకి చెందిన పలు వెంచర్లకు సంబంధించి లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి. తమ వెంచర్లను భూసమీకరణ నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల వద్ద పలుసార్లు ప్రాధేయపడినట్లు సమాచారం.
తమ వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ‘ఆవేదన’ను సీఎం, మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేతో సహా పలువురు తీసుకెళ్లారు. పలు వెంచర్లకు పరిష్కారాలు లభించాయి. వీటన్నింటి నేపథ్యంలోనే సదావర్తి సత్రం భూములు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు ముగ్గురికి, వీరితో పాటు మరో ఐదుగురికి తక్కువ ధరకు వేలంలో దక్కాయని తెలుస్తోంది.