రెచ్చిపోయిన తణుకు ఎమ్మెల్యే | TDP Tanuku MLA over action on West Godavari District SI | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన తణుకు ఎమ్మెల్యే

Published Fri, May 19 2017 4:04 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

రెచ్చిపోయిన తణుకు ఎమ్మెల్యే - Sakshi

రెచ్చిపోయిన తణుకు ఎమ్మెల్యే

ఎస్సై, రైటర్‌ని నిర్బంధించి టీడీపీ ఎమ్మెల్యే దుర్భాషలు
‘మావాళ్లపై కేసులు పెడతారా’ అంటూ చిందులు
తన కార్యాలయంలో నేలపై కూర్చోబెట్టి తిట్లు..
సమాధానం చెప్పి కదలాలంటూ నిర్బంధం
వేల్పూరులో తీవ్ర ఉద్రిక్తత..
భారీగా మోహరించిన పోలీసులు


సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రెచ్చిపోయారు. వారం రోజుల క్రితం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఏఎస్సైని కాలితో తన్నిన విషయం మర్చిపోకముందే.. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఏకంగా ఒక ఎస్సైని, రైటర్‌ను తన కార్యాలయానికి పిలిపించి నిర్భంధించారు. పార్టీ కార్యాలయంలో కటిక నేలపై కూర్చోబెట్టి అవమానించారు. ‘నా మాట వినకుండా మా పార్టీ వారిపై కేసులు పెడతావా. నాకు సమాధానం చెప్పే వరకూ నిన్ను ఇక్కడి నుంచి వదిలేది లేదు’ అంటూ భీష్మించారు. పార్టీ కార్యకర్తలు పోలీసులను బండబూతులు తిట్టినట్టు సమాచారం. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

అధికారపార్టీవారిపై కేసు పెట్టవద్దంటూ ఒత్తిడి తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం రేలంగి శివారు అంతెనవారి పేటలో ఈస్టర్‌ రోజున దళితుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య చర్చి విషయంలో కొంతకాలంలో వివాదం నెలకొంది. సమాధుల్ని అలికే రోజున స్మశానంలోనే ఇరువర్గాలు గొడవ పడ్డాయి. తర్వాత ఎవరింటికి వారు వచ్చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు వైఎస్సార్‌ సీపీ వర్గానికి చెందిన వారి ఇళ్లపై దాడి చేశారు. ఒకరికి తల పగిలింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇరువర్గాలకు చెందిన చెరో ఆరుగురిపై సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం వారిపై కేసు పెట్టవద్దంటూ ఇరగవరం ఎస్సై శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ  ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే దాడి జరిగిన విషయం నిర్థారణ కావడంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.

మీకు ఎంత దమ్ముందిరా.. అంటూ దుర్భాషలు
ఈ నెల 15న తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురిని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. గురువారం నాడు వైఎస్సార్‌ సీపీకి చెందిన మరొకరిని అరెస్ట్‌ చేశారు. ఇంకా ఇద్దరు దొరకాల్సి ఉంది. అయితే తన మాట వినకుండా తమ వారిపై కేసులు పెట్టడమే కాకుండా వారిని అరెస్ట్‌  చేయడంపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగ్రహించారు. ఇరగవరం ఎస్సై, రైటర్‌ను వేల్పూరులోని తన కార్యాలయానికి రమ్మని తణుకు సీఐ ఆదేశించారు. సీఐ వేరేచోట ఉండటంతో రాలేకపోయారు.

 ఎస్సై శ్రీనివాస్, రైటర్‌ ప్రదీప్‌కుమార్‌ సాయంత్రం 6 గంటల సమయంలో వేల్పూరులోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ గదిలోకి రమ్మన్న ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా మాట వినకుండా కేసులు నమోదు చేస్తారా.. మీకు ఎంత దమ్ముందిరా’ అంటూ బూతులు తిట్టారు. వారిని కార్యాలయంలో నేలపై నేలపై కూర్చోబెట్టి తాను కూడా వారి ఎదురుగా కూర్చున్నారు. తనకు సమాధానం చెప్పేవరకూ బయటకు వెళ్లనీయనంటూ నిర్బంధించారు. ఈ వ్యవహారాన్ని ఫొటోలు తీసిన పోలీసుల నుంచి సెల్‌ఫోన్లు లాక్కుని ఆ ఫోటోలను డిలిట్‌ చేయించారు.

ఎస్సైని నిర్బంధించిన విషయం ఎస్పీకి తెలియడంతో ఆయన స్వయంగా ఎమ్మెల్యేకి ఫోన్‌చేసి నిర్బంధించడం సరికాదని చెప్పడంతో వారిని వదిలిపెట్టినట్టు సమాచారం. అప్పటికే అక్కడికి చేరుకున్న రేలంగి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు ఎస్‌ఐని, రైటర్‌ను బయటకు వెళ్లనివ్వకుండా మరోమారు అడ్డగించారు. దీంతో పోలీసులు భారీగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మోహరించారు. కొవ్వూరు డీఎస్పీ మురళీకృష్ణ, తణుకు సీఐ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. తఢమ వారికి అన్యాయం జరిగిందని ప్రశ్నించడానికి మాత్రమే పిలిచానని, తాను ఎవరిని నిర్బంధించలేదని ఎమ్మెల్యే మీడియాకి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement