ఏ క్షణమైనా మెరుపుదాడి!
- ఏజెన్సీలో ఉండొద్దు.. మైదాన ప్రాంతాలకు వచ్చేయండి
- అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు పోలీసుల హెచ్చరిక
విశాఖపట్నం: భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతల్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా ఏజెన్సీ సహా పరిసర మండలాల్లోని టీడీపీ నేతలు కంటిమీద కనుకు లేకుండా ఉన్నారు. కీలక నేతలు సహా ఒకేసారి 30 మంది సహచరులను కోల్పోరుున మావోరుుస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఏ క్షణమైనా మెరుపుదాడి చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళన చెందుతున్నారు.
విశాఖ ఏజెన్సీ, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని ప్రజాప్రతినిధులు మైదానప్రాంతాలకు వెళ్లాలని కేంద్ర ఇంటిలిజెన్‌స శాఖ నుంచి ఇప్పటికే ఆదేశాలొచ్చారుు. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో ఉంటున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులు కొంత కాలంపాటు స్వగ్రామాలకు దూరంగా ఉండాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెన్సీలో పర్యటించాల్సి వచ్చినప్పటికీ జిల్లా పోలీస్ శాఖతోపాటు స్థానిక పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
మీ ఆనుపానులు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలని, ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం సాధ్యమయ్యే పనికాదని హెచ్చరించినట్టు చెబుతున్నారు. దీంతో ఏ క్షణాన్న ఏ రూపంలో మావోలు విరుచుకుపడతారోననే ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొంది. మావోల నుంచి ముప్పు ఉన్న జిల్లామంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడితోపాటు ఏజెన్సీకి చెందిన పలువురు టీడీపీ నేతలకు భద్రత పెంచారు. ఇటీవలే టీడీపీలో చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనకు భద్రత పెంచాల్సిందిగా కోరినట్టు సమాచారం.
బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉందనే ఆందోళనతో మంత్రి అయ్యన్నపాత్రుడితో సహా ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు పలువురు పూర్తిగా విశాఖకే పరిమితయ్యారు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడైతే ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఒక దశలో మీడియాకు విడుదల చేయడం కూడా ఆపేశారు. ఇటీవలే మళ్లీ టూర్ షెడ్యూల్ ఇస్తున్నప్పటికీ పోలీస్ హెచ్చరికల నేపథ్యంలో టూర్ షెడ్యూల్ విషయంలో పోలీసుల అనుమతితోనే విడుదల చేసే పరిస్థితి నెలకొంది. పోలీస్ హెచ్చరికల నేపథ్యంలో ఈయనొక్కరే కాదు.. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతల్లో కూడా ఆందోళన కనిపిస్తోంది.