రచ్చ రచ్చ.. రసాభాస
ఎండాడలో గంట ముందే ముగిసిన జన్మభూమి
సమస్యలు చెబుదామని వచ్చిన వారిపై టీడీపీ కార్యకర్తల దాడి
రుషికొండలో తమ్ముళ్ల బాహాబాహీ
అధికార పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు జన్మభూమి సాక్షిగా బహిర్గతమయ్యాయి. అధికారుల ఎదుటే బాహాబాహీకి దిగడం, రక్తాలు వచ్చేలా కొట్టుకోవడంతో బిత్తరపోయారు ప్రజలు. టీడీపీ మహిళా నాయకురాలిపై అదే పార్టీకి చెందిన నాయకుడు అసభ్యంగా ప్రవర్తించడం.. ఆమె భర్త తిరగబడడం.. ఇలా ఒకటేమిటి.. అడ్డూ అదుపూ లేని టీడీపీ నాయకుల ఆగడాలకు వేదికైంది ఆరో వార్డు పరిధి రుషికొండలోని జన్మభూమి సభ. ఇక అదే వార్డులోని ఎండాడ సభ ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఇక్కడ విశేషమేమంటే సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రజలపైనే దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారి కూడా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలకడం శోచనీయం. ప్రజలపై దాడిని ఖండించిన వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవకు దిగి అక్కడి సభనూ రచ్చరచ్చ చేశారు. మొత్తానికి ఎందుకు నిర్వహించారో తెలియకుండానే ముగించేశారు అధికారులు.
– సాగర్‌నగర్ (విశాఖ తూర్పు)
జీవీఎంసీ ఆరోవార్డు పరిధిలో మంగళవారం జరిగిన జన్మభూమి–మా ఊరు సభలు రసాభాసగా ముగిశాయి. ఎండాడలో గంటన్నర ఆలస్యంగా మొదలైన సభను గంట ముందుగానే ముగించేశారు. మధురవాడ జోనల్ కమిషనర్ పి.ఎం. సత్యవేణి ఫిర్యాదులిచ్చిన స్థానికులతో అతిగా వ్యహరించడంతో స్థానికులు వారిపై తిరగబడ్డారు. అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటై సమస్యలు చెప్పే అవకాశం ఇవ్వకుండా రచ్చరచ్చ చేశారు.
నిర్మాణం పూర్తయినా ప్రారంభించని ఎన్టీఆర్ సుజలం వాటర్ ప్లాంట్ విషయమై వైఎస్సార్ సీపీ నాయకులు లొడగల రామ్మోహన్, లొడగల అప్పారావు, ఉప్పులూరి గోపి, నల్ల రవి, సుంకర హరిబాబు, చిర్రా రామ్మోహన్ సభలో జోనల్ కమిషనర్ సత్యవేణిని ప్రశ్నించారు. దీంతో జెడ్సీ వ్యంగ్యంగా మాట్లాడటంతో లొడగల అప్పారావు, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించిన వారిపై దాడి
రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజీవ్‌నగర్ రోడ్డు దుస్థితి, సాగర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో రోగుల పరిస్థితి, రోడ్లు, అంతర్గత డ్రైనేజీల దుస్థితిపై అధికారులను నిలదీశారు. దీంతో శ్రీనివాసరావుపై టీడీపీకి చెందిన వెంకటరమణ అనే చోటా కార్యకర్త, వార్డు కమిటీ అధ్యక్షుడు చెట్టుపల్లి గోపి దాడికి ప్రయత్నించగా వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డు తగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య పది నిమిషాలు తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవలు భరించలేక జన్మభూమి ప్రత్యేక అధికారి మోహన్‌రావు గంటన్నర ముందుగానే వేదిక దిగిపోయారు. అనంతరం ఒకరు తర్వాత ఒకరుగా వివిధ శాఖల అధికారులంతా వెళ్లిపోవడంతో వేదిక ఖాళీ అయిపోయింది. ఉదయం 10.30కు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 12 గంటలకే ముగిసిపోయింది. దీంతో సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన స్థానికులు బిత్తరపోయి, సభ నిర్వహణను విమర్శిస్తూ వెళ్లిపోయారు.