వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక కవ్వింపు చర్యలు
అమరావతి మండలం నరుకుళ్లపాడులో ఇరు వర్గాల ఘర్షణ
మొత్తం 12 మందికి గాయాలు..ఆస్పత్రుల్లో చికిత్స
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించిన కావటి
గుంటూరు : అధికార పార్టీ కార్యకర్తలు అడ్డగోలు రాజకీయాలకు తెరతీశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. అమరావతి సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ ఆదివారం జరిపిన పర్యటన విజయవంతమైంది. దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం అమరావతి మండలం నరుకుళ్లపాడులో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. మొత్తం 12 మంది గాయపడగా, వారిలో ఆరుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఆరుగురు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.
అమరావతిలోని సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ అమరావతిలో పర్యటించింది. ఈ క్రమంలో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ శ్రేణులు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు అమరావతిలో నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుని ఉద్రిక్త వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించిన క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కమిటీకి ఘనస్వాగతం పలకడంతో పాటు పర్యటనను విజయవంతం చేశారు. దీంతో టీడీపీ గ్రామస్థాయి నేతల్లో ఆక్రోశం మొదలైంది.
ఈ క్రమంలో అమరావతి మండలం నరుకుళ్లపాడు ఎస్సీ కాలనీలో టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి రెచ్చగొట్టి తొలుత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో కార్యకర్తలు మేకల విజయ్, మేకల బుల్లెబ్బాయి, మేకల సురేష్, మేకల భారతి, మేకల రాంబాబు, రాణిలపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వీరు కూడా వారిని ప్రతిఘటించిన క్రమంలో ఎదురు దాడి చేయటంతో ఆ వర్గంలో కూడా కొందరికి గాయాలయ్యాయి. అమరావతి సీఐ మురళీకృష్ణ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కఠినంగా శిక్షించాలి
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భంగపరుస్తున్నారని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు మండి పడ్డారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన విజయవంతమైందనే అక్కసుతో గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడి తమ పార్టీ కార్యకర్తలపై దాడిచేశారని, టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతోందని మండి పడ్డారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.