► ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తున్న నేతలు
► ఆధిపత్య పోరు తప్పదంటున్న విశ్లేషకులు
► బాబు బుజ్జగింపు తాత్కాలిక ఊరటే..
పలమనేరు టీడీపీలో అంతర్గత పోరుకు మళ్లీ బీజం పడింది. రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఇకపై ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఖాయమని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, సెగ్మెంట్ పరిధిలోని కొంత మంది మండల స్థాయి నాయకులు ఆయనతో వైఎస్‌ఆర్‌సీపీని వీడి టీడీపీలో చేరడం వంటి తాజా రాజకీయ పరిణామాలు నియోజకవర్గ టీడీపీలో పెరిగే అసమ్మతి, అంతర్గత పోరును తేటతెల్లం చేస్తున్నాయి. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి చేరికను జీర్ణించుకోలేని టీడీపీ నేతల పరిస్థితి ఇరకాటంలో పడింది. మనసులోని మాటలను, భవిష్యత్ ఆందోళనను పార్టీ అధినేత చంద్రబాబుకు వివరంగా చెప్పుకునే పరిస్థితి లేక సతమతం అవుతున్నారు.
తిరుపతి: తిరుపతిలో జరిగిన మహానాడుకు ముందు నుంచే ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి టీడీపీలో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. పలమనేరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి సుభాశ్‌చంద్రబోస్ మొదటి నుంచీ ఆయన రాకను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడి ఇప్పుడు మళ్లీ పార్టీలోకి రావడాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అప్పటి నుంచీ బోస్ పలమనేరు నియోజకవర్గం పార్టీ కేడర్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చేరిక బోస్ వర్గానికి ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో, లేదోనన్న అనుమానాలు బోస్‌తో పాటు ఆయన సన్నిహితుల్లో పెరిగాయి. దీన్ని ముందుగానే పసిగట్టిన పార్టీ అధిష్టానం బోస్‌తో పాటు పార్టీలోని నియోజకవర్గ ముఖ్య నాయకులను బుధవారమే విజయవాడకు పిలిపించుకుని బుజ్జగించడం జరిగింది. అయినప్పటికీ బోస్ వర్గీయుల్లో ఆందోళన తగ్గలేదు. ప్రస్తుతానికి నేతల మధ్య ఉన్న విభేదాలు బయటకు కనిపించకపోయినప్పటికీ సమీప భవిష్యత్తులో వర్గపోరు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా.
అగమ్యగోచరంలో మండల నాయకులు...
తాజా రాజకీయ పరిణామాలు పలమనేరు నియోజకవర్గం టీడీపీ నాయకులను అగమ్యగోచరంలో పడేశాయి. ప్రధానంగా పలమనేరు రూరల్, పెద్దపంజాణి, గంగవరం, బెరైడ్డిపల్లి మండలాల్లోని టీడీపీ నేతలను ఇరకాటంలో పడేస్తున్నాయి. సెగ్మెంట్‌లో కీలకంగా మారిన బోస్, ఎమ్మెల్యేల్లో ఎవరికి విధేయులుగా మసలాలో తెలియక సతమతమవుతున్నారు. పలమనేరు రూరల్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీనాయుడు మొదటి నుంచీ బోస్‌కు విధేయుడిగానే ఉన్నారు. ఈయన కాకుండా మండలంలో పార్టీనేతగా ఉన్న జెడ్పీటీసీ భర్త వెంకటరత్నం ఇకపై ఎమ్మెల్యే వెంట నడిచే అవకాశాలున్నాయి. బెరైడ్డిపల్లి మండలంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కదిరప్ప, యువనేత సుబ్బులుతో పాటు ఇటీవలనే టీడీపీలో చేరిన క్రిష్ణవేణి జైకుమార్‌లు బోస్ వెంట పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇదే మండలంలో ఉన్న టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసులురెడ్డి రెండేళ్లుగా బోస్‌తో కాస్తంత దూరంగా ఉంటున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు రాధ కిషోర్‌గౌడ్ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డితో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండలంలో మూడు గ్రూపులు కనిపిస్తున్నాయి. వీరంతా కలిసి పార్టీ కార్యక్రమాల్లో ఏ మేరకు పాల్గొంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంగవరం, పెద్ద పంజాణి మండలాలతో పాటు మిగతా చోట్ల ఎమ్మెల్యేతో పాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు అందరూ ఆయన వెంటే నడిచే వీలుంది. ఇదే జరిగితే సుభాష్‌చంద్రబోస్ వర్గం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని సమాచారం. మారిన రాజకీయ పరిణామాలు నియోజకవర్గ నేతల్లో ఆధిపత్య పోరును కచ్చితంగా పెంచుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.
అక్కడి నుంచే వచ్చి... మళ్లీ అక్కడికే....
వైఎస్సార్‌సీపీలో కొనసాగుతూ ఎమ్మెల్యేతో వెళ్లిన వివిధ మండలాల నాయకులందరూ ఎన్నికలకు ముందు టీడీపీలోనే ఉన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్న వీరంతా మళ్లీ ఎమ్మెల్యేతో టీడీపీలోకి వెళ్లారు. బెరైడ్డిపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాధ, మున్సిపల్ కౌన్సిలర్లు గుల్జార్‌ఖాజా, వాణికిషోర్‌లు అమరనాథ్‌రెడ్డితో పాటే పార్టీలు మారారు. దీన్నిబట్టి వీరంతా టీడీపీలోనే కొనసాగితే ముందు ముందు ఎమ్మెల్యేతోనే ఉంటారని బోస్ వర్గం అంచనా వేస్తోంది.