K. Rosaiah
-
టాలెంట్ ఒక్కరి సొత్తు కాదు: రోశయ్య
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఆదివారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పీస్ పోస్టర్ పోటీ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నవంబర్ 2న నిర్వహించన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సత్కరించారు. లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఏ చైర్మన్ సత్యవోలు రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజేతలు సాయితేజ, సంహిత రెడ్డి, సంజన బహుమతులు అందుకున్నారు. మరో 10 మంది చిన్నారులకు ప్రత్యేక బహుమతులు ప్రదానం చేశారు. 300 మందికి పోత్సాహక బహుమతులు అందజేశారు. ఉత్తమ సేవా అవార్డు, ఉత్తమ డ్రాయింగ్ టీచర్ పురస్కారాలు కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ చైర్మన్, లయన్ ఎంఆర్ఎస్ రాజు, లయన్స్‌క్లబ్ గవర్నర్ బి.ప్రభాకర్, డాక్టర్ రాజగోపాల్‌రెడ్డి, మనోజ్‌కుమార్ పురోహిత్, బండారు ప్రభాకర్, రమేశ్ చంద్ర పండిత్, ఎల్లా సుబ్బారెడ్డి, కృష్ణా రెడ్డి, వెంకట సురేశ్, డాక్టర్ పరం శివం, మహేశ్, పూజిత, మనాలి తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి నింపే చిత్రాలు రావాలి
‘‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’ సినిమా చాలా బాగుంది. చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూపించారు. బాల–బాలికల్లో స్ఫూర్తి నింపే ఇలాంటి గొప్ప చిత్రాలు తరచూ రావాలి’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల చిత్రం ‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’. 2015 నవంబర్4న విడుదలైన ఈ చిత్రం 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం అందుకుంది. తాజాగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఆదిత్య’ చిత్రంలో నేనూ నటించాను. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పిల్లలతో సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించే మా చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నాకు నంది పురస్కారం అందించారు’’ అన్నారు భీమగాని సుధాకర్ గౌడ్. నటుడు సుమన్ పాల్గొన్నారు. -
తొంభై సినిమాలంటే మాటలు కాదు
► మాజీ గవర్నర్ రోశయ్య ‘‘ఓ సినిమా తీసేందుకు ఎన్నో కష్టాలు పడాలంటుంటారు. అలాంటిది మా రామసత్యనారాయణ 90 సినిమాలు తీశాడంటే మాటలు కాదు. చాలా గ్రేట్. తెలివిగా, బడ్జెట్ కంట్రోల్‌తో కష్టనష్టాల్ని దగ్గరికి రానివ్వకుండా సినిమాలు నిర్మిస్తున్నారంటే హ్యాపీ’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య అన్నారు. ‘అవును’ ఫేమ్ పూర్ణ ముఖ్యతారగా శ్రీరాజ్ బళ్ల దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘అవంతిక’ పాటల సీడీలను రోశయ్య విడుదల చేయగా, దర్శకులు ‘ధవళ’ సత్యం అందుకున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘మా గురువుగారు దాసరి చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. సినిమాను ఆయనకు అంకితం ఇస్తున్నా. ఓ సినిమా హిట్టవ్వాలంటే నిర్మాత డబ్బు పెడితే సరిపోదు. దర్శకుడు బాగా తీయాలి. అప్పుడే హిట్ వస్తుంది. శ్రీరాజ్ బళ్ల చెప్పిన బడ్జెట్లో చెప్పిన టైమ్‌లో సినిమా తీశాడు. ఈ నెల 16న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. దర్శకులు రేలంగి నరసింహారావు, కళ్యాణ్‌కృష్ణ, బాబ్జీ, సూర్యకిరణ్, నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, శోభారాణి, కొడాలి వెంకటేశ్వరరావు, చిత్ర సంగీత దర్శకుడు రవిరాజా బళ్ల పాల్గొన్నారు. -
రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం: రోశయ్య
► పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ‘మై లైఫ్’ ఆవిష్కరణ ► భావోద్వేగానికి గురైన జైపాల్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో నిజాయితీ, సేవాదృక్పథం, అధ్యయనం, అవగాహన చాలా ముఖ్యమని తమిళనాడు మాజీ గవ ర్నర్ కె.రోశయ్య అన్నారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు పి.నర్సారెడ్డి ఆత్మకథ ‘మై లైఫ్’ను శనివారం ఇక్కడ ఆయన ఆవిష్కరించారు. మాజీ గవర్నర్ కె.రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకులు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి. టీపీసీసీ మాజీ అధ్య క్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ పండిట్ నారా యణరెడ్డి, టీపీసీసీ ముఖ్యనేతలు, పలువురు రిటైర్డు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లా డుతూ విషయాన్ని అవగాహన చేసుకుని, రాతపూర్వకంగా కూడా అద్భుతంగా ఆవిష్క రించడంలో నర్సారెడ్డి నిష్ణాతుడని అన్నారు. అధ్యయనం చేయడం, విషయాలపై అవగా హన కలిగి ఉండటంతోపాటు రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న నర్సారెడ్డి అనుభవాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయన్నారు. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకథల్లోనూ, కథనంలోనూ నిజాయితీ ఉండాలన్నారు. రాజకీయాల్లో నిజాయితీతోనే ఉన్న నర్సారెడ్డి జీవిత చరిత్ర చదివితే కొత్త అంశాలు తెలుస్తాయన్నారు. నర్సారెడ్డితో అనుబంధా న్ని గుర్తు చేసుకుంటూ జైపాల్‌రెడ్డి భావో ద్వేగానికి గురి కావడంతో ఆయన కళ్లు చెమ ర్చాయి. నర్సారెడ్డి కూడా నిలబడి ఉద్వేగానికి లోనయ్యారు. నర్సారెడ్డి మాట్లాడుతూ డబ్బు ప్రమేయం రాజకీయాల్లో అపరిమితంగా పెర గడం వల్ల రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చిందన్నారు. ప్రజల సమస్యల పరి ష్కారంపై కాకుండా ఇలాంటి అంశాలు తెర పైకి రావడంతో రాజకీయాల్లో ఇమడలేక పోయానని విచారం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో అంకిత భావంతో, ఉన్నతస్థాయిలో పనిచేసిన నర్సా రెడ్డి వంటివారి జీవిత చరిత్రలు అందరికీ ఉత్తేజకరంగా ఉంటాయన్నారు. టీపీసీసీ నేత పాల్వాయి స్రవంతి సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. -
దాటవేతకు వెతుకులాట
► సదావర్తి సత్రం భూముల అమ్మకంపై తలోమాట ► రూ.వెయ్యి కోట్ల లూటీపై నేతల్లో ఆందోళన ► ఆత్మరక్షణలో అధికార పార్టీ సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అమరలింగేశ్వరునికీ శఠగోపం పెట్టిన తీరుపై అధికార పార్టీలో అంతర్మధనం మొదలైంది. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నై నగర సమీపంలోని 83.11 ఎకరాల విక్రయంలోని లోపభూయిష్ట విధానాలను, దేవాదాయ శాఖలో సంబంధిత ఫైలు కదిలిని వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాలతో సహా వెలుగులోకి తేవడంతో టీడీపీ ముఖ్య నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ ఎదురుదాడికి ప్రయత్నిస్తోంది. చివరకు ముఖ్యమంత్రి ఆ ఫైళ్లలోని సమాచారం ఎలా బయటకు పొక్కిందని దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఎవరికి వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో భాగంగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ అమరావతి మండల అధ్యక్షుడు కె.కోటేశ్వరరావు పోలీసుస్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుమారుడు నిరంజన్ కూడా విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి సదావర్తి భూముల కొనుగోలులో తమ పెద్దల ప్రమేయం లేదని వివరణ ఇచ్చుకున్నారు. చలమలశెట్టి రామానుజయ మరో అడుగు ముందుకేసి ‘ఏం, కాపులు వ్యాపారం చేసుకోకూడదా’? అని ప్రశ్నించడం విడ్డూరం. భూముల వేలంలో అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తెస్తే వర్గం వ్యాపారం గురించి చలమలశెట్టి వింత, వితండ వాదాన్ని తీసుకు రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదావర్తి సత్రం కోసం తమ పూర్వీకులు దానంగా ఇచ్చిన భూమిని అత్యంత తక్కువ ధరకు విక్రయించడం ఏ మాత్రం సరికాదని ఆ సత్రం చైర్మన్, రాజా వంశీయుడైన రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కూ లేఖ రాయనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. గత సీఎంలను కోరినా.... సదావర్తి సత్రం భూములను విక్రయించాలని గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిలను కోరినట్లు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గతంలోనే ప్రకటించారు. అప్పటి సీఎంలు స్పందించ లేదని, తమ ముఖ్యమంత్రి సహకరించారని తెలిపారు. ఇందుకు అభినందిచాల్సింది పోయి తప్పు పట్టడమేమిటని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రులకు ఆ భూములపై బహుశా కన్ను పడలేదేమో అన్న వ్యాఖ్యకు ఎమ్మెల్యే కొమ్మాలపాటి నుంచి జవాబు రాలేదు. అమరలింగేశ్వరునికి మోసం చేయడానికి తన వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధపడనని మరోమాటగా కూడా కొమ్మాలపాటి చెప్పారు. చలమలశెట్టి రామానుజయ మాట్లాడుతూ సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో ఇంత లోతు అంశాలు దాగి ఉన్నాయనేది తనకు తెలియదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని రామానుజయ ఇది వరకే స్పష్టం చేశారు. భూముల వేలం ప్రక్రియ లోపభూయిష్టమని అంతటా కోడై కూస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. ఎలా తప్పించుకోవాలి ? సదావర్తి సత్రం భూములను విక్రయించాలని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ప్రతిపాదించడం, దీనిపై ముఖ్యమంత్రి పేషీ ఆఘమేఘాలపై అనుకూలత వ్యక్తం చేసి దేవాదాయ, దర్మాదాయ శాఖకు సూచనలు చేయడం, ఆ శాఖ ఉన్నతాధికారులు వేలం నిర్వహించడం అన్నీ పక్కా ప్రణాళికతో జరిగినట్లు సుస్పష్టమవుతోంది. ఈ అంశంపై ఇటీవల తిరుపతిలో జరిగిన మహానాడులో అన్ని ప్రాంతాల ముఖ్య నాయకుల మధ్య తీవ్ర చర్చ జరగడం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. రాజధాని ప్రాంతంలో ‘భూదందా’కు పెదబాబు, చినబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య అనుయాయులు కారకులుగా సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ ఇది వరకే వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో సదావర్తి సత్రం భూముల విక్రయంలోనూ అధిష్టానం ఇంతకు తెగపడుతుందా అనేది పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఆ దృష్ట్యానే మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సాక్షి’పై, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై లెక్కకుమిక్కిలి అక్కసు వెళ్లగక్కడం గమనార్హం. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ‘అభినందన’ పేరిట భారీ వ్యాపారాన్ని పలు ప్రాంతాల్లో విస్తరించారు. ఆ వ్యాపార రహస్యాలన్నీ తెలిసినందునే చెన్నై నగర సమీపంలోని విలువైన సదావర్తి సత్రం భూముల విక్రయంపై దృష్టి సారించి తమ అధినేత చెవిన వేశారని టీడీపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేకి చెందిన పలు వెంచర్లకు సంబంధించి లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి. తమ వెంచర్లను భూసమీకరణ నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల వద్ద పలుసార్లు ప్రాధేయపడినట్లు సమాచారం. తమ వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ‘ఆవేదన’ను సీఎం, మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేతో సహా పలువురు తీసుకెళ్లారు. పలు వెంచర్లకు పరిష్కారాలు లభించాయి. వీటన్నింటి నేపథ్యంలోనే సదావర్తి సత్రం భూములు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు ముగ్గురికి, వీరితో పాటు మరో ఐదుగురికి తక్కువ ధరకు వేలంలో దక్కాయని తెలుస్తోంది. -
'ఏపీ, తమిళనాడు చర్చలు జరుపుతున్నాయి'
-
'ఏపీ, తమిళనాడు చర్చలు జరుపుతున్నాయి'
పామర్రు: శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య యువజన సమైక్య నూతన కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో 20 మంది కూలీలు ప్రాణాలు కోల్పయిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్ కు నిరసనగా తమిళనాడులో ఏపీకి చెందిన వారి ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని తమిళనాడు సర్కారు డిమాండ్ చేసింది. -
బడ్జెట్ ఆచరణాత్మకంగా ఉండాలి: రోశయ్య
‘ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ల లోట్లు-పోట్లు’ గ్రంథం ఆవిష్కరణ హైదరాబాద్: ‘‘వార్షిక బడ్జెట్ పోటాపోటీగా పెరుగుతోంది. పెరగడం మంచిదే అయినా.. మనిషిలో ఊబకాయం పెరిగినట్లుగా బడ్జెట్ ఉండకూడదు. బడ్జెట్ అంచనాలు ఆచరణకు తగ్గట్టుగా ఉండాలి’’ అని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. 1968 ప్రాంతంలో అసెంబ్లీ బడ్జెట్ రూ.40 కోట్లు మాత్రమే ఉండేదని, ఇప్పడు అది రూ. లక్షా 18 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వి.హనుమంతరావు సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ల లోట్లు-పోట్లు’ గ్రంథం ఆవిష్కరణ సభ గురువారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ జీఎస్ వరదాచారి అధ్యక్షతన జరిగింది. ఈ గ్రంథాన్ని రోశయ్య ఆవిష్కరించారు. గతంలో ఏపీ ఆర్థిక మంత్రిగా పనిచేసే అవకాశం తనకు కలిగిందని చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి చర్చ ప్రారంభిం చడానికి వి.హనుమంతరావు చేసిన ఆర్థిక రచనలు ఎంతగానో ఉపయుక్తంగా ఉండేవని చెప్పారు. ఈ గ్రంథాన్ని అనుభవజ్ఞుడు, పదో ఆర్థిక సంఘం సభ్యుడు బీపీఆర్ విఠల్‌కు అంకిత మివ్వడం సముచితంగా ఉందన్నారు. గ్రంథకర్త వి.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ వస్తోందంటే ఏ పన్నులు విధిస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, పన్నుల చెల్లింపు ప్రజలకు భారంగా తయారైందని చెప్పారు. లోటుబడ్జెట్ వస్తే ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతుంటాయని, దీని వల్లే అప్పులు చేస్తుంటాయని చెప్పారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో టీవీ చానళ్లలో బడ్జెట్‌పై జరిగే చర్చాగోష్టిల్లో గుడ్డిగా వాదించడం జరుగుతోందని, అర్థవంతమైన చర్చ జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గంజివరపు శ్రీనివాస్‌కు డీఎన్‌ఎఫ్ ఉత్తమ జర్నలిస్టు అవార్డును, దర్ప అరుణకు డీఎన్‌ఎఫ్ మహిళాజర్నలిస్టు అవార్డును ప్రదానం చేశారు. -
విద్యావ్యాప్తిలో మోహన్‌బాబు కృషి ఎనలేనిది
నెల్లూరు (బాలాజీనగర్) : డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి(బె.గో.రె) అవార్డును అందుకునేందుకు సినీనటుడు మంచు మోహన్‌బాబు అన్ని విధాల అర్హుడని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మోహన్‌బాబుకు ఆయన అవార్డు అందజేశారు. రోశయ్య మాట్లాడుతూ శ్రీవిద్యానికేతన్ ద్వారా విద్యావ్యాప్తికి విశేష కృషిచేస్తున్న వ్యక్తికి బె.గో.రె అవార్డును తన చేతుల మీదుగా అందజేయడం ఆనందంగా ఉందన్నారు. అత్యంత చిన్నవయస్సులోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా వ్యవహరించిన బెజవాడ గోపాల్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా తెలుగువారి ఖ్యా తిని ఇనుమడింపజేశారన్నారు. రాజకీయాలతోపాటు సాహిత్యాభిలాషుడిగా అనేక గ్రంథాలకు రూపకర్తగా బహుళ ప్రాచూర్యం పొందారన్నారు. సాహిత్యంపై ఆయనకున్న అభిమానం, మక్కువ ఎనలేనివన్నారు. బె.గో.రె పేరుతో అవార్డు ప్రదా నం చేయడం శుభపరిణామన్నారు. అవార్డు గ్రహీత మోహన్‌బాబు మాట్లాడుతూ సమాజంలో అన్ని రుగ్మతలకన్నా ‘కులం’ అనే భావన అత్యంత ప్రమాదకరమైనదన్నారు. తన విద్యాలయాల అప్లికేషన్లో కులం ప్రస్తావనే ఉండదన్నారు. ‘ఒకప్పు డు నన్ను ఎందుకూ పనికిరాని వాడవు అన్నారు... పిల్ల నిచ్చేవారే లేరు... రెండు జతల బట్టలు’ అ లాంటి స్థితి నుంచి కష్టపడి, క్రమశిక్షణను నమ్ముకుని ఈ అవార్డు అందుకునే స్థాయికి వచ్చానన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత శి వాజీ గణేశన్‌ను ఆదర్శంగా తీసుకుని తన విద్యాల యాలను దేశంలోనే 6వ స్థానంలో నిలబెట్టడం గ ర్వకారణంగా ఉందన్నారు. నెల్లూరు తన అత్తగారి ఊరని, తనకు ఏమాత్రం కొత్త కాదని చెప్పారు. నెల్లూరుకు సేవ చేయండి ‘నాది నెల్లూరు సీడ్.. నేను నెల్లూరులో పుట్టాను.. నెల్లూరులో పెరిగాను’ అంటూ వైజాగ్‌లో స్థిరపడి అక్కడి ప్రజలకు సేవలు చేస్తున్నావంటూ తిక్కవరపు సుబ్బరామిరెడ్డిని మోహన్‌బాబు చురకలంటించారు. ఉన్నతాశయాలతో పనిచేసే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి లాంటి నాయకులు అరుదన్నారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నెల్లూరు రూరల్ ప్రజలు అదృష్టవంతులున్నారు. ఆయన భవిష్యత్తులో మంత్రి, ఆ పైస్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. తాను 560 చిత్రాల్లో నటించి, 56 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించానని ఏనా డు జయాపజయాలను పట్టించుకోలేదన్నారు. రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ కళను ఆదరించి, ప్రోత్సహించినవారే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కస్తూరిదేవి పాఠశాలలోని రవీంద్రభారతి ఆడిటోరియంకు ఏసీ సదుపాయాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ మోహన్‌బాబులోని ముక్కుసూటితనం తనకు నచ్చుతుందన్నారు. ప్రత్యర్థులతో సైతం శభాష్ అనిపించే వాక్చాతుర్యం రోశయ్యకే సొంతమన్నారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పథంలోకి నడిపించాలని తిక్కవరపు సుబ్బరామిరెడ్డిని కోటంరెడ్డి కోరారు. అనంతరం ఆధునికీకరించిన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి ‘స్వీయచరిత్ర’ పుస్తకాన్ని రోశయ్య ఆవిష్కరించారు. మోహన్‌బాబును అతిథులతో పాటు అభిమాన సంఘాల నేతలు సత్కరించారు. మొదట గురుకృప విద్యార్ధుల సాంస్కృతిక నృత్య ప్రదర్శన విశేషంగా అలరించింది కార్యక్రమంలో కార్యక్రమంలో శాంతాబయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తుంగా శివప్రభాత్‌రెడ్డి, జె.వి. రెడ్డి, కొండా బలరామిరెడ్డి, బి.వి.నరసింహం, వై.గురుప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో వచ్చేవారికి చేయూతనివ్వాలి
ఒంగోలు: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు రాజకీయాల పట్ల ఉత్సాహం ఉన్నారని.. అలాంటివారికి చేయూతనిచ్చేందుకు ఆర్యవైశ్యులంతా సమష్టిగా కృషిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహిళా విభాగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు గిరీష్ సంఘీ మాట్లాడుతూ గతంలో తాను రథ యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా చైతన్యం కలిగించానన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ నటి కవిత మాట్లాడుతూ తాను రాజకీయ రంగంలో ఉన్నప్పుడు కూడా కష్టించి పని చేస్తున్నానని తెలిపారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య స్ఫూర్తిగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహిళా విభాగ్ అధ్యక్షురాలు నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి(రాధ) మాట్లాడుతూ కవితకు ఎంఎల్సీ పదవి వచ్చేలే చేసే బాధ్యతను సురేష్, సునీతలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకురాలు, ఆల్ఇండియా ఆర్యవైశ్య మహిళా విభాగ్ జిల్లా అధ్యక్షురాలు మేడూరి శైలజ మాట్లాడుతూ 13 జిల్లాల్లో 49 మంది ఆర్యవైశ్య మహిళలు రాజకీయంగా రాణించారన్నారు. ‘ఆదర్శ హిందూ గృహం’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సినీ నటి కవిత, లయన్స్‌క్లబ్ గవర్నర్ యడ్లపల్లి అమృతవల్లి, పోతుల సురేష్ దంపతులతో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆర్యవైశ్య మహిళా అధ్యక్షులు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను స్మన్మానించారు. కార్యక్రమంలో ఆలిండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, వాసవిసత్రం సముదాయం అధ్యక్షుడు యిమడిశెట్టి కోటేశ్వరరావు, ఆల్ఇండియా వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బదరి విశాల్ బన్సల్, వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు శిద్దా సూర్యప్రకాశరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, ఏల్చూరి వెంకటేశ్వర్లు, వాసవీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ముషీరాబాద్ వైశ్య హాస్టల్ అధ్యక్షుడు చలువాది బదరీనారాయణ, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు యిమ్మడిశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కనుమర్లపూడి హరిప్రసాద్, లయన్స్‌క్లబ్ రీజనల్ చైర్మన్ సీహెచ్ హరిప్రసాద్, కార్యక్రమ నిర్వాహకులు కోడూరి ఇందిర, భారతి, బీ సునీత, పత్తి వెంకట నాగలక్ష్మి, కోడూరి లక్ష్మీతులసి పాల్గొన్నారు. -
రేపు తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం ప్రమాణం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ రోశయ్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు పన్నీరు సెల్వంను రోశయ్య ఆహ్వానించారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు పన్నీరు సెల్వంను నాయకుడిగా ఎన్నుకున్నామని అన్నాడీఎంకే నేతలు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు జైలు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో జయలలిత తనకు అత్యంత నమ్మకస్తుడైన పన్నీరు సెల్వంను తన వారసుడిగా ఎంపిక చేశారు. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఇది రెండోసారి. పన్నీరు సెల్వం జీవిత విశేషాలు: 1951లో జననం 1996లో రాజకీయాల్లో ప్రవేశం 2001 నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక 2001లో సీఎంగా ప్రమాణం ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు -
పన్నీరు సెల్వంకు రోశయ్య ఆహ్వానం
-
పన్నీరు సెల్వంకు రోశయ్య ఆహ్వానం
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు ఓ. పన్నీరు సెల్వంను గవర్నర్ కె. రోశయ్య ఆహ్వానించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంతకుముందు పన్నీరు సెల్వంను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు ఆయనను నాయకుడిగా ఎన్నుకున్నామని అన్నాడీఎంకే నేతలు వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు జయలలిత సీల్డ్ కవర్ లో పంపించినట్టు వార్తలు వచ్చాయి. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఇది రెండోసారి. రేపు ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. -
మమ్మల్ని కాపాడండి: విజయకాంత్
చెన్నై: అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి తమను కాపాడాలని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎండీకే అధ్యక్షుడు ఎ.విజయకాంత్ కోరారు. ఈ మేరకు గవర్నర్ కె. రోశయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు రక్షణ కల్పించాలని గవర్నర్ ను కోరినట్టు భేటీ అనంతరం విజయకాంత్ తెలిపారు. తమ పార్టీ అధినేత్రి జయలలితకు కోర్టు జైలు శిక్ష విధించడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యకాండకు దిగారు. పుదుకొట్టయ్, తిరుచ్చిలోని డీఎండీకే కార్యాలయాలపై అన్నాడీఎంకే మద్దతుదారులు దాడి చేశారు. రెండు ప్రభుత్వ బస్సులను తగులబెట్టారు. -
ఆధార్ సమాచారం భద్రం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆధార్ కార్డుల్లో నిక్షిప్తమై ఉన్న ప్రజల సమాచారం భద్రంగా ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ(యూఐడీఏఐ) మాజీ చైర్మన్ నందన్ నిలేకని స్పష్టం చేశారు. ఆధార్ అనేది వ్యక్తులను ధ్రువీకరించే విధానం మాత్రమేనని, కార్డుల్లో ఉన్న సమాచారం ఎక్కడికీ బదిలీ కాదని శుక్రవారమిక్కడ వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు సృష్టించిన వ్యక్తులకు సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఏటా ఇచ్చే వి.కృష్ణమూర్తి అవార్డును తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నిలేకని మాట్లాడుతూ 67 కోట్ల కార్డులు ఇప్పటి వరకు జారీ అయ్యాయని చెప్పారు. అయిదవ దశ నమోదుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ చేరికతో ఈ సంఖ్య 100 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఆధార్ నమోదులో ఆంధ్రప్రదేశ్(తెలంగాణ, సీమాంధ్ర) ముందుందని గుర్తు చేశారు. ఆధార్ ఒక ధ్రువీకరణ మాత్రమేనని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే వివరాలు తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశిష్ట గుర్తింపుతోనే.. సబ్సిడీల రూపంలో ఏటా కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని నిలేకని అన్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పెద్ద ఎత్తున అవకాశం ఉందని చెప్పారు. ‘విశిష్ట గుర్తింపు ద్వారా అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ లబ్ధి చేకూరుతుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఏటా కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్లు ఆదా అవుతుంది. ఆధార్ సమాచారంలో 99.99% ఖచ్చితత్వం ఉంటుంది. పేరు నమోదులో భాగంగా చేతి వేళ్లు, రెండు కనుపాపల చిత్రాలను తీసుకుంటారు. నకిలీలకు తావు లేదు. పన్ను చెల్లింపు ప్రక్రియలో ఆధార్ అనుసంధానంతో పారదర్శకత ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన ధన యోజన ప్రాజెక్టుకు ఆధార్ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’ అని అన్నారు. ఆధార్ ఫలాలు భవిష్యత్‌లో కనపడతాయని చెప్పారు. కాగా, మారుతీ ఉద్యోగ్ ఫౌండర్ చైర్మన్‌గా, బీహెచ్ఈఎల్, సెయిల్‌కు చైర్మన్‌గా వి.కృష్ణమూర్తి సేవలందించారు. -
విడిపోయినా కలసి ఉండాలి: రోశయ్య
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోరుునా ప్రజలుగా కలసే ఉండాలని కుల, ప్రజాసంఘాలకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ కొణిజేటి రోశయ్య పిలుపునిచ్చారు. ఆదివారం చంపాపేట శ్రీలక్ష్మీ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య తెలంగాణ ప్రజాప్రతినిధులను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్యు వూట్లాడుతూ ఆర్యవైశ్య కులస్తులు రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నందునే మోడీ సర్కార్ తనపై విశ్వాసముంచి కర్ణాటక గవర్నర్ బాధ్యతలను కూడా అప్పగించిందన్నారు -
గ్రామీణ ప్రాంతాలకూ బీమా పథకాలు విస్తరింపజేయాలి
డెంకణీకోట,(హొసూరు, కెలమంగలం), న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాలకూ బీమా పథకాలు విస్తరింపజేసి, అక్కడి ప్రజలకు బీమా కల్పించాలని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కే.రోశయ్య సూచించారు. యునెటైడ్ ఇండియా ఇన్సురెన్స్, రాశీ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా స్వయం సహాయక గ్రూపులకు ఏర్పాటుచేసిన మదర్ థెరిసా బీమా పథకాన్ని శనివారం సాయంత్రం క్రిష్ణగిరి జిల్లా డెంకణీకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆటల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం కింద స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యులైన 10 వేల మంది మహిళలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించారు. బీమా పథకం కార్డులను మహిళలకు గవర్నర్ అందజేశారు.ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి పలు పథకాలు ప్రవేశపెట్టాయని, వీటిని సద్వినియోగం చేసుకు మహిళలు స్వావలంబన సాధించాలని సూచించారు. దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 75 జిల్లాల్లో బీమా పథకం అమలు జరుగుతోందని, ఈ పథకం దేశంలోని ప్రతి ఒక్కరికి వర్తించేలా చూడాలని కోరారు. ఆపదల్లో బీమా ఆదుకుంటుందన్నారు. యూనెటైడ్ ఇన్సురెన్స్ సంస్థలాగా ఇతర బీమా సంస్థలు కూడా ఇలాంటి ఉచిత బీమా పథకాలను ప్రవేశపెడితే అందరికి బీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. క్రిష్ణగిరి జిల్లాలో రాశీ గ్రూప్ సంస్థలు 10 వేల మందికి ఉచితంగా బీమా కల్పించడాన్ని గవర్నర్ అభినందించారు. గవర్నర్ రోశయ్య ఇంగ్లిష్‌లో ఉపన్యాసం ప్రారంభించారు. ప్రజల కోరిక మేరకు తెలుగులో ప్రసంగించారు. మాజీ ఎంపీ. సి.నరసింహన్ స్వాగతోపన్యాసం చేశారు. కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎం.హెచ్ అంబరీష్ కన్నడ భాషలో ఉపన్యసించారు. ఎం.మంజునాథ్ తదితరులు గవర్నర్‌ను సన్మానించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా క్రిష్ణగిరి ఎస్పీ సెందిల్‌కుమార్ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి గవర్నర్ నేరుగా డెంకణీకోటకు వెళ్లారు. హొసూరులోని హోటల్ రినేజెన్స్లో ప్రముఖులను కలిసే కార్యక్రమం రద్దయింది. డెంకణీకోట, హొసూరు, క్రిష్ణగిరి, బెంగళూరు, సర్జాపురం నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ స్వాగతం పలికారు. డెంకణీకోటలో రోశయ్యను కలసి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. గవర్నర్ రాక కోసం పెద్ద ఎత్తున ఉదయం నుంచి ప్రజలు వేచి ఉన్నారు.వర్షం జల్లులు పడడంతో కొంత ఇబ్బంది పడ్డారు.