
బడ్జెట్ ఆచరణాత్మకంగా ఉండాలి: రోశయ్య
- ‘ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ల లోట్లు-పోట్లు’ గ్రంథం ఆవిష్కరణ
హైదరాబాద్: ‘‘వార్షిక బడ్జెట్ పోటాపోటీగా పెరుగుతోంది. పెరగడం మంచిదే అయినా.. మనిషిలో ఊబకాయం పెరిగినట్లుగా బడ్జెట్ ఉండకూడదు. బడ్జెట్ అంచనాలు ఆచరణకు తగ్గట్టుగా ఉండాలి’’ అని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. 1968 ప్రాంతంలో అసెంబ్లీ బడ్జెట్ రూ.40 కోట్లు మాత్రమే ఉండేదని, ఇప్పడు అది రూ. లక్షా 18 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు.
వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వి.హనుమంతరావు సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ల లోట్లు-పోట్లు’ గ్రంథం ఆవిష్కరణ సభ గురువారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ జీఎస్ వరదాచారి అధ్యక్షతన జరిగింది. ఈ గ్రంథాన్ని రోశయ్య ఆవిష్కరించారు. గతంలో ఏపీ ఆర్థిక మంత్రిగా పనిచేసే అవకాశం తనకు కలిగిందని చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి చర్చ ప్రారంభిం చడానికి వి.హనుమంతరావు చేసిన ఆర్థిక రచనలు ఎంతగానో ఉపయుక్తంగా ఉండేవని చెప్పారు.
ఈ గ్రంథాన్ని అనుభవజ్ఞుడు, పదో ఆర్థిక సంఘం సభ్యుడు బీపీఆర్ విఠల్‌కు అంకిత మివ్వడం సముచితంగా ఉందన్నారు. గ్రంథకర్త వి.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ వస్తోందంటే ఏ పన్నులు విధిస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, పన్నుల చెల్లింపు ప్రజలకు భారంగా తయారైందని చెప్పారు. లోటుబడ్జెట్ వస్తే ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతుంటాయని, దీని వల్లే అప్పులు చేస్తుంటాయని చెప్పారు.
సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో టీవీ చానళ్లలో బడ్జెట్‌పై జరిగే చర్చాగోష్టిల్లో గుడ్డిగా వాదించడం జరుగుతోందని, అర్థవంతమైన చర్చ జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గంజివరపు శ్రీనివాస్‌కు డీఎన్‌ఎఫ్ ఉత్తమ జర్నలిస్టు అవార్డును, దర్ప అరుణకు డీఎన్‌ఎఫ్ మహిళాజర్నలిస్టు అవార్డును ప్రదానం చేశారు.