
రాజకీయాల్లో వచ్చేవారికి చేయూతనివ్వాలి
ఒంగోలు: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు రాజకీయాల పట్ల ఉత్సాహం ఉన్నారని.. అలాంటివారికి చేయూతనిచ్చేందుకు ఆర్యవైశ్యులంతా సమష్టిగా కృషిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహిళా విభాగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆల్‌ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు గిరీష్ సంఘీ మాట్లాడుతూ గతంలో తాను రథ యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా చైతన్యం కలిగించానన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ నటి కవిత మాట్లాడుతూ తాను రాజకీయ రంగంలో ఉన్నప్పుడు కూడా కష్టించి పని చేస్తున్నానని తెలిపారు.
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య స్ఫూర్తిగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహిళా విభాగ్ అధ్యక్షురాలు నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి(రాధ) మాట్లాడుతూ కవితకు ఎంఎల్‌సీ పదవి వచ్చేలే చేసే బాధ్యతను సురేష్, సునీతలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకురాలు, ఆల్‌ఇండియా ఆర్యవైశ్య మహిళా విభాగ్ జిల్లా అధ్యక్షురాలు మేడూరి శైలజ మాట్లాడుతూ 13 జిల్లాల్లో 49 మంది ఆర్యవైశ్య మహిళలు రాజకీయంగా రాణించారన్నారు. ‘ఆదర్శ హిందూ గృహం’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సినీ నటి కవిత, లయన్స్‌క్లబ్ గవర్నర్ యడ్లపల్లి అమృతవల్లి, పోతుల సురేష్ దంపతులతో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆర్యవైశ్య మహిళా అధ్యక్షులు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను స్మన్మానించారు.
కార్యక్రమంలో ఆలిండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, వాసవిసత్రం సముదాయం అధ్యక్షుడు యిమడిశెట్టి కోటేశ్వరరావు, ఆల్‌ఇండియా వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బదరి విశాల్ బన్సల్, వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు శిద్దా సూర్యప్రకాశరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, ఏల్చూరి వెంకటేశ్వర్లు, వాసవీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ముషీరాబాద్ వైశ్య హాస్టల్ అధ్యక్షుడు చలువాది బదరీనారాయణ, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు యిమ్మడిశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కనుమర్లపూడి హరిప్రసాద్, లయన్స్‌క్లబ్ రీజనల్ చైర్మన్ సీహెచ్ హరిప్రసాద్, కార్యక్రమ నిర్వాహకులు కోడూరి ఇందిర, భారతి, బీ సునీత, పత్తి వెంకట నాగలక్ష్మి, కోడూరి లక్ష్మీతులసి పాల్గొన్నారు.