
విద్యావ్యాప్తిలో మోహన్‌బాబు కృషి ఎనలేనిది
నెల్లూరు (బాలాజీనగర్) : డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి(బె.గో.రె) అవార్డును అందుకునేందుకు సినీనటుడు మంచు మోహన్‌బాబు అన్ని విధాల అర్హుడని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మోహన్‌బాబుకు ఆయన అవార్డు అందజేశారు. రోశయ్య మాట్లాడుతూ శ్రీవిద్యానికేతన్ ద్వారా విద్యావ్యాప్తికి విశేష కృషిచేస్తున్న వ్యక్తికి బె.గో.రె అవార్డును తన చేతుల మీదుగా అందజేయడం ఆనందంగా ఉందన్నారు.
అత్యంత చిన్నవయస్సులోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరించిన బెజవాడ గోపాల్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా తెలుగువారి ఖ్యా తిని ఇనుమడింపజేశారన్నారు. రాజకీయాలతోపాటు సాహిత్యాభిలాషుడిగా అనేక గ్రంథాలకు రూపకర్తగా బహుళ ప్రాచూర్యం పొందారన్నారు. సాహిత్యంపై ఆయనకున్న అభిమానం, మక్కువ ఎనలేనివన్నారు. బె.గో.రె పేరుతో అవార్డు ప్రదా నం చేయడం శుభపరిణామన్నారు. అవార్డు గ్రహీత మోహన్‌బాబు మాట్లాడుతూ సమాజంలో అన్ని రుగ్మతలకన్నా ‘కులం’ అనే భావన అత్యంత ప్రమాదకరమైనదన్నారు.
తన విద్యాలయాల అప్లికేషన్‌లో కులం ప్రస్తావనే ఉండదన్నారు. ‘ఒకప్పు డు నన్ను ఎందుకూ పనికిరాని వాడవు అన్నారు... పిల్ల నిచ్చేవారే లేరు... రెండు జతల బట్టలు’ అ లాంటి స్థితి నుంచి కష్టపడి, క్రమశిక్షణను నమ్ముకుని ఈ అవార్డు అందుకునే స్థాయికి వచ్చానన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత శి వాజీ గణేశన్‌ను ఆదర్శంగా తీసుకుని తన విద్యాల యాలను దేశంలోనే 6వ స్థానంలో నిలబెట్టడం గ ర్వకారణంగా ఉందన్నారు. నెల్లూరు తన అత్తగారి ఊరని, తనకు ఏమాత్రం కొత్త కాదని చెప్పారు.
నెల్లూరుకు సేవ చేయండి
‘నాది నెల్లూరు సీడ్.. నేను నెల్లూరులో పుట్టాను.. నెల్లూరులో పెరిగాను’ అంటూ వైజాగ్‌లో స్థిరపడి అక్కడి ప్రజలకు సేవలు చేస్తున్నావంటూ తిక్కవరపు సుబ్బరామిరెడ్డిని మోహన్‌బాబు చురకలంటించారు. ఉన్నతాశయాలతో పనిచేసే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి లాంటి నాయకులు అరుదన్నారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నెల్లూరు రూరల్ ప్రజలు అదృష్టవంతులున్నారు. ఆయన భవిష్యత్తులో మంత్రి, ఆ పైస్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.
తాను 560 చిత్రాల్లో నటించి, 56 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించానని ఏనా డు జయాపజయాలను పట్టించుకోలేదన్నారు. రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ కళను ఆదరించి, ప్రోత్సహించినవారే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కస్తూరిదేవి పాఠశాలలోని రవీంద్రభారతి ఆడిటోరియంకు ఏసీ సదుపాయాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ మోహన్‌బాబులోని ముక్కుసూటితనం తనకు నచ్చుతుందన్నారు. ప్రత్యర్థులతో సైతం శభాష్ అనిపించే వాక్చాతుర్యం రోశయ్యకే సొంతమన్నారు.
నెల్లూరు రూరల్ నియోజక వర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పథంలోకి నడిపించాలని తిక్కవరపు సుబ్బరామిరెడ్డిని కోటంరెడ్డి కోరారు. అనంతరం ఆధునికీకరించిన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి ‘స్వీయచరిత్ర’ పుస్తకాన్ని రోశయ్య ఆవిష్కరించారు. మోహన్‌బాబును అతిథులతో పాటు అభిమాన సంఘాల నేతలు సత్కరించారు. మొదట గురుకృప విద్యార్ధుల సాంస్కృతిక నృత్య ప్రదర్శన విశేషంగా అలరించింది కార్యక్రమంలో కార్యక్రమంలో శాంతాబయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తుంగా శివప్రభాత్‌రెడ్డి, జె.వి. రెడ్డి, కొండా బలరామిరెడ్డి, బి.వి.నరసింహం, వై.గురుప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.