
ఉత్తమ అవార్డు ఖరీదు రూ.20 వేలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా తయారైంది అధికార పార్టీలోని కొంద రు నాయకుల పరిస్థితి. పైరవీకారులంతా ప్ర జాప్రతినిధుల వద్దకు వెళుతుంటే తమ పరిస్థితి ఏమిటని భావించారో లేక కాసుల కక్కుర్తికి అలవాటుపడ్డారో కానీ పార్టీ మైనారిటీ నేత ఒకరు ఏకంగా ఉత్తమ అవార్డులు ఇప్పిస్తామం టూ డబ్బులు వసూలు చేయడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలా పది మంది దగ్గర డబ్బులు చేసిన సదరు నేత అందులో ఇద్దరికి అవార్డులు కూడా ఇప్పించగలిగారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పొక్కి చివరకు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ చెవినపడటంతో వారు సదరు నేతపై మండిపడ్డారట. దీంతో చేసిదేమీ లేక తీసుకున్న డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు ఇచ్చేశాడని సమాచారం.
పది మందికి హామీ...
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారిని ప్రభుత్వం ఉత్తమ అవార్డులతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈనెల 2న రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా అవార్డులు అందించిన సంగతి విదితమే. ఈ అవార్డు కింద సన్మానపత్రంతోపాటు రూ.50 వేల చెక్కు కూడా ఇస్తుండటం తో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో అవార్డుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఫలానా కేటగిరిలో ఫలానా వారికే అవార్డు ఇవ్వాలంటూ మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. తెల్లవారితే అవార్డుల ప్రదానోత్సం ఉంటుంద ని తెలిసినప్పటికీ అర్ధరాత్రి వరకు అవార్డు గ్రహీతల పేర్లను అధికారికంగా ప్రకటించలేకపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న అధికార పార్టీ జిల్లా విభాగానికి చెందిన నాయకుడొకరు అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న పలువురిని కలిసి ‘మీకు అవార్డు ఇప్పిస్తాను.
అవార్డు కింద మీకు రూ.50 వేలు వస్తాయి. అందులో నాకు రూ.20 వేలు ఇవ్వండి’ అని ప్రతిపాదించారు. కొందరు సదరు నేత ప్రతి పాదనను తిరస్కరించగా... ఓ పది మంది మాత్రం డబ్బులిచ్చేందుకు సిద్ధపడి కొంత అడ్వాన్సు కూడా ఇచ్చేశారు. అయితే అందులో ఇద్దరికి మాత్రమే అవార్డులొచ్చాయి. నిజానికి ఆ ఇద్దరు ఏ రంగంలోనూ పెద్దగా సేవలందిం చిన వాళ్లు కాదు. అయినప్పటికీ వాళ్ల పేర్లు అవార్డు గ్రహీతల జాబితాలో ఉండటం... మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడంతో అధికార పార్టీ నేతలు ఆరా తీయడం మొదలు పెట్టారు.
మూడో వ్యక్తితో ముప్పు..
సొంత పార్టీ నేతలు ఒకవైపు ఆరా తీస్తున్న సమయంలోనే కాసుల కక్కుర్తికి అలవాటుపడ్డ సదరు మైనారిటీ నేత ఉత్తమ అవార్డు పొందిన వ్యక్తి వద్దకు వెళ్లారు. నిజానికి సదరు వ్యక్తికి మంచి పేరుంది. ఏ రాజకీయ నాయకుడితో నూ పెద్దగా సంబంధాల్లేవు. సేవాభావాలున్న మనిషి. దీంతో ఎలాంటి పైరవీ లేకుండానే అతని పేరును ఉత్తమ అవార్డు గ్రహీతల జాబి తాలో చేర్చారు. అయితే సదరు నేత ఆయనను కూడా వదల్లేదు ‘మీకు అవార్డు మీకు ఇవ్వాలని మంత్రికి, అధికారులకు చెప్పింది నేనే.
నావల్లే నీకు అవార్డు వచ్చింది. మరి నాకేం లేదా?’ అని అడిగారు. దీంతో నోరెళ్లబెట్టిన సదరు అవార్డు గ్రహీత నిజమే కాబోలు అనుకుంటూ రూ.15 వేలు ఇచ్చాడని తెలిసింది. ఈ విషయం ఆ నోటా ఈనోటా చేరి పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. చివరకు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో వారు సదరు నాయకుడిపై మండిపడ్డట్లు సమాచారం. దీంతో భయపడిన సదరు నేత కిక్కురమనకుండా రూ.15వేలు తి రిగి ఇచ్చినట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరు మా త్రం అవార్డులు వచ్చిన సంతోషంలో ఉన్నారు.