‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్ వల్లే మేము తమిళనాడులో పెట్టాలను కున్న పెట్టుబడులను ఏపీకి తీసుకువచ్చాం. తొలుత 600 కోట్ల పెట్టుబడి అనుకున్నాం. ఇప్పుడు 2,600 కోట్లకు పెంచాం.’– ఇది సెంచరీ ప్లైవుడ్ సంస్థ యజమాని వ్యాఖ్య. ‘రావాలి జగన్, కావాలి జగన్... అనే నినాదం రాష్ట్రమంతా మారు మోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు, అభివృద్ధి తెచ్చారు’. – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ.
ఇలాంటి వ్యాఖ్యలు గత టీడీపీ ప్రభుత్వంలో, ఆనాటి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుని ఉద్దేశించి ఎవరైనా చేస్తే, ఒక వర్గం మీడియా ఆహో ఓహో అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవి. అంత కన్నా ఎక్కువగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసిస్తే వాటిని ప్రముఖంగా ఇవ్వకపోవడం ద్వారా ఆ వర్గం మీడియా తన ద్వేషాన్ని వెళ్లగక్కిందనుకోవాలి. రోజూ వ్యతిరేక వార్తలు ఇచ్చే ఈ మీడియా కడప జిల్లా కొప్పర్తిలో అంత పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక వాడ వస్తుంటే, దానిని తక్కువ చేసి చదువరుల దృష్టి పాజిటివ్ విషయాల మీద పడకుండా ఉండేందుకు రోడ్లు బాగోలేవు అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. ఇప్పటికి పలుమార్లు అలాంటి వార్తలు రాసిన వీరు, పనిగట్టుకుని ఆ రోజు కూడా వేశారంటే అది డైవర్షన్ టాక్టిక్స్ అన్న విషయం ఇట్టే అర్థం అయిపోతుంది.
గతంలో ఆ పరిశ్రమ వెళ్లిపోతోంది, ఈ పరిశ్రమ వెళ్లిపోతోంది అంటూ తెలుగుదేశం వారు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా వారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఏకంగా కియా కార్ల ఫ్యాక్టరీ కూడా వేరే చోటికి తరలిస్తున్నారంటూ అసత్య వార్తలను ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే గగ్గోలుగా మాట్లాడారు. తీరా చూస్తే ఆ ప్లాంట్ అక్కడే ఉండటంతో పాటు, మరో 400 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి కూడా పెడుతున్నామని ప్రకటించారు.
తాజాగా నెల్లూరు శ్రీసిటీలో సుమారు 1,500 కోట్ల వ్యయం చేసే ఏసీ తయారీ ప్లాంట్లను రెండు ప్రముఖ సంస్థలు నెలకొల్పు తున్నాయి. అంతకుమించి కడప జిల్లా కొప్పర్తిలో ఒక పారిశ్రామిక వాడనే జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరు అభినందనీయం. అక్కడకు ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమలు వస్తున్న వైనం గమనించ వచ్చు. చంద్రబాబు టైమ్‌లో ఇలాంటి పారిశ్రామికవాడను ఒక్కటైనా, ఎక్కడైనా అభివృద్ధి చేశారా అన్నదానికి జవాబు దొరుకుతుందా? కియా కార్ల ప్లాంట్ రావడం వరకు ఆయన కృషి ఉందంటే ఒప్పు కోవచ్చు. ప్రధాని మోదీ దానిని ఏపీకి ఎంపిక చేశారని బీజేపీ నేతలు చెబుతుంటారు. అది తప్ప మరొక ప్రధానమైన సంస్థ ఏదీ పెద్దగా ఏపీకి టీడీపీ హయాంలో రాలేదు. కాకపోతే తిరుపతిలో ఒకటి, రెండు చిన్న భవనాలలో, మంగళగిరి వద్ద రెండు చిన్న భవనాలలో ఏవో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. వాటిలో కొన్ని వెళ్లిపోయాయని అప్పట్లో ప్రచారం చేశారు. నిజంగా స్టాండర్డ్ సంస్థలు ఏవైనా అలా చేస్తాయా? ప్రభుత్వాలు ఏవి ఉన్నా వాటి పని అవి చేసుకు వెళ్లాలి కదా? అంటే వీటిలో కొన్నిటిని వేరే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఉంటారని అనుకోవచ్చు.
చంద్రబాబు టైమ్‌లో విశాఖలో భారీ సెట్టింగులతో, పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు అయ్యా యని అన్నారు. తీరా చూస్తే ఆచరణలోకి వచ్చింది అతి స్వల్పం. కొందరైతే ఉత్తుత్తి ఒప్పందాలు చేసు కున్నారు. విదేశాలకు పరిశ్రమలు తేవడానికి వెళుతున్నామని ప్రత్యేక విమానాలలో తిరిగి వచ్చారు. కాని ఏపీకి వచ్చిన పరిశ్రమలు ఏమిటో తెలియదు. ముఖ్యమంత్రి జగన్ ఒకసారి వివిధ దేశాల రాయ బారులతో సమావేశం అయి ఏపీలో పరిశ్రమలు పెట్టించాలని కోరారు. ఆ తర్వాత ఏమైనా సమావేశాలు ఉంటే మంత్రి గౌతం రెడ్డి చూసుకుంటున్నారు. జరగవలసిన పని జరిగేలా ముఖ్యమంత్రి కార్యా లయం పర్యవేక్షిస్తుంది. జగన్ సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. సుమారు పది నెలల వ్యవధిలో ఒక పారిశ్రామికవాడను పరిశ్రమల స్థాపనకు అనువుగా సిద్ధం చేశారన్నది కచ్చితంగా విశేష వార్తే అవుతుంది. ఒక వర్గం మీడియా దానికి ప్రాచుర్యం కల్పించనంత మాత్రాన జనానికి అర్థం కాకుండా ఉండదు.
కొప్పర్తి వైఎస్‌ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుందని డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్ శర్మ పేర్కొన్నారు. అలాగే బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ సంస్థ ఏర్పాటు అవుతోంది. ఈ ప్లాంట్ శంకుస్థాపన సభలోనే ఆ సంస్థ యజమానులు ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి సహకారం పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్నది వివరించారు. పులివెందులలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో ఫాషన్ డిజైన్ సంస్థ వస్తోంది. ఈ గ్రూప్ రాష్ట్రానికి మొదటిసారి వచ్చింది. కడప జిల్లా ముఖ చిత్రాన్ని కొప్పర్తి పారిశ్రామికవాడ మార్చే అవకాశం ఉందని రాయలసీమ ప్రాంత ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కాకుండా మరి కొన్ని ముఖ్యమైన సంస్థలు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చాయి. యునైటెడ్ టెలిలింక్ సంస్థ మౌలిక వసతులపై 1,500 కోట్లు, మొబైల్స్ ఉత్పత్తికి 600 కోట్లు వ్యయం చేయడానికి ప్రతిపాదించింది. ఆ కంపెనీ బృందం ముఖ్యమంత్రిని కలిసింది. సన్ ఫార్మా అధినేత దిలీప్ షాంగ్వి ఏపీలో ఒక భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ముఖ్యమంత్రి జగన్ చొరవవల్లే తాము ఇక్కడ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మొదటిసారి తాను జగన్‌ను కలిశాననీ, ఆయన విజన్ బాగా నచ్చిందనీ షాంగ్వి తెలిపారు.ఈ పరిశ్రమ వాస్తవ రూపం దాల్చితే ఏపీకి కొన్నివేల ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇవే సరిపోతాయని కాదు.
ఇలాంటివి ప్రతి జిల్లాలో ఒకటో, రెండో ఏర్పాటు కావాలి. విశాఖలో నెలకొల్పదలచిన ఆదాని డేటా సెంటర్ కనుక సత్వరమే కార్య రూపం దాల్చితే ఏపీ అంతటికీ అది ప్రయో జనం చేకూర్చుతుంది. జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) రాష్ట్రంలో భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన సంస్థ అనం తరం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో పెట్టుబడుల ప్రతి పాదనను రూ. 2,500 కోట్లకు పెంచింది. విశాఖలోనే హార్ట్ వాల్వ్‌లు తయారు చేసే కర్మాగారం నెలకొల్పుతున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది వినూత్న ప్రయోగం. ఇది సఫలమైతే అనేక కంపెనీలు ఈ విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది.
ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో పోర్టుల నిర్మాణానికి ప్రయత్నాలు సాగిస్తోంది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, పెట్రో కారిడార్ వంటివి రావాల్సి ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి అగ్రి హబ్‌లు, ఆక్వాహబ్‌లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మరిన్ని వ్యవసాయాధార పరిశ్రమలు వచ్చేలా ప్రోత్సాహక చర్యలు చేపట్ట వలసిన అవసరం ఉంది. ఇలా ఆయా చోట్ల పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలలో జనావాసాలు పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. ఒక వైపు సంక్షేమంపై దృష్టి పెడుతూనే, మరో వైపు ఇలాంటి ప్రగతి గురించి కృషి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రచారమంతుడుగా మిగిలిపోతే, ప్రచారం లేకుండా తన పని తాను చేసుకు వెళితే జగన్ పనిమంతుడుగా నిలుస్తారని చెప్పడానికి కొప్పర్తి పారిశ్రామికవాడతో సహా పలు పరిశ్రమలకు శ్రీకారం చుట్టిన వైనం నిదర్శనం అవుతుంది.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం ఏం చేసినా ఆహా ఓహోలు కొట్టే మీడియా ఒకటుండేది. అది ఇప్పుడూ ఉంది. కానీ ఇప్పటి ప్రభుత్వం అంతకుమించిన పనులు చేస్తున్నప్పటికీ ఉస్సూరంటూ పెదవి విరుస్తుంటుంది. సంక్షేమమే చాలా, అభివృద్ధి అక్కర్లేదా అంటూ విమర్శించిన టీడీపీ, దాని మీడియా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ అభివృద్ధికి కారణమయ్యే ఎన్నో పరిశ్రమలను తెస్తున్నప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. కానీ ఒకటి... పని చేయకుండా ప్రచారం మాత్రమే చేసుకున్న చంద్రబాబు ప్రచారమంతుడిగానే మిగిలిపోతే, ప్రచారంతో పనిలేకుండా పని చేసుకుంటూ పోతున్న జగన్ పనిమంతుడు అనిపించుకుంటున్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment