తెలుగుదేశం పార్టీని వీడుతున్నాం
పార్టీకి వెలమల కళ్లాల వాసులు గుడ్‌బై
అధికార పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగిన గ్రామస్తులు
శృంగవరపుకోట: ముప్పై సంవత్సరాలు జెండా మోశాం. తెలుగుదేశం పార్టీకి తప్ప మరో పార్టీకి ఏనాడూ ఏ ఒక్క ఓటు వేసిన పాపాన పోలేదు. గ్రామమంతా ఒక్కటే మాటగా గంపగుత్తగా ఓట్లు వేశాం. ఏనాడూ మాకు ఇది కావాలని నాయకుల్ని అడగలేదు. వాళ్లు మాకు చేసింది లేదు సరికదా..ఇప్పుడు మమ్మల్ని ఇరుకున పెట్టి ఇబ్బందుల పాలు చేశారు. పోలీసులు ఈడ్చుకెళ్లి అక్రమంగా అరెస్టు చేస్తే కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు పార్టీ నాయకుడు ఒక్కరూ రాలేదు. ఇదీ మాకు పార్టీలో దక్కిన గౌరవం’’’ అంటూ ఎస్.కోటలోని వెలమల కళ్లాల వాసులు మూకుమ్మడిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం వెలమల కళ్లాల వద్ద డంపింగ్‌యార్డు ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనలో పోలీసులు ఏడుగురు వ్యక్తుల్ని అరెస్టు చేయడం, ఈ ఘటనలో పలువురు మహిళల్ని ఈడ్చేయడం చేశారు. ఈ ఘటనలతో కలత చెందిన వెలమలకళ్లాల వాసులు బుధవారం మీడియాను తమ కళ్లాలకు పిలిచి సమావేశం నిర్వహించారు. మాకు అన్యాయం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం.
పార్టీకి సేవ చేశాం. అభ్యర్థి ఎవరైనా, ఎలక్షన్ ఏదైనా వెలమల కళ్లాలు అంటే తెలుగుదేశం అనేలా పనిచేశామన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్‌లు ఉన్నా ఏనాడూ డంపింగ్‌యార్డు ఇక్కడ పెడతామన్న మాట చెప్పలేదన్నారు. మా బతుకులు పాడవుతాయని అడిగితే పోలీసులతో తన్నించి, కేసులు పెట్టించారని, ఓట్లేసినందుకు మంచి న్యాయం చేశారని వాపోయారు. పోలీసులు అరెస్టులు చేస్తే కనీసం వారికి నచ్చచెప్పేందుకు ఒక్క నేత మా వెంట రాలేదు.
పార్టీవల్ల మాకు న్యాయం జరగలేదు సరికదా..ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్‌ల తీరు వల్ల అన్యాయం జరిగింది. అందుకే మూకుమ్మడిగా 40కుటుంబాల వారం తెలుగుదేశం పార్టీని వీడుతున్నాం అంటూ గ్రామానికి చెందిన పురుషులు, యువకులు ఎడ్ల రామారావు, ఎడ్ల సంతోష్‌కుమార్, నాగిరెడ్డి గణేష్, వేచలపు సత్తిబాబు, ఎడ్ల గోవింద, రామారావు, బోజంకి ఎర్నాయుడు, అప్పలనాయుడు, రాపేటి నాగేశ్వరరావు, వంటాకు గౌరినాయుడులతో పలువురు మహిళలు మూకుమ్మడిగా ప్రకటించారు. అనంతరం వారంతా ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.