
ఊరిస్తున్న ‘నామినేటెడ్’
► పోస్టులపై సీఎం ప్రకటనతో అధికార పార్టీ నేతల్లో చిగురిస్తున్న ఆశలు
► కార్పొరేషన్ స్థాయి పదవుల కోసం పలువురి పోటాపోటీ
► మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు పెరుగుతున్న ఆశావహులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నామినేటెడ్ పదవుల పందేరంపై అధికార పార్టీ నేతల్లో తాజాగా ఆశలు చిగురిస్తున్నాయి. అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారంపై పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల స్పష్టమైన ప్రకటన చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఉద్యమ కాలంలో పార్టీ జెండాను భుజాన వేసుకొని తిరిగిన అనేకమంది నేతలతోపాటు వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు ఈసారి నామినేటెడ్ పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
రాష్ట్రస్థాయి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలను వేగవంతం చేశారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్న వారు సైతం ఈసారి ఎక్కువగా ఉండడం.. వివిధ సందర్భాల్లో ఆయా నేతలకు పార్టీ అధిష్టానం నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తామని హామీఇవ్వడం వంటి కారణాలతో జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు అనేక మంది ఆశలు పెట్టుకున్నారు.
అప్పటి హామీలతో..
డిసెంబర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కకపోవడం, ఆ సమయంలో మున్ముందు ప్రభుత్వం పరంగా భర్తీచేసే నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తామని పార్టీ ముఖ్యులు భరోసా ఇవ్వడంతో ఆయా నేతలు నామినేటెడ్ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి లభించే అవకాశం ఉందని ఆయన అనుచరులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన జగదీశ్వర్‌రెడ్డికి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలో దింపింది. అయితే ఆయన ఓటమి చెందడం, అదే పార్టీ నుంచి పోటీచేసిన మరో అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు. దీంతో జగదీశ్వర్‌రెడ్డి రాష్ట్రస్థాయి పదవీ ఇవ్వాలని పార్టీలోని ఆయన అనుచరులు అధిష్టానాన్ని కోరుతున్నారు.
పెరుగుతున్న ఆశావహులు
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఓటమి చెందిన జైపాల్ యాదవ్, నారాయణపేట నుంచి పోటీచేసిన శివకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, గద్వాలకు చెందిన కృష్ణమోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన ఇంతియాజ్ తదితరులు రాష్ట్రస్థాయి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజాగా నారాయణపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో అక్కడ ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న శివకుమార్‌రెడ్డికి సైతం సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదే రీతిలో అనేక మంది జిల్లా నియోజకవర్గ స్థాయి నేతలు మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ, గ్రంథాలయ కమిటీ వంటి నామినేటెడ్ పదవులపై దృష్టి సారించి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 19 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న ప్రచారం..నియోజకవర్గస్థాయి నేతల్లో జోరు పెంచింది. ఆ పదవి తమకు లభించేలా జిల్లాకు చెందిన మంత్రిని, ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.