
కౌన్సెలింగ్‌తోనే..
జిల్లాలో ఎంపీడీఓల బదిలీకి రంగం సిద్ధమైంది. కౌన్సెలింగ్ ద్వారానే ఈ ప్రక్రియను చేపట్టాలని....
ఎంపీడీఓల బదిలీలకు ఇదేమార్గం
► అధికార వర్గాల్లో కలకలం రేపిన ‘సాక్షి’ కథనం
► సుదీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారికి
► స్థానచలనం.. 11న ముహూర్తం
► రంగం సిద్ధం చేసిన అధికారులు
► ఫలించని యూనియన్ నేతల పన్నాగాలు
► ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ఆరుగురు ఎంపీడీఓలపై బదిలీ వేటు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో ఎంపీడీఓల బదిలీకి రంగం సిద్ధమైంది. కౌన్సెలింగ్ ద్వారానే ఈ ప్రక్రియను చేపట్టాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈనెల 11న ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆయా మండలాల అధికారులకు జెడ్పీ అధికారులు సమాచారం తెలియజేశారు. ఎంపీడీఓల బదిలీల్లో భారీగా పైరవీలు చోటుచేసుకుంటున్నాయని, లాబీయింగ్ చేసిన వారికే కీలకస్థానాలు లభించే అవకాశం ఉందని, ఈ వ్యవహారానికి ఓ యూనియన్‌కు చెందిన కీలకనేత చక్రం తిప్పుతున్నారని శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనం అధికారవర్గాల్లో కలకలం రేపింది. ఐదేళ్ల ఉద్యోగకాలం పూర్తయినా ఎంపీడీఓలను ఇతరప్రాంతాలకు నేరుగా బదిలీచేయాలని తొలుత జిల్లా అధికారులు భావించినా ఈ కథనంలో పునరాలోచనలో పడ్డారు. బదిలీలపై పారదర్శకత లోపిస్తే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరగడంతో కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహించడం మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు.
13 మంది ఎంపీడీఓలకు స్థానచలనం
జిల్లాలో 13మంది ఎంపీడీఓలు ఐదేళ్లపాటు ఒకేచోట పనిచేస్తున్నట్లు తేలింది. అయితే వారిస్థానాల్లో ఎవరిని నియమిస్తారో.. ఏయే మండలాల అధికారులను భర్తీచేస్తారోనన్న అంశం ప్రస్తుతం పంచాయతీరాజ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమకు అనుకూలమైన స్థానాలను పొందేందుకు ప్రయత్నాలు ఏ మేరకు ఫలించనున్నాయో ఈనెల 11న తేలనుంది. కౌన్సెలింగ్ ద్వారా బదిలీ జరుగుతుండడంతో ఒక్కో అధికారికి రెండు లేదా మూడు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లభించినట్లయింది. ఇక తన రాజకీయ పలుకుబడితో మహబూబ్‌నగర్ ఎంపీడీఓ పోస్టును పొందేందుకు ప్రయత్నించిన ఓ యూనియన్ నేతకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరుగుతుండడంతో ఆయనకు అవకాశం లేకుండాపోయింది.
అయినా ఏదోమార్గం ద్వారా కీలక స్థానాలను పొం దేందుకు సదరునేత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఉద్యోగవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బదిలీకి అవకాశం లేని పక్షంలో తానిప్పుడు నిర్వహిస్తున్న డిప్యూటేషన్ పోస్టునే పదిలపర్చుకోవడంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇక ఆయనను నమ్ముకుని కీలకస్థానాలకు భారీ పైరవీలు చేసిన కొందరు ఎంపీడీఓలు రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు పోస్టింగ్‌లపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ఒకే మండలంలో ఐదేళ్లు పూర్తవడంతో పాటు పనితీరు బాగాలేని, ప్రజల నుంచి ఫిర్యాదులు రావడం వంటి కారణాలతో జిల్లాలో మరో ఆరుగురు ఎంపీడీఓలపై బదిలీ వేటువేసేందుకు అధికారులు రంగం సిద్ధంచేసినట్లు తెలిసింది. అయితే చాలాకాలంగా ఎంపీడీఓలకు బదిలీలు లేకపోవడంతో అనేకమంది అధికారపార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిదులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా కీలకస్థానాలు పొందేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తుండడం విశేషం.