అధికార పార్టీలో రాజ్యసభ హడావుడి | discussion on rajya sabha seats in ruling party | Sakshi
Sakshi News home page

అధికార పార్టీలో రాజ్యసభ హడావుడి

Published Tue, Feb 27 2018 8:35 AM | Last Updated on Tue, Feb 27 2018 8:35 AM

discussion on rajya sabha seats in ruling party - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  అధికార పార్టీలో రాజ్యసభ అంతర్మథనం మొదలయింది. అర్థిక బలం, పార్టీలో పరపతి ఉన్న నేతలకే పదవులు అంటూ ముఖ్యుల నుంచి సంకేతాలు రావటంతో సీనియర్‌ నేతలు గళం విప్పేందుకు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యంగా రాజ్యసభ పదవి జిల్లా నేతల్లో ఒకరిని వరించే అవకాశం ఉండటంతో ఆర్థిక పరపతితో పాటు సామాజికవర్గాల వారీగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ప్రస్తుతానికి జిల్లాలో పార్టీ నేతలు బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి మిగిలిన సీనియర్‌ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలతో పాటు ఆశావాహుల్లోని లోటుపాట్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే చిన్నస్థాయి నామినేట్‌ పదవులు కూడా భర్తీ చేయకపోవటంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న క్యాడర్‌పై రాజ్యసభ కొత్త చిచ్చుపెట్టినట్లయింది. 

పోటీ తీవ్రం
అధికార పార్టీలో రాజ్యసభ సీటు కోసం పోటీ తీవ్రమైంది. ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ ఆర్థిక పరపతిలేని నేతలు అనేక మంది ఉన్నారు. కనీసం వారి పేరును కూడా పరిశీలనలోకి తీసుకోకపోవటం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. కావలి టీడీపీ ఇన్‌చార్జి బీద మస్తాన్‌రావు పేరు బీసీ కోటాలో తెరపైకి వచ్చింది. పార్టీలో సీనియర్‌ నేతగా, వివాదరహితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.

అలాగే ఆర్థికంగానూ స్థితిమంతుడు కావటంతో ఖర్చుకు వెనుకాడని పరిస్థితి. ఈ క్రమంలో అతని పేరు పరిగణనలో ఉంది. నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఎస్సీ సామాజికవర్గ కోటాలో సూళ్లూరుపేట పార్టీ ఇన్‌చార్జి పరసా రత్నం కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే బీద సోదరులు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, మంత్రి లోకేష్‌ను కూడా కలిసినట్లు సమాచారం. గతంలో టీటీడీ చైర్మన్‌ పదవి రేసులో బీద మస్తాన్‌రావు ఉన్నారు. 

బీద సోదరులపై వ్యతిరేకత
ఇదిలా ఉండగా పార్టీలో బీద సోదరులపై వ్యతిరేకత ఉంది. జిల్లాలో బీసీ కోటాలో పార్టీ పదవులన్నీ వారికేనా అనే అసంతృప్తి స్వరం కొంత కాలంగా బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా చిన్నపాటి పదవి నుంచి రాజ్యసభ వరకు అన్నింటికీ వారే ప్రయత్నాలు చేసుకుంటే మిగిలిన బీసీ నేతల పరిస్థితి ఏంటనే చర్చ  సాగుతోంది. ఇప్పటికే బీద మస్తాన్‌రావు గత ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి ఓటమి పాలై అక్కడ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నాడు. దీంతోపాటు రాజధాని నిర్మాణకమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు బీద రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు శాసనమండలి సభ్యునిగానూ కొనసాగుతున్నారు.

అలాగే పైడేరు ఎస్కేప్‌ చానల్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ–2 చైర్మన్‌గా బీద గిరిధర్‌ వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు బీద మస్తాన్‌రావు బావ దేవరాల సుబ్రహ్మణ్యం కావలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. బీదా మస్తాన్‌రావు సోదరి మస్తానమ్మ నగరంలో కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్నారు.  ఇలా ఒకే కుటుంబంలో ఐదు పదవులు, అది కూడా పార్టీలో బీసీ కోటాలోని పదవులు కావటంతో పార్టీలోని సీనియర్‌ బీసీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా బీద మస్తాన్‌రావు పేరు తెరపైకి రావటం చర్చనీయాంశంగా మారింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement