
ప్రజలే దేవుళ్లు !
► నమ్మేది సామాజిక న్యాయాన్నే
► ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: ‘నేను నాస్తికుడిని కాదు, నా దృష్టిలో దేవుళ్లంటే ప్రజలే. నేను నమ్మేది సామాజిక న్యాయాన్నే’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. సిద్ధరామయ్య స్వగ్రామం మైసూరు జిల్లా సిద్దరామనహుండిలో శుక్రవారం జరిగిన జాతర మహోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొని, గ్రామస్తులతో అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో సిద్ధరామయ్య ముచ్చటించారు. సిద్ధరామనహుండిలో మూడేళ్లకోసారి సిద్ధరామేశ్వర, చిక్కతాయమ్మల జాతర మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. 2011లో జాతర జరిగిన సందర్భంలో తాను కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు.
అయితే ఆలయ జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో ఐదేళ్లుగా జాతర మహోత్సవాన్న నిర్వహించలేక పోయారని పేర్కొన్నారు. తాను దేవుడిని నమ్ముతానని, అయితే మూఢ నమ్మకాలను, ఆచారాలను ఒప్పుకోనని స్పష్టం చేశారు. ప్రజలకు అందాల్సిన సామాజిక న్యాయానికే తాను ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తానని అన్నారు. బసవణ్ణ తత్వాలు, సిద్ధాంతాలను తను నమ్ముతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.
లోకాయుక్తకు ఎలాంటి నష్టం ఉండబోదు.....
అవినీతి నిరోధక దళం(ఏసీబీ) ఏర్పాటు కారణంగా లోకాయుక్తకు ఎలాంటి నష్టం ఉండబోదని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. లోకాయుక్తకు ఉన్న ఎలాంటి అధికారాలనూ మార్చలేదని, కేవలం అవినీతిని మరింత పటిష్టంగా ఎదుర్కొనేందుకు మాత్రమే ఏసీబీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ విషయంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు విపక్షాలకు సైతం ఎలాంటి అనుమానాలున్నా వాటిని నివృత్తి చేస్తానని వెల్లడించారు.