
సీఎంపై అధిష్టానం గుర్రు
► బడ్జెట్ సమావేశాల తర్వాత ఢిల్లీ రావాలని సూచన
► ఏసీబీ ఏర్పాటుపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి
సాక్షి, బెంగళూరు: అవినీతి నిరోధక దళం(ఏసీబీ) ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుసరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉంది. ఏసీబీ ఏర్పాటు సమయంలో హైకమాండ్‌కు ఏమాత్రం సమాచారం అందజేయకపోవడంతో పాటు సొంత పార్టీ నేతల సూచనలను కూడా పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా సీఎం సిద్ధరామయ్యకు హైకమాండ్‌ను పిలుపు అందింది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తై అనంతరం సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక రాష్ట్రంలో అవినీతి పరులకు సింహస్వప్నంగా ఉన్న లోకాయుక్త సంస్థను నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఏర్పాటు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సందర్భంలో జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి సైతం ‘ఏసీబీ’ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా సీఎంకు సూచించాలంటూ ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రోజుల క్రితం జరిగిన సీఎల్పీ సమావేశంలో సైతం ‘ఏసీబీ’ ఏర్పాటు విషయంలో తమతో సంప్రదించలేదని, తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నిలదీశారు.
ఏసీబీ’ ఏర్పాటుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ సైతం గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఫోన్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ‘దేశంలోనే అత్యంత చక్కని పనితీరు ఉన్న లోకాయుక్తగా కర్ణాటక లోకాయుక్తకు పేరంది. అలాంటి సందర్భంలో లోకాయుక్తను నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకోవడం సరికాదు’ అని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా లోకాయుక్తలో సీఎంతో పాటు మరో ఐదుగురు కేబినెట్ మంత్రులపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే ‘ఏసీబీ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థల ప్రతినిధులు సైతం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఏసీబీ’ ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్ సమర్ధిస్తుందా అన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో నెలకొన్నాయి.