
మార్పులకు వేళాయే..
బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణ
పదకొండు జెడ్పీ అధ్యక్ష పీఠాలను చేజెక్కించుకుంటాం
సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణ చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఫలితాలకు మంత్రి మండలిలో మార్పులకు సంబంధం లేదని ఆయన తెలిపారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగళూరులోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మంత్రి వర్గ పునఃవ్యవస్థీకరణకు సమయం ఆసన్నమైందని, బహుశా బడ్జెట్ సమావేశాల తర్వాత ఆ ప్రక్రియను చేపడుతామని వివరించారు. తాజా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో తాము సొంతంగా 25 జెడ్పీ అధ్యక్షస్థానాలు గెలుచుకుంటామని భావించినా అలా జరగలేదన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం 1,705 గెలుచుకున్న టీపీ క్షేత్రాలకు అదనంగా మరో 100-150 ఎక్కువ స్థానాలు గెలుస్తామని భావించినా ఆ మేరకు గెలువలేకపోయామన్నారు.
విపక్షాలైన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌లతో పోలిస్తే తమకే అటు జెడ్పీ క్షేత్రాలు ఇటు టీపీ క్షేత్రాల్లో మెజారిటీ సీట్లు సాధించామన్నారు. ప్రస్తుత ఫలితాలను అనుసరించి పదకొండు జెడ్పీ అధ్యక్ష పీఠాలను సొంతంగా చేజెక్కించుకుంటామన్నారు. ఎనిమిది చోట్ల బీజేపీ, జేడీఎస్ సొంతంగా రెండు జెడ్పీ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకుంటాయాన్నారు. మిగిలిన తొమ్మిది చోట్ల పొత్తులు పెట్టుకునే విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ఉండబోదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు పరమేశ్వర్ ఢిల్లీ వెళ్లినట్టు తనకు తెలుసునని బడ్జెట్ సమావేశాల విషయమై తాను బిజీగా ఉండటం వల్ల ఢిల్లీ వెళ్లలేదన్నారు. సమయం చూసుకుని తాను హైకమాండ్ పెద్దలను కలుస్తాన ని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానమిచ్చారు.