మదనపల్లె: అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ప్రచార ఆర్భాటం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రొటోకాల్‌ను విస్మరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సబ్‌కలెక్టర్ కృతికాబాత్రాకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం ఆయన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సినప్రాధాన్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభంలో ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన‘ హౌస్‌ఫర్ ఆల్’ పథకానికి సంబంధించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పైలాన్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ నిబంధనల మేరకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. వీలైనంత త్వర గా శిలాఫలకాన్ని మార్చి ప్రొటోకాల్ నిబంధన ప్రకారం ముఖ్య అతిథి స్థానంలో తన పేరును ముద్రించి ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. స్పందించిన సబ్‌కలెక్టర్ ప్రొటోకాల్ ఉల్లంఘనపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, బిఏ ఖాజా, మస్తాన్‌రెడ్డి, ఎంపీపీ సుజనా బాలకృష్ణారెడ్డి, జరీనా హైదర్, జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్, సుజాత, సర్పంచ్ శరత్‌రెడ్డి పాల్గొన్నారు.