
ఆయనొద్దు.. ఈయనొద్దు!
► బదిలీలపై టీడీపీ నేతల పోస్టుమార్టం
► ఒత్తిళ్లతో జిల్లా అధికారుల బేజారు
► కొత్త స్థానాల్లో చేరని పలువురు ఉద్యోగులు
► యథాస్థానాల కోసం నేతల పట్టు
► మరోసారి బదిలీలు తప్పవనే చర్చ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మరోసారి బదిలీలు చేపట్టాల్సి రానుందా? బదిలీలు చేయాల్సిందేనంటూ అధికార పార్టీ నేతల నుంచి మళ్లీ ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయా? ఈ నేపథ్యంలోనే బదిలీ అయిన పలువురు ఉద్యోగులు ఆయా స్థానాల్లో బాధ్యతలు చేపట్టలేదా? అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మరోసారి బదిలీల ఫైళ్లను దులపనున్నారా? అనే వరుస ప్రశ్నలకు నిజమేననే సమాధానం వస్తోంది. ఒకవైపు రెవెన్యూలో కీలక సంస్కరణలు అమలవుతున్న సందర్భంలో పలువురు తహశీల్దార్లు విధుల్లో చేరేందుకు విముఖత చూపుతుండటంతో పాలన అస్తవ్యస్తంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం చందంగా అధికార పార్టీలోని నేతల నుంచే వద్దని ఒకరు.. చేయాల్సిందేనని మరొకరు ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు మరోసారి బదిలీలకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది.
చేరమంటే చేరం..
► జిల్లాలో మొత్తం 16 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. అయితే, ఇందులో పలువురు ఇంకా బదిలీ జరిగిన ప్రాంతంలో బాధ్యతలు తీసుకోలేదు. ప్రధానంగా ఆళ్లగడ్డ తహసీల్దార్‌ను రుద్రవరానికి బదిలీ చేశారు. అయితే, ఈయన ఇప్పటివరకు విధుల్లో చేరలేదు. అహోబిలం ఆలయం విషయంలో స్థానికంగా ఉన్న ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిప్యత పోరులో భాగంగా బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలో మరో అధికార పార్టీ నేత బదిలీ చేసిన చోట బాధ్యతలు తీసుకోవద్దని, మళ్లీ ఇక్కడికే పోస్టింగ్ ఇప్పిస్తానని చెబుతున్నట్టు సమాచారం.
► కల్లూరు తహసీల్దారును బీ-సెక్షన్ సూపరిండెంటుగా బదిలీ చేశారు. ఈయన కూడా విధుల్లో చేరలేదు. ఏదో ఒక మండలానికి తహసీల్దారుగా వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు కొద్ది మంది అధికార పార్టీ నేతలు పైరవీ చేస్తున్నారని తెలిసింది.
► సి.బెళగల్ తహశీల్దారును బనగానపల్లెకు మార్చారు. ఈయన కూడా విధుల్లో చేరలేదు. కోడుమూరు నియోజకవర్గంలో కొద్దిరోజుల క్రితం పార్టీ మారిన నేత ఈ బదిలీ వెనుక ఉన్నారని సమాచారం. దీంతో మరో అధికార పార్టీ నేత ఈయనను ఇక్కడే ఉంచేందుకు పావులు కదపడం ప్రారంభించారు. ఈ విధంగా పలువురు తహసీల్దార్లు బదిలీ జరిగిన చోటకు వెళ్లకుండా నచ్చిన చోటనే ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
అవకాశం లేకున్నా...
ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏ ఒక్క తహసీల్దారునూ బదిలీ చేసే అవకాశం లేదు. అయితే, పరిపాలన సౌలభ్యం పేరుతో అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు కొద్ది మందిని బదిలీ చేశారు. ఇప్పుడు అధికార పార్టీ నేతల్లోనే ఎక్కడికక్కడ మరో వర్గం బదిలీ జరగకుండా ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎవరి మాట వినాలనే విషయంలో జిల్లా ఉన్నతాధికారులకూ అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కొంత మంది వివిధ ఆరోపణలతో పోస్టింగులు కూడా దక్కించుకోలేదు. వీరు కూడా ఇప్పుడు పోస్టింగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం మీద మరోసారి జిల్లాలో బదిలీల ప్రక్రియకు తెరలేవనుందన్నమాట.