![ఆ రికార్డులెక్కడ? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81491426203_625x300.jpg.webp?itok=14GhKejr)
ఆ రికార్డులెక్కడ?
⇒ముదపాక భూముల్లో మరో కోణం
⇒రెవెన్యూ అధికారుల పనేనని అనుమానం
⇒మలుపులు తిరుగుతున్న కుంభకోణం
⇒భూములను పరిశీలించిన కలెక్టర్, జేసీ
విశాఖపట్నం/పెందుర్తి : పెను సంచలనం రేపిన పెందుర్తి మండలం ముదపాక భూముల వ్యవహారంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. దళితులకు చెందిన వందల ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేయడానికి కొంతమంది అధికార పార్టీ పెద్దలు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, సాక్షిలో పలు కథనాలు రావడం, అసెంబ్లీలో చర్చ జరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, ఆర్డీవో వెంకటేశ్వరరావు, వుడా అధికారులు ముదపాక వెళ్లి వివాదాస్పద అసైన్డ్ భూములను సందర్శించారు. రెవెన్యూ, వుడా అధికారుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించారు.
అధికారిక రికార్డులెక్కడ
ఈ అసైన్డ్ భూములకు చెందిన అధికారిక రికార్డులు లేవని సాక్షాత్తూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. దీంతో వందల కోట్ల రూపాయల విలువైన భూముల రికార్డులు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఈ భూములను రైతుల నుంచి కొట్టేయడానికి వేసిన స్కెచ్‌లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిం చారన్న ఆరోపణలు ఆది నుంచీ ఉన్నాయి. రెవెన్యూ సిబ్బంది, అధికారులతో కుమ్మక్కైన కొంతమంది పెద్దలు ఎకరం రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
ఆ భూములను విక్రయించకపోతే ప్రభుత్వమే స్వాధీనం చేసేసుకుంటుందని, అప్పుడు ఈ సొమ్ము కూడా దక్కకుండా పోతుందని భయపెట్టారు. బెదిరించి అక్రమంగా కొందరు భూముల్లోంచి రోడ్డు కూడా వేసేశారు. అది నిజమేనేమోనని నమ్మిన రైతులు తమ భూములు అమ్మకానికి ముందుకొచ్చారు. ఇలా 236 మంది రైతుల నుంచి 280 ఎకరాల భూమిని కొనుగోలుకు ‘పెద్దలు’ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకరానికి రూ.లక్ష చొప్పున అడ్వాన్సుగా చెల్లించి వారి నుంచి ముందస్తుగా తెల్లకాగితాలు, ప్రాంసరీనోట్లపై సంతకాలు చేయించుకున్నారు.
వుడా ఎంట్రీతో ఉలిక్కపడ్డ రైతులు
చివరకు తమ నుంచి కొనుగోలు చేస్తున్న భూములను వుడా భూసేకరణ (ల్యాండ్ పూలింగ్) కు ఎకరం కోటి రూపాయలకు ఇస్తున్నారన్న సంగతి తెలుసుకుని సదరు రైతులు షాక్ తిన్నారు. ఈ మోసాన్ని గుర్తించిన ఆ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు, రైతులు ఏకమై పత్రికలు, బీజేపీ శాసనసభా పక్షనేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజును ఆశ్రయించారు. దీనిపై సాక్షిలో ప్రముఖంగా కథనాలు ప్రచురితమయ్యాయి.
మరోవైపు విష్ణుకుమార్‌రాజు అసెంబ్లీ ఈ కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఈ బాగోతంలో అధికార పార్టీ పెద్దలు, రెవిన్యూ అధికారులు కూడా ఉన్నారని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై బుధవారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ జేసీ, ఆర్డీవో, తహసీల్దార్లను వెంటబెట్టుకుని ముదపాక భూములను పరిశీలించారు. అనంతరం ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన అధికారిక రికార్డులు లేవని, ఎంజా య్‌మెంట్ సర్వేకు ఆదేశించామని కుండబద్దలు కొట్టారు. అంటే ఈ రికార్డులు మాయం వెనక రెవెన్యూ అధికారులున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.