
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. ముడా కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు.
ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా తనపై వచ్చిన ఆరోపణలకు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీతో ప్రాసిక్యూషన్‌ను అనుమతించవద్దని గవర్నర్‌ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. నోటీసును ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తనపై, కర్ణాటక సర్కారుపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.
ముడా కుంభకోణం ప్రకంపనలు..
ఇదిలా ఉండగా సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.
మరోవైపు, 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ గత వారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసరే గ్రామంలో మూడెకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి తమదే అని నిరూపించడంతో ఆయన విఫలమయ్యాయడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే, పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జు్న్‌పై మరో ఫిర్యాదు దాఖలైంది. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అందులో పేర్కొన్నాడు. దీంతో, కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపించాడు.
Comments
Please login to add a commentAdd a comment