గిరిజనులను అవమానించడమే
► కిడారి టీడీపీలో చేరికపై ఎమ్మెల్యే బూడి వ్యాఖ్య
► ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడేదిలేదని పునరుద్ఘాటన
► ప్రతికార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపు
► 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే విజయం
మాడుగుల రూరల్: వైఎస్సార్ సీపీ పార్టీ గుర్తుపై గెలిచిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరడం గిరిజనుల మనోభావాలు దెబ్బతీయడమేనని మాడుగుల శాసనసభ్యుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ చేశారు. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారపార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను పార్టీని వీడబోనని ఆయన పునరుద్ఘాటించారు. పార్టీ నేత జగన్‌మెహన్‌రెడ్డి ఎంతో నమ్మకంతో పార్టీ బీ ఫారం ఇచ్చారని, నియోజకవర్గ ప్రజలు విశ్వాసంతో గెలిపించారని ఆయన అన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయబోనని స్పష్టంచేశారు.
వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం
ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని బూడి తెలిపారు. రాష్ర్టంలో పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతికార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపిచ్చారు. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఓడిపోయిన వ్యక్తితో శంకుస్థాపనలా?
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్యెల్యేను కాదని ఓడిపోయిన అధికార పార్టీ నాయకుడు రామానాయుడు నియోజకర్గంలో ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని తనకు నేరుగా తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలో మాడుగులలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపురెడ్డి రాజారాం అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు పెదబాబు, కన్నారావు, అప్పలనాయుడు, కృష్ణమూర్తి, పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.