అధికార పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. తమకు అనుకూలంగా లేకపోతే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి...
18 మంది తహసీల్దార్లకు స్థానచలనం
అర్ధరాత్రి ఆగమేఘాల మీద బదిలీలు
మంత్రి ‘గంటా’ బృందం ఒత్తిళ్లు
అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు
అధికార పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. తమకు అనుకూలంగా లేకపోతే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరినైనా మార్చేయడం పరిపాటిగా మారింది. తమ అడుగులకు మడుగులొత్తే అధికారుల కోసం నిస్సిగ్గుగా పైరవీలు సాగిస్తున్నారు. కొన్ని బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా జోక్యం చేసుకుంటుండగా.. వారి అనుచరగణం తామేమి తీసిపోమన్నట్టుగా పైరవీలు సాగిస్తున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి మరీ తమకు అనుకూలంగా ఉండే తహ సీల్దార్లకు కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇప్పించగలిగారు.
విశాఖపట్నం: ఉలుకూ పలుకులేదు, చడీ చప్పుడు లేదు.. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో 18 మంది తహసీల్దార్లకు స్థానచలనం జరిగింది. ఇందుకోసం గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వరకు పైరవీలు సాగాయి. సాధారణంగా ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో రెవెన్యూతో సహా వివిధ శాఖల్లో అంతర్గత బదిలీలు జరుగుతుంటాయి. గతేడాది విశాఖ ఆర్డీవోతో సహా జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో మంత్రుల మధ్య జరిగిన ఆధిపత్య పోరు తీవ్ర దుమారాన్నే రేపింది. మళ్లీ ఈ ఏడాది రాజకీయ బదిలీల పర్వం మొదలైంది. తాజాగా జిల్లాలో 18మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. వీరిలో ఎక్కువగా మంత్రులతో పాటు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట వినడం లేదనే సాకుతోనే బదిలీ వేటుపడినట్టు తెలిసింది. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత నియోజకవర్గమైన భీమిలి టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పరుచూరి భాస్కరరావు ఒత్తిడి మేరకు విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్ ఎల్.సుధాకర్‌నాయుడుపై వేటు వేసినట్టు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో సుధాకర్‌నాయుడు తమ మాట వినడం లేదనే అక్కసుతో ఆయనను ఎలాగైనా బదిలీ చేయించేందుకు పావులు కదిపారు. అదే సమయంలో అచ్యుతా పురం తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎం.శంకరరావును రూరల్ మండలానికి తెచ్చు కోవాలన్న పట్టుదలతోనే మంత్రి గంటా ద్వారా జిల్లా ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ అనుకున్నది సాధించుకున్నార ని వినికిడి. భాస్కరరావు ఒత్తిడి మేరకే నాయుడ్ని కదపాల్సి వచ్చిందంటున్నారు. నగరంలో దీర్ఘకాలం పాటు పనిచేస్తున్న అర్బన్ తహసీల్దార్ కేవిఎస్ రవితో పాటు, ఇటీవల ఆవ భూముల ఆక్రమణల విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో అనకాపల్లి తహసీల్దార్ ఎస్.భాస్కరరెడ్డిపై బదిలీ వేటు వేశారు. రవి స్థానంలో రూరల్ తహశీల్దార్ సుధాకర నాయుడ్ని వేయగా.. భాస్కరరెడ్డి స్థానంలో వి.మాడుగుల తహశీల్దార్ పి.కృష్ణమూర్తిని నియమించారు. మంత్రి అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు నర్సీపట్నం తహసీల్దార్‌గా పనిచేస్తున్న వి.వి.రమణపై వేటు వేశారు. కానీ ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు. అదే విధంగా మిగిలిన తహసీల్దార్ల బదిలీలు కూడా స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే జరిగినట్టు సమాచారం. నాలుగైదు రోజుల నుంచి ఈ కసరత్తు జరుగుతున్నప్పటికీ ఒత్తిళ్ల నేపథ్యంలో బయటకు పొక్కనీయకుండా రెవెన్యూ వర్గాలు జాగ్రత్త పడ్డారు.
మంగళవారం ఉదయమే తుది జాబితా సిద్ధమైన ప్పటికీ అర్ధరాత్రి వరకు రాజకీయ ఒత్తిళ్లు సాగడం వల్లే రాత్రి 11.30 గంటల సమయంలో కలెక్టర్ సంతకం చేసినట్టు చెబుతున్నారు. మళ్లీ ఉదయానికి ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయోననే ఆందోళనతో అర్ధరాత్రి ఆఘమేఘాల మీద బదిలీ ఉత్తర్వులు పంపడం.. తెల్లారగానే రిలీవ్ చేయడం అంతా చకచకా సాగిపోయింది. ఇక రెండో విడత బదిలీలు ఈ నెల 9 నుంచి 15 మధ్యలో జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచే చేయాల్సి ఉన్నప్పటికీ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షా సదస్సులు జరుగనుండడంతో 9 నుంచి బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. శాఖల వారీగా రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారితోపాటు పరిపాలనా సౌలభ్యం పేరిట ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు బదిలీలు చేపట్టేందుకు రంగం చేస్తున్నారు.