సోనామురా/కైలాషహర్: త్రిపురలో అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రజల జీవితాలను బానిస బతుకులు చేసిందని, ఆ పార్టీని గద్దె దించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో మోదీ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాణిక్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన మోదీ..బీజేపీ అధికారంలోకి వస్తే త్రిపురలో ‘హీరా’(హెచ్–హైవేలు, ఐ–ఇంటర్నెట్, ఆర్–రోడ్లు, ఏ–ఎయిర్‌వేస్) అభివృద్ధి చెందుతుందని అన్నారు.
25 ఏళ్లుగా నిరంతరాయంగా పాలిస్తున్న కమ్యూనిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రేషన్ కార్డు లాంటి చిన్నాచితకా అవసరాలకూ ఆ పార్టీ తలుపులు తట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఎవరైనా హత్యకు గురైతే ఆ పార్టీ నుంచి అనుమతి రానిదే ఎఫ్‌ఐఆర్ నమోదుచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు ప్రతి దానికీ ప్రజలు తమపైనే ఆధారపడేలా చేసారని, బానిసత్వానికి ఇది కొత్త రూపమని అభివర్ణించారు. లెఫ్ట్ పాలనలో త్రిపురలో అభివృద్ధి ఇసుమంతైనా కనిపించడం లేదని ఆరోపించారు. తామొస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలుచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment