పోలీసుల స్వామిభక్తి...
ఎన్‌సీపీ దాడి కేసులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అరెస్టుల పర్వం
అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో కొనసాగుతున్న వేధింపులు
కార్యాలయాన్ని ధ్వంసం చేసి, నాయకులపై దాడి చేసిన నిందితులను గుర్తించని వైనం
నరసరావుపేటటౌన్: అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసు అధికారులు నడుస్తూ స్వామి భక్తిని చాటుకొంటున్నారు. నల్లపాటి కేబుల్ విజన్(ఎన్‌సీవీ) కార్యాలయం ధ్వంసం అనంతరం జరిగిన పరిణామాల్లో కేవలం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. మరికొందరిని విచారణపేరుతో వేధిస్తున్నారు. దీంతో పాటు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నాయకులకు బెయిల్ రాకుండా ఉండేందుకు కుట్రపన్నుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నరసరావుపేటలో ఇటీవల ఎన్ సీవీ కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖర్‌రావును తీవ్రంగా గాయపరచిన నిందితులను ఇప్పటివరకు గుర్తించని పోలీసులు, బాధితులైన ఎన్‌సీవీ యాజమాన్యంపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేసిన విషయం విదితమే. కేసులో అరెస్టయి సబ్‌జైల్‌లో ఉన్న ఎన్‌సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాద్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లాం కోటేశ్వరరావులకు బెయిల్ రాకుండా ఉండేందుకు దేశం నాయకుల వత్తిడితో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసులో ఫిర్యాదుదారుడైన షేక్ జానిమౌలాలి ప్రభుత్వ వైద్యశాల నుంచి నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయినా ఇంకా వైద్యశాలలోనే ఉన్నాడని పోలీసులు కోర్టుకు సమర్పించడం విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. జాని మౌలాలి విషయంపై వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి.మోహన్ శేషుప్రసాద్‌ను వివరణ కోరగా మూడురోజుల క్రితం వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయి వెళ్ళినట్టు ధ్రువీకరించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వేళ బెయిల్‌పై విడుదలైతే మరోకేసులో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కౌన్సిలర్ కేసులో అత్యుత్సాహం ..
కౌన్సిలర్ శీలు బాబురావు పెట్టిన కేసులో పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనుమానితుల పేరుతో శనివారం రాత్రి జొన్నలగడ్డ, పమిడిపాడు, సాతులూరు గ్రామాలకుచెందిన సుమారు పదిమందిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారిని కలుసుకొనేందుకు బంధువులు, గ్రామస్తులు స్టేషన్‌కు వెళ్ళగా వారిపట్ల దురుసుగా వ్యవహరించినట్లు బంధువులు చేప్పారు. స్టేషన్‌లో ఉన్న వారిపై విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.