ఒంగోలు అర్బన్: అధికార పార్టీ నేతలకు మహిళలపై గౌరవం లేదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటలపోటీలు, సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళలు కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.
గతంలో కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దారుపై అధికార పార్టీ ఎమ్మెల్యే చేయిచేసుకోవడం, ఇటీవల మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకి హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రవర్తించిన తీరుతో పాటు రాష్ట్రంలో మహిళలపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ మహిళా దినోత్సవం నుంచి అయినా అధికార పార్టీ నేతల్లో మహిళల పట్ల మార్పు రావాలన్నారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అని చెప్పి మోసం చేశారన్నారు. మహిళా విభాగం జిల్లా అ«ధికార ప్రతినిధి బడుగు ఇందిర మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళలకు కనీస భద్రత కల్పించాలన్నారు. నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా మహిళలకు సముచిత స్థానం ఇచ్చి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలను కల్పించి అమలు చేయాలని కోరారు. సమావేశంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కావూరి సుశీల, అనంతలక్ష్మీ తదితరులు ఉన్నారు.
అధికార పార్టీకి మహిళలపై గౌరవం లేదు
Published Wed, Mar 8 2017 12:02 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM
Advertisement