► ఎమ్మెల్యేలకే అధికారమంటూ ప్రచారం
► ఆందోళనలో పాత నేతలు
► కరణంకు కార్పొరేషన్ పదవి, గొట్టిపాటికి నియోజకవర్గ బాధ్యతలు..?
► అన్నా, దివి శివరాంల పరిస్థితి అయోమయం
► అమీతుమీకి సిద్ధమవుతున్న పాత నేతలు
► పజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒక పక్క టీడీపీ పాత నేతలు.. కొత్తగా పార్టీలో చేరిన శాసనసభ్యుల పట్ల ఆ పార్టీ అధిష్టానం పూటకో తీరున వ్యవహరిస్తుండటంతో పాత నేతల్లో అంతర్మథనం మొదలైంది. తాజాగా ఎమ్మెల్యేలకే నియోజకవర్గ బాధ్యతలు అంటూ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరగడం పాత నేతలకు పుండు మీద కారం చల్లినట్లయింది. అధిష్టానం వైఖరిపై పాత నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అమీతుమీకి సిద్ధపడాలని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం పాత నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పదవులు ఎర వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం బలరాంకు ఆర్టీసీ లేదా మరో ఇతర కార్పొరేషన్ పదవులు అప్పగించనున్నట్లు సమాచారం.
కార్పొరేషన్ పదవి ఇస్తానంటూ గతంలోనే చంద్రబాబు తనకు చెప్పారని ఇటీవల కరణం సైతం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కరణంకు కార్పొరేషన్ పదవి అప్పగించి అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను కొత్తగా పార్టీలో చేరిన గొట్టిపాటికి అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అద్దంకి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కరణం వెంకటేష్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వెంకటేష్ దీనికి అంగీకరిస్తాడా... అన్నది అనుమానమే. చిన్న వయస్సులోనే వెంకటేష్ రాజకీయ భవిష్యత్తుకు గండి పడుతుంటే కరణం బలరాం చూస్తూ ఊరుకుంటారా..? అదే జరిగితే తండ్రి, కొడుకులు టీడీపీ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధపడే పరిస్థితి ఉంటుందన్న ప్రచారం ఉంది.
ఇక గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును పక్కనపెట్టి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో చేర్చుకునే సమయంలోనే అశోక్‌రెడ్డికి చంద్రబాబు, చినబాబు లోకేష్‌లు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. అందులో భాగంగానే అన్నా రాంబాబును మెల్లగా గిద్దలూరు రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే రాంబాబును బుజ్జగించేందుకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారా... లేదా... అన్నది వేచి చూడాల్సిందే...? ప్రాధాన్యతనివ్వకపోతే రాంబాబు తన వర్గీయులతో కలిసి అధిష్టానంతో తేల్చుకునేందుకు వెనుకాడే పరిస్థితి లేదు.
ఇక కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోతుల రామారావును పార్టీలో చేర్చుకొని ఇప్పటికే పాత నేత దివి శివరాంకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించింది. పోతుల రామారావు, దివి శివరాంల మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. శివరాం వర్గీయులను తన వైపు తిప్పుకునేందుకు పోతుల అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొందరు నేతలు పోతుల వైపు మళ్లారు. పోతులను బలోపేతం చేసి శివరాంను బలహీనుడ్ని చేసి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శివరాంకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా... లేదా... అన్నది ప్రశ్నార్థకమే. ఒక వేళ నామినేటెడ్ పదవి కట్టబెట్టకపోతే శివరాం పార్టీలో కొనసాగుతారా అన్నదీ సందేహమే.
జిల్లా స్థాయిలో ముగ్గురు నేతలకు ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పదవులు అధిష్టానం కట్టబెడుతుందా... అన్నది అనుమానమే. నాయకుల సంగతి పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఏ మాత్రం ఇష్టం లేదు. దశాబ్దాల పాటు పార్టీ జెండాలు మోసిన తమకు ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారు అడ్డు తగులుతుంటే కార్యకర్తలు సహించే పరిస్థితి ఉండదు. అయితే ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో క్షేత్రస్థాయిలో పాత నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వర్గీయులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.
సంక్షేమ అభివృద్ధి పథకాల్లో తమకే ప్రాధాన్యతనివ్వాలంటూ పోటీ పడి గొడవలకు దిగుతున్నారు. దీంతో జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో పాత నేతలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గిస్తే అది క్షేత్ర స్థాయిలోనూ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే కార్యకర్తల పక్షాన నిలిచి అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు పాత నేతలు సిద్ధపడనున్నట్లు సమాచారం.