gottipati
-
టీడీపీ దర్శి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కేసు
దర్శి: ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలో జరిగిన పలు ఘటనల్లో 6 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..బొట్లపాలెంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ గ్రామంలో పోలింగ్ ఆపాలని నిబంధనలకు విరుద్ధంగా ధర్నాకు దిగిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు ధర్నా చేసిన వారి వివరాలు తెలుసుకుని కేసులు నమోదు చేయనున్నారు. దర్శిలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఎంఈవో కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఈవీఎం పగులకొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డి పై కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా కళ్లు తిరుగుతున్నాయని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పోలీసులు కళ్లుగప్పి వీసీ రెడ్డి పరారయ్యాడు. పోలీసుల వైఫల్యంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వీసీ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద పోలింగ్ బూత్ వద్ద అల్లర్లు సృష్టించి పోలీసులపై రాళ్లు రువ్విన కేసులో దారం సుబ్బారావు పై కేసు నమోదు చేశారు. రాళ్లు రువ్విన వారి వీడియోలు పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ చెప్పారు. బొట్లపాలెంలో జరిగిన గొడవల్లో క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదులపై 2 కేసులు నమోదు చేసి ఇరువర్గాలపై కలిపి 22 మంది పై కేసులు నమోదు చేశారు. దేవవరంలో వైఎస్సార్సీపీకి చెందిన కిష్టిపాటి నాగిరెడ్డిని శేషంవారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులు దేవవరం వచ్చి తల పగులగొట్టిన కేసులో సానె గురువయ్య, సానె వీరాంజనేయులు, ఎ.నరసింహారావు, ఎస్.శ్రీను, అచ్చయ్య, ముత్యాల నరశింహంపై కేసు నమోదు చేశారు. -
మినీ రణమేనా..?
♦ నేడు ఒంగోలులో టీడీపీ మినీ మహానాడు ♦ వేమవరం హత్యలతో రగిలిపోతున్న కరణం బలరాం వర్గం ♦ గొట్టిపాటి వర్గంతో ఢీ అంటే ఢీ ♦ బలప్రదర్శనకు సిద్ధమవుతున్న ఇరువర్గాలు ♦ మహానాడుకు తరలిరావాలని కార్యకర్తలకు పిలుపు ♦ మరోసారి పగలు రగిలే అవకాశం ♦ మంత్రులు, జిల్లా అధ్యక్షుడికి సాధ్యం కాని సర్దుబాటు ♦ నేటి సభకు భారీ బందోబస్తు ♦ ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ ఎన్.సంజయ్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగే టీడీపీ మినీ మహానాడు సభ రణరంగంగా మారే అవకాశం కనిపిస్తోంది. కరణం, గొట్టిపాటి వర్గాలు ఈ సమావేశానికి హాజరైతే మరోమారు గొడవలు తప్పవని ఆ పార్టీ వర్గాలే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్ హాలులో గురువారం జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలోని తన అనుచరులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. కరణం వర్గీయులు సైతం సమావేశానికి భారీగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాలు సభకు హాజరైతే గొడవలు ఖాయం. వాటిని ఆపే శక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు, లేదా పార్టీ పరిశీలకులు, మంత్రులకు లేదు. ఇక పోలీసులు ఆది నుంచి చేష్టలుడిగి చూస్తుండటం తప్ప స్పందిస్తున్న దాఖలాల్లేవు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వేమవరం జంట హత్యల నేపథ్యంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ హత్యలకు కారణం గొట్టిపాటేనని బలరాం వర్గం ఆరోపణ. మంగళవారం ఒంగోలులో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక సమావేశంలో కరణం, గొట్టిపాటి వర్గాలు బాహాబాహీకి సిద్ధపడిన విషయం తెలిసిందే. గన్మేన్లతో వచ్చిన గొడవ ఇటు కరణం, అటు గొట్టిపాటి వర్గాలు పరస్పర దాడులకు దిగే వరకు వచ్చింది. ఏకంగా కరణం, గొట్టిపాటిలు కలియబడ్డారు. పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఘర్షణలో గొట్టిపాటి చొక్కా చినిగి కిందపడిపోయాడు. గొట్టిపాటి గన్‌మేన్ తోయడంతోనే గొడవ మొదలైందని కరణం బలరాం పేర్కొన్నారు. మొత్తంగా మంగళవారం జరిగిన సమావేశం ఇరువర్గాల ఘర్షణతో రసాభాసగా మారింది. గొట్టిపాటి కనపడగానే ఆగ్రహంతో ఉన్న కరణం వర్గం దాడులకు తెగపడుతోంది. గొట్టిపాటి వర్గం సైతం ప్రతిదాడులకు సిద్ధమంటూ సవాల్ విసురుతోంది. ఆధిపత్య పోరుకు వేదిక.. గురువారం జరిగే మినీ మహానాడు మరోమారు రణరంగంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గొడవ నేపథ్యంలో కరణం వర్గంతో పాటు గొట్టిపాటి వర్గీయులు సైతం పెద్ద ఎత్తున మినీ మహానాడుకు హాజరయ్యేందుకు సిద్ధమవుతోంది. చిన్నపాటి గొడవ జరిగినా అమీతుమీ తేల్చుకోవాలని కరణం వర్గం సైతం సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆది నుంచి ఇరువర్గాల గొడవలను ఏ మాత్రం పట్టించుకోక జిల్లా పోలీస్ యంత్రాంగం చోద్యం చూస్తోంది. మంగళవారం నాటి ఘర్షణలోనూ ఇదే జరిగింది. గురువారం నాడు పరిస్థితి ఇలాగే ఉంటే మినీ మహానాడు ఇటు కరణం, అటు గొట్టిపాటి వర్గాలు అధిపత్య పోరుకు వేదికగా మారుతుందనడంలో సందేహం లేదు. ఘర్షణ ఏ స్థాయికి దారి తీసిన ఆశ్చర్యపడనక్కర్లేదు. గొడవలు పెంచింది.. చంద్రబాబే కరణం వ్యతిరేకించినా.. గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు ఇరువర్గాల గొడవల విషయం పట్టించుకోవడం లేదు. దీంతో కరణం, గొట్టిపాటి వర్గాల అధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. అధికారుల బదిలీలు మొదలుకొని పింఛన్లు, బ్యాంక్ రుణాలు, అభివృద్ధి పనుల విషయంలో ఇరువురు పోటీ పడుతూ వచ్చారు. పంతం నెగ్గించుకునేందుకు అధికారులపై ఒత్తిడులు పెంచారు. వీరి గొడవలతో అద్దంకి నియోజకవర్గంలో జన్మభూమి–మా ఊరు కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. జనచైతన్యయాత్రల ఊసే లేదు. పార్టీ సభ్యత్వ కార్యక్రమం మూలనపడింది. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు జోక్యం చేసుకోలేదు. ఇద్దరిని ఒకే గూటికి చేర్చి తాంబూలాలిచ్చాం.. తన్నుకుచావండి.. అన్న రీతిలో వ్యవహరించారు. ఇరువురు నేతలను కూర్చోబెట్టి మాట్లాడింది లేదు. సర్దుబాటు చేసే ప్రయత్నం చేయలేదు. ఇదే విషయాన్ని ఇటీవల కరణం బలరాం సైతం పేర్కొనడం గమనార్హం. దీంతో అద్దంకి నియోజకవర్గంలో ఇరువురు నేతల గొడవలు మరింత పెరిగాయి. పదేళ్ల తర్వాత ఇక్కడ మళ్లీ హత్యారాజకీయాలు మొదలయ్యాయి. బాబు వైఖరి వేమవరం జంట హత్యలకు కారణమైందన్న విమర్శలున్నాయి. సీఎం ఆదేశాలు అమలయ్యేనా..? మంగళవారం ఒంగోలులో కరణం, గొట్టిపాటి వర్గాలు గొడవకు దిగడం, బుధవారం జరగాల్సిన మినీ మహానాడు వాయిదా పడిన నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు రొటీన్‌గా పత్రికల్లో వార్తలొచ్చాయి. గొట్టిపాటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా.. ఆయన నిరాకరించినట్లు సమాచారం. గొడవల నేపథ్యంలో ఇరువర్గాలను పిలిచి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి అవేమీ పట్టించుకోవడం లేదు. అయితే బుధవారం ఉదయం పార్టీ అంతర్గత గొడవలపై ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక నుండి పార్టీ సమావేశాల్లో ఏ ఒక్క నేత గొడవకు దిగినా.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడికక్కడే సస్పెండ్ చేయాలని కమిటీ నేతలను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇది ఎంత వరకు అమలు జరుగుతుందో వేచి చూడాలి. మినీ మహానాడుకు భారీ బందోబస్తు ఒంగోలు క్రైం : ఒంగోలులో గురువారం నిర్వహించనున్న టీడీపీ మినీ మహానాడుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. టీడీపీ మినీ మహానాడును పురస్కరించుకొని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రస్తుతం జిల్లా టీడీపీలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్ట్యా ఐజీ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం.త్రివిక్రమ వర్మ, ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో జరిగిన జంట హత్యలు, తదనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల మధ్య, వారి అనుచరుల మధ్య ఏ–1 కన్వెన్షన్ హాలు చోటు చేసుకున్న ఘర్షణలు, తోపులాటలు, దూషణలను పురస్కరించుకొని పూర్తి స్థాయి పోలీస్ నిఘాలో మినీ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం జిల్లాలోని అందరు డీఎస్పీలను ఇక్కడే మోహరింపచేయనున్నారు. ఎస్పీతోపాటు దాదాపు పది మందికి పైగా డీఎస్పీలు 25 మందికి పైగా సీఐలు వందల సంఖ్యలో ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులను మోహరింజేస్తున్నారు. నిఘా విభాగాల ముందస్తు సమాచారం మేరకు మినీ మహానాడు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మూడు, నాలుగు వేల మంది హాజరయ్యే సభకు కేవలం వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకోసం పార్టీ ముఖ్యులకు పోలీస్ అధికారులు పాస్‌లు కూడా జారీచేసినట్టు సమాచారం. పాత గుంటూరు రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఏర్పాట్లపై జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పోలీసులు సమీక్షించారు. -
అద్దంకిలో పొలిటికల్ వార్
= ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల ఫ్లెక్సీ చించివేత = కొంగపాడులో శిలాఫలకంపై ముద్రించిన ఎమ్మెల్యే పేరు కొట్టివేత అద్దంకి : అద్దంకి అధికార పార్టీలో ముఖ్య నేతల మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి ఫస్ట్ సమయంలో అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బలరామ్ వర్గీయుల మధ్య జరిగిన భీకర పోరు ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలకు కళ్లముందే కనిపిస్తోంది. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఇరువర్గాలపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసును ఇటీవలే ఇరువర్గాలు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే రవికుమార్‌ను సీఎం చంద్రబాబునాయుడు టీడీపీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అద్దంకిలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నియోజకవర్గంలోని పలుచోట్ల ఇప్పటి వరకూ ఏదోఒక చోట గొడవ జరుగుతూనే ఉంది. ఇటీవల చిన్న కొత్తపల్లిలో రవికుమార్ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అలాగే 40 రోజుల క్రితం కొరిశపాడు మండలం మాలెంపాటివారిపాలెంలో రహదారి కోసం వేసిన శిలాఫకాలన్ని ఎవరో ధ్వంసం చేశారు. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా మండలంలోని మణికేశ్వరంలో బీటీ రహదారికి రవికుమార్ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అదే విధంగా కొంగపాడులో రహదారి శంకుస్థాపన కోసం ఆర్అండ్బీ శాఖ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో గొట్టిపాటి రవికుమార్ పేరులో కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. ఆకతాయిలు ఇలా చేస్తున్నారా? లేక గిట్టని వారు చేస్తున్నారా? అనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఫ్లెక్సీల విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని స్థానికులు భావిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. గతంలో అద్దంకిలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, మరోసారి అటువంటి గొడవలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
అధికార పార్టీలో అంతర్మథనం
► ఎమ్మెల్యేలకే అధికారమంటూ ప్రచారం ► ఆందోళనలో పాత నేతలు ► కరణంకు కార్పొరేషన్ పదవి, గొట్టిపాటికి నియోజకవర్గ బాధ్యతలు..? ► అన్నా, దివి శివరాంల పరిస్థితి అయోమయం ► అమీతుమీకి సిద్ధమవుతున్న పాత నేతలు ► పజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒక పక్క టీడీపీ పాత నేతలు.. కొత్తగా పార్టీలో చేరిన శాసనసభ్యుల పట్ల ఆ పార్టీ అధిష్టానం పూటకో తీరున వ్యవహరిస్తుండటంతో పాత నేతల్లో అంతర్మథనం మొదలైంది. తాజాగా ఎమ్మెల్యేలకే నియోజకవర్గ బాధ్యతలు అంటూ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరగడం పాత నేతలకు పుండు మీద కారం చల్లినట్లయింది. అధిష్టానం వైఖరిపై పాత నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అమీతుమీకి సిద్ధపడాలని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం పాత నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పదవులు ఎర వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం బలరాంకు ఆర్టీసీ లేదా మరో ఇతర కార్పొరేషన్ పదవులు అప్పగించనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పదవి ఇస్తానంటూ గతంలోనే చంద్రబాబు తనకు చెప్పారని ఇటీవల కరణం సైతం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కరణంకు కార్పొరేషన్ పదవి అప్పగించి అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను కొత్తగా పార్టీలో చేరిన గొట్టిపాటికి అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అద్దంకి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కరణం వెంకటేష్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వెంకటేష్ దీనికి అంగీకరిస్తాడా... అన్నది అనుమానమే. చిన్న వయస్సులోనే వెంకటేష్ రాజకీయ భవిష్యత్తుకు గండి పడుతుంటే కరణం బలరాం చూస్తూ ఊరుకుంటారా..? అదే జరిగితే తండ్రి, కొడుకులు టీడీపీ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధపడే పరిస్థితి ఉంటుందన్న ప్రచారం ఉంది. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును పక్కనపెట్టి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో చేర్చుకునే సమయంలోనే అశోక్‌రెడ్డికి చంద్రబాబు, చినబాబు లోకేష్‌లు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. అందులో భాగంగానే అన్నా రాంబాబును మెల్లగా గిద్దలూరు రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే రాంబాబును బుజ్జగించేందుకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారా... లేదా... అన్నది వేచి చూడాల్సిందే...? ప్రాధాన్యతనివ్వకపోతే రాంబాబు తన వర్గీయులతో కలిసి అధిష్టానంతో తేల్చుకునేందుకు వెనుకాడే పరిస్థితి లేదు. ఇక కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోతుల రామారావును పార్టీలో చేర్చుకొని ఇప్పటికే పాత నేత దివి శివరాంకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించింది. పోతుల రామారావు, దివి శివరాంల మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. శివరాం వర్గీయులను తన వైపు తిప్పుకునేందుకు పోతుల అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొందరు నేతలు పోతుల వైపు మళ్లారు. పోతులను బలోపేతం చేసి శివరాంను బలహీనుడ్ని చేసి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శివరాంకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా... లేదా... అన్నది ప్రశ్నార్థకమే. ఒక వేళ నామినేటెడ్ పదవి కట్టబెట్టకపోతే శివరాం పార్టీలో కొనసాగుతారా అన్నదీ సందేహమే. జిల్లా స్థాయిలో ముగ్గురు నేతలకు ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పదవులు అధిష్టానం కట్టబెడుతుందా... అన్నది అనుమానమే. నాయకుల సంగతి పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఏ మాత్రం ఇష్టం లేదు. దశాబ్దాల పాటు పార్టీ జెండాలు మోసిన తమకు ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారు అడ్డు తగులుతుంటే కార్యకర్తలు సహించే పరిస్థితి ఉండదు. అయితే ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో క్షేత్రస్థాయిలో పాత నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వర్గీయులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాల్లో తమకే ప్రాధాన్యతనివ్వాలంటూ పోటీ పడి గొడవలకు దిగుతున్నారు. దీంతో జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో పాత నేతలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గిస్తే అది క్షేత్ర స్థాయిలోనూ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే కార్యకర్తల పక్షాన నిలిచి అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు పాత నేతలు సిద్ధపడనున్నట్లు సమాచారం. -
మార్చి వరకు సాగర్ నీళ్లివ్వాలి.. గొట్టిపాటి డిమాండ్
ప్రకాశంజిల్లా (అద్దంకి): సాగర్ నీటిని వచ్చే నెల మార్చి నెలాఖరు వరకు ప్రభుత్వం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రులు రైతులకు ఇచ్చినమాటను నిలబెట్టుకోవాలన్నారు. ఇప్పటికిప్పుడు సాగర్ నీరు నిలుపుదల చేస్తే ఆంధ్రప్రదేశ్‌లోని 15 లక్షల ఎకరాల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 4.20 లక్షల భూముల్లో ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వరి చాలా వరకు కోతకు వచ్చే దశలోనూ, మరి కొంత పొట్ట దశలోనూ ఉందని చెప్పారు. ఆ పంటకు నీరు అవసరమైన కీలక సమయం ఇదేనన్నారు. ఈ సమయంలో ఆంధ్ర రైతుల పొలాలకు నీరు నిలిపేయడం నష్టం కలిగించే చర్యగా ఆభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలను చేపట్టి, రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి వెంటనే ఏపీకి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోర్డు స్పందించకుంటే పోట్లాడైనా నీరు తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సాగర్ ఆయకట్టు ఆంధ్రలోనే ఎక్కువగా ఉందన్నారు. ఆంధ్రలో సుమారు 15 లక్షల ఎకరాల భూములుంటే, తెలంగాణాలో కేవలం 6.5 లక్షల ఎకరాల సాగు భూమి మాత్రమే ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో సాగర్‌పె మన అధికారుల అజమాయిషీ ఉండాలే కాని, తెలంగాణా అధికారుల అజమాయిషీ ఏమిటని ప్రశ్నించారు. వారు చెప్పినట్టు మనం వినాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే రెండు సార్లు సాగర్ నీరు ఆగి మరలా విడుదల కావడంతో పంట భూములు ఎండిపోయి బతికాయన్నారు. మరలా రెండు రోజులు నీటి విడుదల నిలిస్తే, కాలువకు నీరు వచ్చే సమయానికి పంటలు ఎండిపోవడం ఖాయమన్నారు. సుబాబుల్ రైతుల బకాయిలు చెల్లించాలి.. గతంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన సుబాబుల్ కర్ర బకాయిలను కంపెనీల నుంచి చెల్లించే విధంగా సంబంధిత మంత్రి చొరవ చూపాలన్నారు. టన్ను గిట్టుబాటు ధర రూ.4400 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమకు కర్ర దొరకని సమయంలో పొగాకు బదులుగా సుబాబుల్ చెట్లు వేస్తే మంచి ఆదాయం వస్తుందని చెప్పిన కంపెనీ ప్రతినిధులు నేడు కర్ర అధికంగా లభిస్తుండడంతో ధరను తగ్గించే ప్రయత్నాలను చేయడం మంచి పద్దతి కాదన్నారు. -
గొట్టిపాటిపై దాడికి నిరసన
అనంతపురం: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపై దాడిని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. గొట్టిపాటిపై దాడిని నిరసిస్తూ వారు వినూత్న ప్రదర్శన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రవిపై దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్ సీపీ నేత ఎర్రస్వామిరెడ్డి డిమాండ్ చేశారు. ఇటాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోనే ఎమ్మెల్యే రవికుమార్ పై కరణం వర్గీయులు సోమవారం దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే కారు అద్దాలను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినవిషయం తెలిసిందే. -
గొట్టిపాటిపై దాడిని ఖండించిన చాంద్ బాషా
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై టీడీపీ నేతల దాడిని కదిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా తీవ్రంగా ఖండించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొట్టిపాటిపై దాడికి పాల్పడిన వారిని పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత అధికార పార్టీపై ఉందన్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఏకపక్ష వైఖరి విడనాడాలని హితవు పలికారు.