అద్దంకిలో పొలిటికల్ వార్
= ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల ఫ్లెక్సీ చించివేత
= కొంగపాడులో శిలాఫలకంపై ముద్రించిన ఎమ్మెల్యే పేరు కొట్టివేత
అద్దంకి : అద్దంకి అధికార పార్టీలో ముఖ్య నేతల మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి ఫస్ట్ సమయంలో అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బలరామ్ వర్గీయుల మధ్య జరిగిన భీకర పోరు ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలకు కళ్లముందే కనిపిస్తోంది. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఇరువర్గాలపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసును ఇటీవలే ఇరువర్గాలు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే రవికుమార్‌ను సీఎం చంద్రబాబునాయుడు టీడీపీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అద్దంకిలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నియోజకవర్గంలోని పలుచోట్ల ఇప్పటి వరకూ ఏదోఒక చోట గొడవ జరుగుతూనే ఉంది. ఇటీవల చిన్న కొత్తపల్లిలో రవికుమార్ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు.
అలాగే 40 రోజుల క్రితం కొరిశపాడు మండలం మాలెంపాటివారిపాలెంలో రహదారి కోసం వేసిన శిలాఫకాలన్ని ఎవరో ధ్వంసం చేశారు. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా మండలంలోని మణికేశ్వరంలో బీటీ రహదారికి రవికుమార్ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అదే విధంగా కొంగపాడులో రహదారి శంకుస్థాపన కోసం ఆర్‌అండ్‌బీ శాఖ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో గొట్టిపాటి రవికుమార్ పేరులో కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. ఆకతాయిలు ఇలా చేస్తున్నారా? లేక గిట్టని వారు చేస్తున్నారా? అనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఫ్లెక్సీల విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని స్థానికులు భావిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. గతంలో అద్దంకిలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, మరోసారి అటువంటి గొడవలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.