రూ. వందల కోట్లు పెట్టి 17 మంది ఎమ్మెల్యేలను కొన్నారు
♦ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అనైతిక చర్య ఇది
♦ నైతిక బాధ్యత ఉంటే ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలి
♦ లేదంటే స్పీకర్ అనర్హత వేటు వేయాలి
♦ వాజ్‌పేయ్ ఒక్క ఎంపీని తీసుకుంటే అధికారం ఉండేది
♦ లోక్‌సభలో మేకపాటి ఆవేదనపూరిత ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ రూ.వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై ఫిర్యాదుచేసినా అధికార పార్టీకే చెందిన స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వైఎస్సార్‌సీపీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం లోక్‌సభలో కేంద్ర పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘మేం ఈ బడ్జెట్‌కు సిన్సియర్‌గా మద్దతు పలుకుతున్నాం. కానీ ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరో పార్టీకి ఫిరాయించడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
ఇది చాలా అనైతికమైన పని, దురదృష్టకరమైన చర్య. దీనిని మనం సరిచేయాల్సి ఉంది. లేదంటే ఇదొక పరిహాసంగా మారుతుంది. ఇదే పార్లమెంటులో మనం చేసుకున్న చట్టాలను మనమే నాశనం చేసుకుంటే ఎలా? ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది సభ్యులు ఉండే సభలో 108 మంది సభ్యులతో ప్రభుత్వం స్థిరంగా ఉంది. మా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ సుస్థిరత పట్ల భయపడాల్సిన పనేమీ లేదు. కానీ మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఒకరొకరిగా ప్రతిరోజు, దినం తప్పించి దినం లాక్కుంటున్నారు. వందల కోట్లు చెల్లించి ఇప్పటివరకు 17 మంది ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు జరిపారు’’ అని ఆవేదన పూరితంగా ప్రసంగించారు.
టీడీపీ ఎంపీల ఆందోళన..
ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఇది సరికాదంటూ ఆందోళనకు దిగగా స్పీకర్ ఈ ఆందోళన విషయాన్ని, మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభియోగం మోపిన నేత పేరు రికార్డులకు వెళ్లవని ప్రకటించారు. టీడీపీ నేతల ఆందోళనకు ప్రతిస్పందించిన మేకపాటి... ‘‘నేను చెప్పింది పూర్తి వాస్తవం. నేనెన్నడూ అబద్ధం చెప్పలేదు. వాళ్లు భారీగా సొమ్ములు చెల్లించి మా ఎమ్మెల్యేలు 17 మందిని కొనుగోలు చేశారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇది చాలా అనైతికం. వాళ్లకు నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేయాలి. లేదంటే గౌరవ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయాలి..’’ అని డిమాండ్ చేశారు.
వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి..
ఉత్తరాఖండ్‌లో స్పీకర్ అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని మేకపాటి చెప్పారు. ‘‘కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపుదారులపై మేం ఫిర్యాదులు చేసినప్పటికీ స్పీకర్ చర్య తీసుకోవడం లేదు. ఈ విషయంలో మనకు వాజ్‌పేయి గొప్ప ఉదాహరణగా నిలుస్తారు. ఆయన అధికారంలో ఉండాలనుకుంటే, తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని తలిస్తే, ఇతర పార్టీలకు చెందిన సభ్యులను తీసుకుని ఉండేవారు.మధ్యంతర ఎన్నికలు రాకుండా ఉండేవి. కానీ ఆయన అలా చేయలేదు. ఈ గొప్ప ఉదాహరణను మనం అనుసరించాలి’’ అని చెప్పారు.
‘‘అందుకే ఆయన భారతరత్న అయ్యారు’’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ... ‘‘అవును మేడమ్. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనను ఆరాధించాల్సిన అవసరం ఉంది. మనం చేసుకున్న ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సరిచేసుకోని పక్షంలో దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికై మరో పార్టీకి మారిన 3 నెలల్లో ఆ ఫిరాయింపుదారుడిపై అనర్హత వేటు పడాలి. మనం ఫిరాయింపు నిరోధక బిల్లును సరిచేసుకోవాలి..’’ అని విజ్ఞప్తి చేశారు.