వాళ్లే.. మా వాళ్లు! | tdp leaders herrasess in government job holders | Sakshi
Sakshi News home page

వాళ్లే.. మా వాళ్లు!

Published Thu, Apr 7 2016 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

వాళ్లే.. మా వాళ్లు!

వాళ్లే.. మా వాళ్లు!

టీడీపీలో ఇన్‌చార్జీలదే హవా
నియోజకవర్గ నిధులూ వారికే..
తేల్చి చెబుతున్న ప్రభుత్వ పెద్దలు
నివ్వెరపోతున్న వలస నేతలు
నియోజకవర్గ అభివృద్ధి కోసమే
పార్టీ మారుతున్నట్లు ప్రకటనలు
తాజా నిధుల మంజూరులో దక్కని స్థానం
ప్రజల్లోకి వెళ్లేదెలాగనే ఆందోళన

 
నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెబుతున్న నేతలకు అధికార పార్టీ షాక్ ఇస్తోంది. ఇదివరకు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులకే పెద్దపీట వేస్తుండటం పట్ల వలస నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు వచ్చిన అవకాశాన్ని కాస్తా చేజార్చుకుని.. ‘పచ్చ’నోట్లకు తలొగ్గిన నేతల్లో అంతర్మథనం మొదలయింది. పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని భావించిన నేతలకు మొదటికే మోసం రావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
 
 
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు
: అధికార పార్టీలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవమానాలు తప్పట్లేదు. పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తమనే నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ప్రకటిస్తారని ఆశించారు. అయితే, ఇందుకు భిన్నంగా మొదటి నుంచి పార్టీలో ఉండి.. గెలవకపోయినప్పటికీ ఇన్‌చార్జీలుగా ఉన్నవాళ్లే రానున్న రోజుల్లోనూ అదే పదవిలో కొనసాగుతారని అధికార పార్టీ అధినేత తేల్చిచెప్పినట్టు తెలిసింది. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా విడుదల చేసే నిధులూ ఈ ఇన్‌చార్జీల ఆధ్వర్యంలోనే ఖర్చు చేస్తారని కూడా ఖరాఖండిగా స్పష్టం చేసినట్టు సమాచారం. ఫలితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు చెప్పిన నేతలకూ ఈ పరిణామాలు కాస్తా మింగుడుపడటం లేదు.
 
 కోడుమూరులో విష్ణుదే హవా
కోడుమూరు ఎమ్మెల్యేగా గెలిచిన మణిగాంధీ అధికార పార్టీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్టు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులు కాస్తా తన పేరు మీదనే విడుదల అవుతాయని ఆశించారు. అయితే, తాజాగా కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం  ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మార్చి 31న ఉత్తర్వులు కూడా జారీచేసింది. పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ విష్ణువర్దన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ నిధులు మంజూరు చేస్తున్నామని..

మరో రూ.2 కోట్లను ఉపాధి హామీ కింద సమకూర్చుకుని మొత్తం రూ.4 కోట్లను ఖర్చు చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తద్వారా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ తమ నియోజకవర్గ ఇన్‌చార్జీలకే అప్పగించనున్నట్టు అధికార పార్టీ తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలో తాము పార్టీ మారినప్పటికీ ఏం ఉపయోగమంటూ నాయకులు పునరాలోచనలో పడినట్లు సమాచారం.
         
 ఆళ్లగడ్డ నిధులు గంగులవే..
గతంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి అని.. ఆయనకు ఏకంగా రూ.5 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిలప్రియ కాస్తా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులో కేసు వేస్తానని కూడా ప్రకటించారు. కొన్ని నెలల తర్వాత భూమా అఖిలప్రియ కాస్తా అధికార పార్టీలో చేరారు. అయినప్పటికీ గంగుల ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయని అధికారపార్టీ స్పష్టం చేసింది. నంద్యాలలోనూ ఇదే తరహాలో తానే నియోజకవర్గ ఇన్‌చార్జినని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఈ నిర్ణయాన్ని పార్టీ కూడా వ్యతిరేకించలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ మారినప్పటికీ తమకు ప్రొటోకాల్ తప్ప.. అభివృద్ధి నిధులు ఒక్కపైసా వచ్చే అవకాశం లేదని పార్టీ మారిన నేతలు వాపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు చెబుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇది తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిణామమని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement