MLA manigandhi
-
పసుపలలో ఎమ్మెల్యే నిలదీత
కర్నూలు సీక్యాంప్ : ‘గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయని గ్రామదర్శిని అంటూ మా దగ్గరకు వచ్చారు. మా సమస్యల సంగతేంటి’ అంటూ పసుపల గ్రామస్తులు ఎమ్మెల్యే మణిగాంధీని నిలదీశారు. బుధవారం పసుపలలో గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10గంటలకు గ్రామానికి చేరుకొని గ్రామంలో తిరుగుతున్న తెలుగుదేశం నాయకులను మహిళలు అడుగడుగున నిలదీశారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, నాలుగేళ్ల తర్వాత గ్రామాల్లోకి వస్తే ఫలితం ఏంటని ప్రజలు నిలదీశారు. మీకు డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ అయ్యాయి కదా అని టీడీపీ నేతలు అడగ్గా మా గ్రామంలో ఎవ్వరికి కాలేదని ప్రజలు బదులిచ్చారు. దీంతో చేసేదేమీ లేక తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యే మణిగాంధీ అక్కడి నుంచి వెనుదిరిగారు. -
ఎమ్మెల్యే మణిగాంధిపై విరుచుకుపడ్డ జనం
బురాన్‌దొడ్డి(సి.బెళగల్) : ‘‘అయ్యా మేము నాలుగేళ్లుగా తిరుగుతున్నా పింఛన్ ఇవ్వడం లేదు. మేము సచ్చాక పింఛన్ ఇవ్వాలనుకున్నారా..?’’ అంటూ వృద్ధులు ఎమ్మెల్యే మణిగాంధీని, అధికారులను నిలదీశారు. బుధవారం మండల పరిధిలోని బురాన్‌దొడ్డిలో సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ నోడల్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గోనెనాయక్ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మండల ప్రత్యేకాధికాధికారి ప్రసాదరావు, ఎంపీడీఓ సిద్ధాలింగమూర్తి, తహసీల్దార్ అన్వర్‌హుసేన్, ఆర్అండ్బీ ఏఈ ఫణీరామ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వృద్ధులు గంగన్న, జాన్, వితంతువులు వరలక్ష్మి, సువర్ణ, మైబూబాబీ, గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగమ్మ పింఛన్‌కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో తాగడానికే నీళ్లు లేవని గ్రామస్తులు దేవరాజు, మాదన్న, ఆనంద్ తదితరులు అధికారులను నిలదీశారు. అదేవిధంగా గ్రామంలోని ఎస్సీలకు శ్మశానానికి స్థలం కేటాయించాలని చంద్రన్న, సుంకన్నలు అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమనెమ్మ, అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీకి అమ్ముడుబోయిన ఎమ్మెల్యేను
కోడుమూరు: ‘‘ ఆత్మ సాక్షిగా చెబుతున్న నేను తెలుగుదేశం పార్టీకి అమ్ముడుబోయిన ఎమ్మెల్యే. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు. నేను వాళ్లమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను.’’ అంటూ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిగాంధీ విలేకరులతో మాట్లాడారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 53 వేలు ఓట్ల మెజార్టీతో గెలిచానని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత్వాల కోసం రూ.13.50లక్షలు చెల్లిస్తే.. ఇప్పటికీ తనకు, తన కార్యకర్తలకు ఇవ్వలేదన్నారు. సభ్యత్వ కార్డులను.. కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు దొంగలించారని ఆరోపించారు. బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని, ఆరు నెలలు ఓపిక పడితే.. రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయన్నారు. ఏ నాయకులు ఏ పార్టీలో ఉంటారో ఎవ్వరికి అర్థంగాని పరిస్థితు లేర్పడతాయన్నారు. ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డితో రాజీ కావాలని వర్ల రామయ్య, ఇన్చార్జీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనను బతిమిలాడినా లెక్క చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలైన మానుకొంటాను కాని, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి పనిచేసే సమస్యే లేదని..పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదన్నారు. -
వాళ్లే.. మా వాళ్లు!
► టీడీపీలో ఇన్‌చార్జీలదే హవా ► నియోజకవర్గ నిధులూ వారికే.. ► తేల్చి చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ► నివ్వెరపోతున్న వలస నేతలు ► నియోజకవర్గ అభివృద్ధి కోసమే ► పార్టీ మారుతున్నట్లు ప్రకటనలు ► తాజా నిధుల మంజూరులో దక్కని స్థానం ► ప్రజల్లోకి వెళ్లేదెలాగనే ఆందోళన నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెబుతున్న నేతలకు అధికార పార్టీ షాక్ ఇస్తోంది. ఇదివరకు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులకే పెద్దపీట వేస్తుండటం పట్ల వలస నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు వచ్చిన అవకాశాన్ని కాస్తా చేజార్చుకుని.. ‘పచ్చ’నోట్లకు తలొగ్గిన నేతల్లో అంతర్మథనం మొదలయింది. పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని భావించిన నేతలకు మొదటికే మోసం రావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవమానాలు తప్పట్లేదు. పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తమనే నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ప్రకటిస్తారని ఆశించారు. అయితే, ఇందుకు భిన్నంగా మొదటి నుంచి పార్టీలో ఉండి.. గెలవకపోయినప్పటికీ ఇన్‌చార్జీలుగా ఉన్నవాళ్లే రానున్న రోజుల్లోనూ అదే పదవిలో కొనసాగుతారని అధికార పార్టీ అధినేత తేల్చిచెప్పినట్టు తెలిసింది. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా విడుదల చేసే నిధులూ ఈ ఇన్చార్జీల ఆధ్వర్యంలోనే ఖర్చు చేస్తారని కూడా ఖరాఖండిగా స్పష్టం చేసినట్టు సమాచారం. ఫలితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు చెప్పిన నేతలకూ ఈ పరిణామాలు కాస్తా మింగుడుపడటం లేదు. కోడుమూరులో విష్ణుదే హవా కోడుమూరు ఎమ్మెల్యేగా గెలిచిన మణిగాంధీ అధికార పార్టీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్టు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులు కాస్తా తన పేరు మీదనే విడుదల అవుతాయని ఆశించారు. అయితే, తాజాగా కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మార్చి 31న ఉత్తర్వులు కూడా జారీచేసింది. పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జీ విష్ణువర్దన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ నిధులు మంజూరు చేస్తున్నామని.. మరో రూ.2 కోట్లను ఉపాధి హామీ కింద సమకూర్చుకుని మొత్తం రూ.4 కోట్లను ఖర్చు చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తద్వారా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ తమ నియోజకవర్గ ఇన్‌చార్జీలకే అప్పగించనున్నట్టు అధికార పార్టీ తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలో తాము పార్టీ మారినప్పటికీ ఏం ఉపయోగమంటూ నాయకులు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఆళ్లగడ్డ నిధులు గంగులవే.. గతంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి అని.. ఆయనకు ఏకంగా రూ.5 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిలప్రియ కాస్తా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులో కేసు వేస్తానని కూడా ప్రకటించారు. కొన్ని నెలల తర్వాత భూమా అఖిలప్రియ కాస్తా అధికార పార్టీలో చేరారు. అయినప్పటికీ గంగుల ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయని అధికారపార్టీ స్పష్టం చేసింది. నంద్యాలలోనూ ఇదే తరహాలో తానే నియోజకవర్గ ఇన్చార్జినని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ కూడా వ్యతిరేకించలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ మారినప్పటికీ తమకు ప్రొటోకాల్ తప్ప.. అభివృద్ధి నిధులు ఒక్కపైసా వచ్చే అవకాశం లేదని పార్టీ మారిన నేతలు వాపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు చెబుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇది తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిణామమని వాపోతున్నారు. -
కోడుమూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కర్నూలు సీక్యాంప్: తాజా చేరికలతో టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులంతా కలిసి శుక్రవారం కర్నూలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము అండగా నిలిచామని, అయితే ఇంకో వర్గం తనను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే మణిగాంధీ ద్వారా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మణిగాంధీని టీడీపీ ఇన్చార్జ్ ఇస్తే తనతోపాటు తన వర్గీయులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తారని హెచ్చరించారు. తమ మద్దతుతోనే జిల్లాలో టీడీపీ..ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకుందన్నారు. త్యాగాలు చేసిన తమను కాదని, ఇంకొకరికి పార్టీ పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తాగుబోతు, తిరుగుబోతని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తీవ్ర విమర్శలు చేశారు. జనాకర్షణ లేని నాయకుడని మండిపడ్డారు. తమ మద్దతు లేకుండా మణిగాంధీకి పార్టీలో ఎలాంటి అవకాశం కల్పించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
కలెక్టరేట్‌ను ముట్టడించిన గ్రామస్తులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి నిండు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందంటూ గొందిపర్ల గ్రామస్తులు కర్నూలు కలెక్టరేట్‌ను గురువారం ముట్టడించారు. ఉదయం 12.30 గంటలకు గొందిపర్ల గ్రామస్తులతో పాటు క్వార్టర్స్, ఇందిరమ్మ కాలనీ, పూలతోట, సుందరయ్యనగర్ వాసులు గాంధీ విగ్రహం ఎదుట బైటాయించారు. బాధిత విద్యార్థి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ బయటకు వచ్చి తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని భీష్మించారు. రెండ్రోజుల కిందట బ్రిడ్జి లేకపోవడంతో ఉస్మానియా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే మోహన్ అనే విద్యార్థి అకస్మాత్తుగా వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయి మృత్యువాతపడినట్లు వారు కన్నీటిపర్యంతమయ్యారు. సకాలంలో బ్రిడ్జి నిర్మించి ఉన్నట్లైతే ఓ నిండుప్రాణం బలై ఉండేది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులకు మద్దతుగా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, అలంపూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మద్దుతు తెలిపారు. గంటకుపైగా ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాపిక్ డీఎస్పీ రామచంద్ర అక్కడికి చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. దీంతో డీఎస్పీ స్పందిస్తూ.. పది మంది గ్రామస్తులు వస్తే కలెక్టర్‌తో మాట్లాడిస్తానంటూ చెప్పడంతో వారు ధర్నా విరమించారు.